breaking news
Osmania University Student
-
అమెరికా వైఖరి నిజంగా మారిందా?
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ కు చేసిన సాయం (పదిహేను సంవత్సరాలు– 2లక్షల 10 వేల కోట్లు)పై చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య సంబంధాలపై కమ్ముకున్న నీలి మేఘాలను బయటపెట్టింది. దానికి స్పందనగా పాకిస్తాన్ కూడా సైనిక స్థావరంగా అంతకు ఎక్కువే అమెరికాకు సాయపడ్డామని చెప్తూనే, అవసరమైతే సాయాన్ని తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. తిరిగి ఇవ్వడం అసంభవమే కాని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాక్ చేసిన ప్రకటనగా దానిని భావించవచ్చు. పాక్ పరోక్ష మద్దతుతో పేట్రేగిపోతున్న ఉగ్రవాదులతో దశాబ్ద కాలంగా భారత్ బాధపడుతున్నా, పాక్ ద్వంద్వ వైఖరి ఎండగడుతున్నా పట్టించుకోకుండా వారికే మద్దతిస్తూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా మారిపోవడం భారత అనుకూల అంశమే అయినప్పటికీ నూతనంగా ఏర్పడిన పరిస్థితులపై భారత్ మరింత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజం నిలకడమీద తెలుస్తుంది అన్న చందంగా, మారుతున్న అగ్రరాజ్య వైఖరి మంచిదే అయినప్పటికీ దాని పర్యవసానాలు ఉంటాయనేది భవిష్యత్తులో బోధపడుతుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు రక్షణ కవచంలా మారి అణ్వాయుధాలను కలిగివున్న ఆ దేశానికి మరింత ఆయుధబలాన్ని అందచేసి, ఆర్థిక తోడ్పాటు అందజేసినట్లయితే, ‘అగ్నికి ఆజ్యంలా’ అక్కడి పాలన ఎప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నుండి సైనిక నియంతల చేతిలోకి మారుతుందో చెప్పలేని పరిస్థితిలో అణ్వాయుధాల భద్రత అనేది అయోమయమే. అంతే కాకుండా ఇప్పటికే నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లం ఘించి మరీ దాడులు చేస్తున్న పాక్ మరింతగా కవ్వింపు చర్యలకు పాల్పడితే రెండు దేశాల సంబంధాలు మరింత దిగజారిపోవటం తథ్యం. కావున అగ్రరాజ్యం అమెరికా వైఖరి ‘అటొచ్చి ఇటొచ్చి’ అన్న మాదిరిగా మారే పరిస్థితి ఉన్నందున భారత్ మరింత జాగరూకతతో పాటు, అంతర్జాతీయ యవనికపై పాక్ దుందుడుకు వైఖరిని బట్టబయలు చేయవలసిన అవసరం మరింతగా ఉంది. – వినోద్ కుమార్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ -
విజయ్ను వదలిపెట్టిన పోలీసులు
-
విజయ్ను వదలిపెట్టిన పోలీసులు
కొత్తగూడెం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్‌ని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచిపెట్టారు. మావోయిస్టులతో విజయ్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విజయ్ వద్ద హామీ పత్రం తీసుకున్నట్లు సమాచారం. కాగా విజయ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ. -
'విజయ్‌ని వెంటనే విడుదల చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో నిర్వహించిన సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. అరెస్ట్ చేసిన విద్యార్థి విజయ్‌ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థి విజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే అమలు చేస్తామని పేర్కొన్న కేసీఆర్.. ఎన్కౌంటర్, అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. కాగా, విజయ్ ప్రస్తుతం ఎక్కడున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.