breaking news
Orion spacecraft
-
నేడే ఓరియాన్ రాక
వాషింగ్టన్: చంద్రునిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆర్టెమిస్ 1 ద్వారా దాదాపు నెల క్రితం ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రానుంది. ఏకంగా 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి భూమిని చేరనుంది. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది. ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్ పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది. ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్ ల్యాండింగ్ కోసం నాసా తొలిసారిగా ‘స్కిప్ ఎంట్రీ’ టెక్నిక్‌ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట. అంతిమంగా ఓరియాన్ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ‘‘దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం’’ అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్‌హీడ్–మార్టిన్ తయారు చేసిన అత్యంత మందమైన హీట్ షీల్డ్‌ను ఓరియాన్కు అమర్చారు. ఆ ఏడు నిమిషాలే కీలకం...: ఓరియాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించాక తొలి ఏడు నిమిషాలను అత్యంత కీలకమైనవిగా నాసా అభివర్ణిస్తోంది. ఆ సందర్భంగా కనీసం 10 నిమిషాల పాటు స్పేస్‌క్రాఫ్ట్‌తో అన్నిరకాల సమాచార సంబంధాలూ తెగిపోతాయని చెబుతోంది. -
చంద్రుని చెంతకు ఓరియాన్
వాషింగ్టన్: పలు అడ్డంకుల్ని, బాలారిష్టాల్ని దాటుకుంటూ నాసా ఇటీవల ఎట్టకేలకు ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రున్ని చేరి చరిత్ర సృష్టించింది. అది చందమామకు వెనకవైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్లిందని నాసా సోమవారం ప్రకటించింది. దీన్ని అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణించింది. నాసా విడుదల చేసిన వీడియోల్లో చంద్రుడు అతి భారీ పరిమాణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్ రాకెట్ ద్వారా గత బుధవారం ఓరియాన్‌ను నాసా ప్రయోగించడం తెలిసిందే. ఇందులో మనుషులను పోలిన మూడు డమ్మీలను పంపారు. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో మిషన్ తర్వాత చంద్రున్ని చేరిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇది విజయవంతమైతే తర్వాతి మిషన్‌లో మనుషులను, 2024లో మూడో మిషన్‌లో వ్యోమగాములను పంపనున్నారు. సరిగ్గా ఓరియాన్ చంద్రునికి అత్యంత సమీపానికి చేరిన సమయానికే అరగంట పాటు దాన్నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఒక దశలో గందరగోళం నెలకొంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే శుక్రవారం మరో ఇంజన్‌ను పేల్చడం ద్వారా ఓరియాన్‌ను చంద్రుని కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. చంద్రునిపై దిగకుండా దాదాపు వారంపాటు అది కక్ష్యలోనే గడుపుతుంది. అనంతరం డిసెంబర్ 11న భూమికి తిరిగి రావాలన్నది ప్లాన్. -
ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించిన నాసా
వాషింగ్టన్: అరుణ గ్రహంపైకి మానవ యాత్రే లక్ష్యంగా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుక్రవారం ప్రయోగించింది. కేప్ కార్నివాల్ నుంచి డెల్టా -4 క్షిపణి సాయంతో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను నాసా ప్రయోగించింది. అంగారక గ్రహం మీదకు మనషులను తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని తలపెట్టింది. గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని తలపెట్టాలని నాసా భావించినా... సాంకేతిక సమస్యలతో ఈ రోజుకు వాయిదా పడింది.