breaking news
orlando attack
-
'మమ్మల్ని టార్గెట్ చేశారో.. మీరుండరు'
వాషింగ్టన్: తమతో పెట్టుకుంటే నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను హెచ్చరించారు. 'మేం ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మా దేశంగానీ, మా దేశంతో సంబంధాలు ఉన్న ఇతర దేశాలుగానీ మీ టార్గెట్ అయితే.. అది మీకు ఎప్పటికీ సురక్షితం కాదు. పూర్తిగా పెకలించేస్తాం' అని ఒబామా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ రక్షణశాఖ బృందంతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఐఎస్ తన ప్రాబల్యం ఉన్న ఇరాక్, సిరియాలో అంతరించి పోతుందని, ఆ సంస్థకు చెందిన టాప్ 120మంది నేతలను, కమాండర్లను హతం చేశామని.. ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు. ఇక ఐఎస్‌ను అసలు లేకుండా చేయడమే తమ అసలైన పని అని.. మున్ముందు మరింత వేగంగా పనిచేస్తామని చెప్పారు. ఇరాక్, సిరియా సేనలతో కలిసి మూకుమ్మడి దాడులు కొనసాగుతాయని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ కు ప్రధాన ఆదాయ వనరులు ఇంధనం అమ్మకాలు అని, అదే వారికి కోట్లలో ఆదాయాన్ని ఇస్తూ వారికి ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక నుంచి అలాంటి క్షేత్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసి వారిని ఆర్థికంగా బలహీనపరుస్తామని, ఆహార సౌకర్యాలు వంటివి కూడా లేకుండా చేస్తామని చెప్పారు. ఇతర దేశాలకుచెందిన ఫైటర్లు సైతం వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ను ధ్వంసం చేసే పనుల్లో మునిగిపోవడం సంతోషంగా ఉందని చెప్పారు. -
అమెరికా కాల్పుల్లో కొత్త ట్విస్ట్
న్యూయార్క్: అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన కాల్పులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ భార్యను ఈ కేసులో విచారణకు చేరుస్తున్నారు. ఆమెకు ఈ దాడి గురించి ముందే తెలిసి ఉంటుందని అమెరికా లా ఎన్ ఫోర్స్మెంట్ విభాగం అనుమానిస్తోంది. ఎందుకంటే దాడులు జరిగిన గే క్లబ్బుకు ఒమర్ మతీన్ ను ఆమె స్వయంగా అంతకుముందు పలుమార్లు తీసుకొని వెళ్లిందంట. అంతేకాదు.. ఈదాడికి వారం ముందు ఆమె పలు చోట్లకు అతడితోపాటు వెళ్లిందని, అలా ఇద్దరు వెళ్లిన సమయంలోనే దాడికి కావాల్సిన ఆయుధాలను మతీన్ సమర్చుకూర్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ దాడి గురించి తెలుసన్న కారణాలతో ఒమర్ భార్య అయిన నూర్ మతీన్‌ను త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. దాడులు జరిగిన వెంటనే ఆమెను ఈ కేసుకు సంబంధించి తొలుత ప్రశ్నించిన సమయంలో కూడా దాడితో సంబంధం లేని విషయాలు అనుమానాస్పదంగా చెప్పిందట. ఓర్లాండోలోని ఓ గేల నైట్ క్లబ్బుపై ఒమర్ దాడికి పాల్పడి 49మందిని దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరో 50మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి చరిత్రగా మిగిలిపోయింది. కాగా, ఒమర్ కు బయటనుంచి ఆదేశాలు రాలేదని, తానే ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడై ఈ దారుణానికి దిగాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా చెప్పారు. అయితే, ఇంతపెద్ద దాడి వెనుక భారీ కుట్రే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇప్పుడు కూపీలాగే క్రమంలో అతడి భార్యను అదుపులోకి తీసుకోనున్నారు. -
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వణుకు
