breaking news
The opening ceremonies
-
గోదావరి వేడుకలకు నేడు శ్రీకారం
రాజమండ్రిలో ప్రారంభం ఉత్సవాల ప్రారంభ సూచికగా సాయంత్రం అఖండ పుష్కర జ్యోతి ప్రజ్వలన మంగళవారం ఉదయం పీఠాధిపతుల స్నానాలతో పుష్కరాలు ఆరంభం హైదరాబాద్, రాజమండ్రి: గోదావరి పుష్కరాలు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభం అవుతున్నప్పటికీ ఆరంభ వేడుకలు సోమవారం సాయంత్రం నుంచే ఊపందుకోనున్నాయి. రాజమండ్రి నగరంలో సాయంత్రం నాలుగు గంటలకు వెయ్యి మంది కళాకారులతో హారతి ఊరేగింపు అనంతరం ‘పుష్కరఘాట్’లో అఖండజ్యోతి ప్రజ్వలనతో పుష్కర వేడుకలు మొదలవుతాయి. అనంతరం గోదావరి అఖండహారతి, ఆకాశ దీపాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అర్ధరాత్రి వరకు సాంసృ్కతిక కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమాల్లో సినీ సంగీతదర్శకుడు థమన్, కూచిపూడి కళాకారిణి అంబిక తదితరులు పాల్గొంటారు. కంచి పీఠాధిపతులు మంగళవారం తెల్లవారుజామున 6.26 గంటలకు గోదావరిలో తొలిస్నానాలను చేసి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో విజయేంద్ర సరస్వతి స్నానమాచరించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రారంభ ముహూర్తానికే కుటుంబ సమేతంగా గోదావరి పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం రాజమండ్రిలో మీడియాకు వెల్లడించారు. పుష్కర పూజలకు ప్రభుత్వ ధరలు గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్ద ప్రధానంగా నిర్వహించే పూజలకు దేవాదాయశాఖ ధరలను ఖరారు చేసింది. పిండప్రదానం పూజ ధర రూ. 300గానూ, గోదావరి పూజ, ఇతర సంకల్పాలకు రూ. 150, ముసివాయనం పూజకు రూ. 200, స్వయంపాకం పొట్లాలు ఒక్కొక్కటికి రూ. 200లుగా ధరలను ఖరారు చేశారు. భక్తులు నేరుగా పూజారులకే ప్రభుత్వ నిర్ణయించిన ధరలు చెల్లించి పూజలు చేయించుకోవాలి. నిర్ణీత ధరలకు పూజలు నిర్వహించేలా 4,295 మంది పూజార్లకు ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వీరు షిప్టుల వారీగా ఉంటారు. కోలాహలంగా పుష్కర స్వాగత యాత్ర కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో రెండు రోజుల ముందే పుష్కర సందడి మొదలైంది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన పుష్కర స్వాగత యాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక బృందాల నృత్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాటాలతో స్వాగత యాత్ర వైభవంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ యాత్రలో పాల్గొన్నారు. గోదావరికి మహానీరాజనం పుష్కర స్వాగత యాత్ర అనంతరం గోష్పాదక్షేత్రంలో నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై గోదావరికి నీరాజనం సమర్పించారు. పండితులు దోర్భల ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గోదావరికి మహానీరాజనం సమర్పించారు. గోష్పాద క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాలకు రండి.. హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను గోదావరి పుష్కరాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ పర్యటన వివరాలను గవర్నర్‌కు వివరించారు. జపాన్ పర్యటన అనంతరం న్యూఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన అంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు గవర్నర్‌పై తన కేబినెట్లోని మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వివాదం సద్దుమణిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. పుష్కర ఏర్పాట్లు గురించి గవర్నర్ అడగ్గా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఇంకా ఏర్పాట్లలో లోపాలే... పుష్కరాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్డి సమస్య పెద్ద ఇబ్బందిగా మారబోతుంది. ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఈ అంశం తీవ్ర సమస్యగా మారుతుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన దాదాపు 1,400 రెడీమేడ్ మరుగుదొడ్లను ప్రధాన ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెడీమేడ్ మరుగుదొడ్ల నిర్వహణసరిగా కనిపించడం లేదు. మురుగునీటి మళ్లింపు చర్యలు సరిగా లేవు. ఫలితంగా రెడీమేడ్ మూత్రవిసర్జన శాలలు, మరుగుదొడ్లు భక్తులకు సరిగా ఉపయోగపడే అవకాశాలు ఉండవని రాజమండ్రి నుంచి పలువురు సాక్షి ప్రధాన కార్యాలయానికి ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. -
జాబుల జాతర
