breaking news
Parliament Information
-
పార్లమెంటు సమాచారం
అనాథలకు కోటా ఇవ్వలేం: ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్ క ల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంక్లిష్టతల వల్ల రిజర్వేషన్లో అదనపు నిబంధనలను పొందుపరచడం సాధ్యం కాదని, రిజర్వేషన్ 50 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు చెప్పిందని సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. అనాథలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా మాదిరి కోటా కల్పించాలని బీజేపీ సభ్యుడు అవినాశ్ రాయ్ ఖన్నా ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరిగింది. తర్వాత ఖన్నా బిల్లును ఉపసంహరించుకున్నారు. 67 శాతం మందికి ఆధార్: విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశ జనాభాలో 67 శాతం మందికి ఆధార్ కార్డులు(81.78 కోట్ల కార్డులు) ఇచ్చిందని ప్రణాళిక మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ లోక్‌సభకు తెలిపారు. తగ్గిన హెచ్ఐవీ కేసులు: దేశంలో 2007లో హెచ్ ఐవీ పాజిటివ్ కేసులు 2.74 లక్షలుగా నమోదవగా 2011 నాటికి వాటి సంఖ్య 57 శాతం తగ్గి 1.16 లక్షలకు చేరుకుందని, జాతీయస్థాయిలో హెచ్ఐవీ వ్యాప్తి 0.41 నుంచి 0.27కు తగ్గిందని ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభకు వివరించారు. ఇరాన్లో యూరియా ప్లాంటు: దేశంలో యూరియా కొరత లేకుండా చూసేందుకు ఇరాన్లో యూరియా ప్లాంటును ఆ దేశ సంస్థలతో కలిసి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎరువుల మంత్రి అనంత్ కుమార్ రాజ్యసభకు చెప్పారు. భారత్ దిగుమతి చేసుకోవడానికి వీలుగా ఈ ప్లాంటును 13 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. నేతాజీ రెజిమెంట్ కావాలి: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో దేశ సైన్యంలో దళాన్ని(రెజిమెంట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్‌హూడా లోక్‌సభలో ‘బోస్ రెజిమెంట్ బిల్లు’ను ప్రవేశపెట్టారు. మురుగుతున్న నిర్భయ నిధులు: ‘నిర్భయనిధి’లో రూ.1,273 కోట్లు మురిగిపోతున్నట్లు మహిళాశిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభకు చెప్పారు. 758 చట్టాల రద్దు బిల్లు: కాలం చెల్లిన 758 ద్రవ్యవినియోగ చట్టాలను (అప్రాప్రియేషన్ యాక్ట్స్)ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును న్యాయమంత్రి డీవీ సదానంద గౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
అమ్మో! అన్ని కిడ్నాప్లా!
న్యూఢిల్లీః పార్లమెంటు ఉభయసభలు లోక్‌సభ, రాజ్యసభలలో ఈరోజు పలు అంశాలపై చర్చలు జరిగాయి. సభ్యులు అడిగిన అనేక ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. * మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కిడ్నాప్‌లు, అపహరణ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,57,717 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. * దేశంలోని మావోయిస్టు గ్రూపుల్లో మావోయిస్టుల సంఖ్య సుమారు 8,500 ఉండొచ్చని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అయితే వీరికి మద్దతిచ్చే వారి సంఖ్య భారీగానే ఉండొచ్చని, ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు మావోయిస్టులు ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపింది. * సివిల్ సర్వీస్ విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరికి చెందిన అధికారులు 2,751 మంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఐఏఎస్ అధికారుల్లో 1,200, ఐపీఎస్ అధికారుల్లో 880, ఐఎఫ్ఎస్ అధికారుల్లో 671 మంది ఉన్నట్లు వివరించింది. * రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా(ఆర్ఎన్ఐ) వద్ద నమోదు చేసుకున్న పబ్లికేషన్ సంస్థల సంఖ్య 99,660 అని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. నాలుగేళ్లలో రిజిస్ట్రేషన్లు 28.79 శాతం పెరిగినట్లు తెలిపింది. * కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) వద్ద 2012-13 సంవత్సరంలో 28,801 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర కుమార్ లోక్‌సభకు తెలిపారు. * విదేశీ నిధులు (నియంత్రణ) చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద వార్షిక ఆదాయం వివరాలు సమర్పించని 21,493 స్వచ్చంద సంస్థల(ఎన్జీవోలు)కు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఎఫ్సీఆర్ఏ కింద 2014 జూలై 16 వరకూ నమోదు చేసుకున్న ఎన్జీవోల సంఖ్య 42,529 అని తెలిపారు. * 39 సెంట్రల్ యూనివర్సీటీల్లో 16,692 అధ్యాపక పోస్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, వీటిలో 6,251 పోస్టులు (సుమారు 40 శాతం) ఖాళీగా ఉన్నాయని కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. * ఆరావళి పర్వత శ్రేణుల్లో చెట్ల అక్రమ నరికివేత, కూల్చివేతకు సంబంధించి 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6,206 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఈ కేసుల్లో నేరస్తుల నుంచి రూ. 1 కోటి 42 లక్షలు పరిహారంగా వసూలు చేసినట్లు తెలిపింది. * మహిళలు రాత్రిపూట కూడా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఓవర్‌టైమ్ గంటలను పెంచేందుకు వీలుగా ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.