పార్లమెంటు సమాచారం | parliament information | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమాచారం

Apr 25 2015 1:24 AM | Updated on Sep 3 2017 12:49 AM

అనాథలకు కోటా ఇవ్వలేం: ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది.

అనాథలకు కోటా ఇవ్వలేం: ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు రిజర్వేషన్ క ల్పించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంక్లిష్టతల వల్ల రిజర్వేషన్‌లో అదనపు నిబంధనలను పొందుపరచడం సాధ్యం కాదని, రిజర్వేషన్ 50 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు చెప్పిందని సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. అనాథలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా మాదిరి కోటా కల్పించాలని బీజేపీ సభ్యుడు అవినాశ్ రాయ్ ఖన్నా ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరిగింది. తర్వాత ఖన్నా బిల్లును ఉపసంహరించుకున్నారు.
 
 67 శాతం మందికి ఆధార్: విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశ జనాభాలో 67 శాతం మందికి ఆధార్ కార్డులు(81.78 కోట్ల కార్డులు) ఇచ్చిందని ప్రణాళిక మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభకు తెలిపారు.
 
 తగ్గిన హెచ్‌ఐవీ కేసులు: దేశంలో 2007లో హెచ్ ఐవీ పాజిటివ్ కేసులు 2.74 లక్షలుగా నమోదవగా 2011 నాటికి వాటి సంఖ్య 57 శాతం తగ్గి 1.16 లక్షలకు చేరుకుందని, జాతీయస్థాయిలో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.41 నుంచి 0.27కు తగ్గిందని ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా లోక్‌సభకు వివరించారు.  
 
 ఇరాన్‌లో యూరియా ప్లాంటు: దేశంలో యూరియా కొరత లేకుండా చూసేందుకు ఇరాన్‌లో యూరియా ప్లాంటును ఆ దేశ  సంస్థలతో  కలిసి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఎరువుల మంత్రి అనంత్ కుమార్ రాజ్యసభకు చెప్పారు. భారత్ దిగుమతి చేసుకోవడానికి వీలుగా ఈ ప్లాంటును 13 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు.
 
 నేతాజీ రెజిమెంట్ కావాలి: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో దేశ సైన్యంలో దళాన్ని(రెజిమెంట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్‌హూడా లోక్‌సభలో ‘బోస్ రెజిమెంట్ బిల్లు’ను ప్రవేశపెట్టారు.  
 
 మురుగుతున్న నిర్భయ నిధులు: ‘నిర్భయనిధి’లో రూ.1,273 కోట్లు మురిగిపోతున్నట్లు మహిళాశిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభకు చెప్పారు.
 
 758 చట్టాల రద్దు బిల్లు: కాలం చెల్లిన 758 ద్రవ్యవినియోగ చట్టాలను (అప్రాప్రియేషన్ యాక్ట్స్)ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును న్యాయమంత్రి డీవీ సదానంద గౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Advertisement

పోల్

Advertisement