breaking news
Online health test
-
ఆన్లైన్ చెకప్‌లతో చేటు
లండన్ : బిజీ లైఫ్‌లో వైద్యుల వద్దకు వెళ్లే తీరికలేని వారు ఆన్లైన్ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు, వైద్యుల్లో 43 శాతం సురక్షితం కాదని కేర్ క్వాలిటీ కమిషన్ నివేదిక హెచ్చరించింది. వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్స్ను ఆఫర్ చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఆన్లైన్ వైద్య సేవల సంస్ధల్లో సగానికి సగం సంస్ధల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోగిని సరిగ్గా పరీక్షించకుండానే ఆన్లైన్ వైద్యులు పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులకు మందులను సూచిస్తున్నారని పేర్కొంది. మరికొన్ని సంస్థలు ప్రమాదకర మందులను సైతం సిఫార్సు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంపెనీలు వెబ్‌క్యామ్, లేదా స్కైప్ ద్వారా వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఆన్లైన్లో ఫాంను పూర్తిచేసిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తుంటారు. రెండు గంటల పాటు పరీక్షించాల్సిన అనారోగ్య సమస్యలను సైతం పదినిమిషాల వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్తో తేల్చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి భారీ మొత్తం గుంజుతున్నారని ఆ సంస్థ తెలిపింది. రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోకుండా, పూర్తిగా పరీక్షలు నిర్వహించకుండానే ఆన్లైన్ డాక్టర్లు హై డోసేజ్ మందులను సిఫార్సు చేయడం ఆందోళనకరమని పేర్కొంది. -
ఉచితంగా ఆన్లైన్ హెల్త్టెస్ట్
లండన్: ఇంకో ఐదేళ్లపాటు మనం జీవించే అవకాశం ఉందా, లేదా ? అన్న అంశాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ఓ ఐదు నిమిషాల ఆన్లైన్ టెస్ట్‌ను తయారు చేశారు. 40 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సుగలవారిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఈ ఆన్లైన్ టెస్ట్‌లో మహిళలకు సులభమైన 11 ప్రశ్నలను, పురుషులకు అంతే సులభమైన 13 ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టి వాటి ఆధారంగా మరో ఐదేళ్లు మనం బతికే అవకాశం ఉందా, లేదా అన్న విషయాన్ని తేల్చి చెబుతారు. తమ అంచనాలు కచ్చితంగా ఉంటాయని టెస్ట్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘యుబుల్ (యుబీబీఎల్ఈ)’ వెబ్‌సైట్‌పై గురువారం ఉదయం ఈ హెల్త్ టెస్ట్‌ను ఆవిష్కరించారు. ఇది ఉచితంగానే ప్రజలందరికి అందుబాటులో ఉంటుంది. బ్రిటన్‌లోని బయోబ్యాంక్లు వాలంటీర్లుగా కొనసాగుతున్న ఐదు లక్షల మంది ప్రజల గత ఐదేళ్ల ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేయడం ద్వారా ఈ టెస్ట్‌ను రూపొందించామని, ఇప్పటికే 35వేల మందిపై దీన్ని ప్రయోగించి చూడగా, 80 శాతం ఫలితాలు కచ్చితంగా ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ప్రొఫెసర్ ఎరిక్ ఇంగెల్సన్ తెలిపారు. ఈ హెల్త్ టెస్ట్‌కు రూపకల్పన చేసి శాస్త్రవేత్తల బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. ఆయన బృందం పరిశోధన వివరాలను ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’లో కూడా గురువారం నాడే ప్రచురించారు. ప్రధానంగా తాము బ్రిటన్ ప్రజల లైవ్స్టైల్ను, వారి మెడికల్ హిస్టరీని పరిగణలోకి తీసుకొని ఆన్లైన్ టెస్ట్‌ను రూపొందించడం వల్ల టెస్ట్‌లో బ్రిటన్ ప్రజల ఫలితాలే కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఇంగెల్సన్ వివరించారు. టెస్ట్‌లో పురుషులకు వేసే ప్రశ్నలు 1. మీ వయస్సెంత. 2. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు. 3. మీకు ఎన్ని కార్లు, వ్యాన్లు ఉన్నాయి. 4. మీకు పొగతాగే అలవాటు ఉందా. ఉంటే ఎంతగ్యాప్లో తాగుతారు 5. మొత్తంగా మీ ఆరోగ్యం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు. 6. ఎంత వేగంతో మీరు నడుస్తారు. 7. డాక్టర్ ఎప్పుడైనా మీకు మధుమేహ వ్యాధి ఉన్న చెప్పారా. 8. క్యాన్సర్ ఉందని చెప్పారా. 9. గుండెపోటు, బీపీ ఉందని చెప్పారా. 10. రెండేళ్ల క్రితం తీవ్రమైన జబ్బుబారిన పడ్డారా, ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారా. 11. మీకేమైన అటెండెంట్, అంగవికల అలవెన్సులు వస్తున్నాయా? ఇక మహిళలకు వేసే ప్రశ్నలు స్వల్ప తేడాలతో ఇలాగే ఉంటాయి. ఎంత మంది పిల్లలు లాంటి ప్రశ్నలు ఉంటాయి.