breaking news
Paidibhimavaram
-
పరిశ్రమలకు సముద్రపు నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీటిగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయడానికి రూ.400 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. పైడి భీమవరం ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో వంటి 26కుపైగా ఫార్మా, రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పరిశ్రమలకు అవసరమైన నీటికోసం అత్యధికంగా భూగర్భజలాలపై ఆధారపడుతున్నారు. తీరప్రాంతంలోని పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మెంటాడ వద్ద సుమారు 50 ఎకరాల్లో దీన్ని నెలకొల్పనున్నారు. తొలిదశలో రోజుకు 35 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసే విధంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న కాలంలో దీన్ని వంద మిలియన్ లీటర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీఐఐసీ శ్రీకాకుళం జోనల్ మేనేజర్ యతిరాజులు తెలిపారు. ఇక్కడ శుద్ధిచేసిన నీటిని పైప్లైన్ల ద్వారా పైడి భీమవరం పారిశ్రామికవాడ, దాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అందించనున్నారు. దీనివల్ల భూగర్భ జలాల వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్లో భాగస్వామ్యం కోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానిస్తోంది. బిల్డ్ ఓన్ ఆపరేట్ (బీవోవో), బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్సఫర్ (బీవోవోటీ) విధానంలో ఆహ్వానిస్తున్న ఈ టెండర్లలో పాల్గొనడానికి ఈ నెల 13 చివరితేదీ. నాలుగుపైసలకే లీటరు నీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అతిచౌకగా నీటిని అందించే డీశాలినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2019 ఆగస్టులో ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉన్న హెచ్2ఐడీ డీశాలినేషన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇజ్రాయిల్‌కు చెందిన కొంతమంది ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి డీశాలినేషన్‌లో ఐడీఈ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువ అవుతుందని తెలిపారు. కేవలం నాలుగు పైసలకే లీటరు నీటిని ఉత్పత్తిచేసే అవకాశం డీశాలినేషన్‌లో ఉండటంతో తీరంలో పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్న పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు డీశాలినేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారాన్ని చూపిస్తోంది. -
నేడు జిల్లాకు జగన్ రాక
* పతివాడపాలెం, పైడి భీమవరంలలో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ * వంశధార నిర్వాసితులకు సంఘీభావం * పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వెల్లడి శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె వివాహం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో జగన్మోహన్రెడ్డి 8.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లాకు వస్తారన్నారు. మార్గమధ్యలో 9.30 గంటలకు పైడిభీమవరం, 10 గంటలకు పతివాడపాలెం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆమె పేర్కొన్నారు. 11 గంటలకు ఆమదాలవలస బ్రిడ్జి వద్ద పార్టీ నాయకులంతా జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలకనున్నారన్నారు. 11.30 గంటలకు మండల కేంద్రమైన సరుబుజ్జిలిలో కూడా జగన్‌కు ఘనస్వాగతం పలకనున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హిరమండలం వద్దనున్న వంశధార నిర్వాసితులు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాల్ని చెప్పుకుంటారని ఆమె తెలిపారు. అనంతరం కొత్తూరు మండలం మాతలలో కలమట వెంకటరమణ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు. ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు ఆమదాలవలస: జగన్ పర్యటన విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ైెహ పవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం పార్టీ శ్రేణులను కోరారు. పట్టణంలోని స్వగృహంలో శుక్రవారం విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమదాలవలస పట్టణ శివార్లలోగల టీ.ఎస్.ఆర్ జూనియర్ కళాశాల ఎదుట పాల కొండ రోడ్ వద్ద ఆయనకు నియోజకవర్గ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. నియోజకవర్గంలో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాలువారు పెద్ద ఎత్తున పాల కొండ రోడ్లోగల టీ.ఎస్.ఆర్ కళాశాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ ప్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.