వచ్చే నెలలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: కేసీఆర్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ శ్రీకారం ► రూ.2,500 కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ► ఈ ఏడాదిలోనే 50 వేల ఇళ్ల నిర్మాణం ► రూ. 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలు ► రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: వచ్చే నెల నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఇంకెంతో కాలం నిరీక్షింప చేయదలుచుకోలేదని, పలు ప్రభుత్వ శాఖల్లోని 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూలై నుంచే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. తొలి రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఉదయం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు కొత్త వరాలను ప్రకటించారు. ‘నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ‘గత ఏడాది అనేక కార్యక్రమాల వల్ల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టలేకపోయాం. రూ.5.04 లక్షల ఖర్చుతో ఒక్కో ఇంటిని నిర్మించబోతున్నాం. ఈ ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 50 వేల ఇళ్లను నిర్మించబోతున్నాం. వలస జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్ ఖిల్లాగా మారిన నల్లగొండ జిల్లాల కన్నీళ్లు తుడవడానికి రూ.35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు, కరువు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించేందుకు రూ. 30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం’ అని సీఎం వెల్లడించారు. పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డీజీపీ ఆధ్వర్యంలో కమిటీని వేశామని తెలిపారు. ‘మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేం దుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుధీర్, చెల్లపల్ల ఆధ్వర్యంలో 2 కమిషన్లను నియమించాం. వాటి నివేదికలు అందిన వెంటనే రిజర్వేషన్ల పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 నాటికి నిరంతర విద్యుత్ ‘తెలంగాణ వస్తే కష్టాలు తప్పవని, అంధకార బంధురమవుతుందని అసత్య ప్రచారం చేశారు. ఆరేడు నెలల్లోనే విద్యుత్ వెలుగులు విరజిమ్మే స్థాయికి తెలంగాణ ఎదిగింది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా తెలంగాణను దేశంలో అత్యధిక మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.91 వేల కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్గొండ జిల్లా దామరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ సాకారం కాబోతోంది. 2018 నాటికి తెలంగాణలో అన్ని రంగాలకు.. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. పేదల సంక్షేమమే ధ్యేయం పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, దేశచరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏటా రూ.28 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. అవసరమైతే గ్రాంట్లు ఇచ్చి ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ‘అంగన్వాడీలకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం. రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాల మాఫీని చిత్తశుద్ధితో అమలు చేసినం. రూ.400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించాం. మహిళల భద్రతకు షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేశాం. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధ్వర్యంలో రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలో చెరువులు కునారిల్లిపోయాయి. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రాష్ట్రంలోని 46 వేల చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తెస్తాం. సమైక్య రాష్ట్రంలో అటవీ సంపద స్మగ్లర్ల పాలైంది. భవిష్యత్తు తరాలకు సమశీతోష్ణ తెలంగాణను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 300 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. జూలైలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరూ పాలుపంచుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం. - సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు మోదీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: విభజనతో రెండు రాష్ట్రాలుగా ఏర్పాటైన ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుపోవాలని ఆకాంక్షించారు. వికాసయాత్రలో కష్టపడుతున్న ఏపీ ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న ఇటలీకి కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.