ఆర్లాండో మారణకాండతో.. అమెరికాలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరొచ్చి తుపాకులతో మీద పడతారోనని భయం భయంగా గడుపుతున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్లాండో దారుణ మారణకాండకు కారణమైన ఉన్మాది ఒమర్ మతీన్‌ను ప్రేరేపించిన అంశం ఏమిటి? మతీన్ ఎన్నడూ ముస్లిం కమ్యూనిటీలో పెరగకపోవడం, ఆయనకు ఇస్లాం టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్న దానిపైనే ప్రధానంగా అమెరికా దర్యాప్తు అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి కొన్నాళ్ల క్రితం మతీన్ డిస్టర్బ్ అయ్యాడని, ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకోవడం ఏంటంటూ తనతో చాలాసేపు వాదన కూడా పెట్టుకున్నాడని మతీన్ తండ్రి ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్నది స్పష్టంగా తేలకపోయినా, ఎల్జీబీటీక్యూ (లెస్బేనియన్లు, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, కీర్) సంస్కృతిలో భాగంగా అవతరించిన నైట్ క్లబ్ లక్ష్యంగా ఓ ఉన్మాది దాడి చేయడం అంటేనే ఈ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించే స్వభావంతో మతీన్ దాడికి పాల్పడి ఉంటాడని మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనతో విభేదిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతోకాలంగా ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తున్న మతీన్‌కు ఎల్జీబీటీక్యూ ఉద్యమం గురించి మొదటి నుంచి తెలిసే ఉంటుందని, దేశంలో గే పెళ్లిళ్లను అనుమతించే వరకు సాగిన ఉద్యమం గురించి అవగాహన ఉన్న మతీన్ ఈ కారణంగా ఇంత దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడని మరికొంత మంది వాదన. మతీన్ దాడికి ముందే పోలీసులకు ఫోన్ చేసి తాను ఇస్లాం రాజ్యం కోసం ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పడం వల్ల ఇస్లాం టెర్రరిస్టులతో అతడికి సంబంధం ఉండి ఉంటుందని పోలీసు అధికారులు ముందుగా భావించారు. కానీ అతడికి వారితో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇస్లాం రాజ్యాన్ని కోరుకుంటున్న ఐఎస్ లాంటి టెర్రరిస్టు సంస్థలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇస్లాం రాజ్యం గురించి మతీన్ మాట్లాడి ఉంటాడన్నది ఓ వర్గం వాదన. అమెరికాలోని కొన్ని చర్చిలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎల్జీబీటీక్యూ కార్యకర్తల్లో ఈ దారుణం వణుకు పుట్టిస్తోంది. ఇక ఇలాంటి గే క్లబ్బులకు తాము వెళ్లమని కూడా గేలు చెబుతున్నారు. గే పెళ్లిళ్లను తొలుత వ్యతిరేకించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని గే హక్కులకు ఓకే చెప్పారు. ఇప్పుడు అదే అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన 'గే'లకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశంలో.. భారత దేశంలో గే సంస్కృతి శిక్షార్హమైన నేరం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ కింద శిక్ష విధిస్తారు. ఈ చట్టాన్ని భారత్‌లో పెద్దగా ప్రయోగించకపోయినా ఈ చట్టం కారణంగా గేలకు వ్యతిరేకంగా విద్వేషం పెరిగే ఆస్కారం ఉందన్న కారణంగా ఈ సెక్షన్ ఎత్తి వేయాలంటూ ఎప్పటి నుంచో ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. 377లోని కొన్ని క్లాజులను కొట్టివేయాలంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పును కూడా ఇచ్చింది. అయితే ఆ చట్టాన్ని కొట్టివేసే అధికారం కోర్టులకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందంటూ ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గతేడాది ఓ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీలకు అతీతంగా ఆయనకు సభ్యులెవరూ మద్దతు ఇవ్వక పోవడమే అందుకు కారణం.