breaking news
One Town
-
రమేశ్ మద్యం సేవిస్తుండగా వీడియో తీసిన శివాని!
క్రైమ్: విశాఖపట్నం వన్‌టౌన్ కానిస్టేబుల్ రమేశ్ మృతి కేసులో ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. గుండెపోటుతో తన భర్త చనిపోయాడని భార్య శివాని(జ్యోతి) చెబుతుండగా.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో భర్తను చంపించి ఉంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన తర్వాతే కేసు వివరాలు వెల్లడిస్తామని ఎంవీపీ సీఐ మల్లేశ్వర రావు సాక్షితో తెలిపారు. 2009 లో కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరాడు బర్రి రమేష్. 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే.. ఆరోజు రాత్రి ఇంట్లో భర్త మద్యం సేవిస్తుండగా శివాని వీడియో తీసింది. తాగిన తర్వాత హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కానీ, శివాని తీరుపై అనుమానం రావడంతో రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపే.. గుట్టుచప్పుడు గా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది శివాని. ఎంవీపీ పోలీసుల ఎంట్రీతో.. వివాహేతర సంబంధ బాగోతం బయటపడింది!. ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో సంబంధం నడుపుతున్న ఆమె.. ప్రియుడు,అతని స్నేహితుడు సాయంతో భర్తను అంతమొందించింది. దిండుతో రమేశ్‌కు ఊపిరి ఆడకుండా చేసి చంపించి.. గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేసింది. ఏ ఒక్కరినీ వదలం కానిస్టేబుల్ రమేశ్ అనుమానాస్పద మృతి కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు సాక్షితో చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాక మాకు కొన్ని నిజాలు తెలిశాయి. రమేశ్ భార్య శివాని మొబైల్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టాం. కొంతమంది అనుమానితులను విచారిస్తున్నాం. రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీటివి ఫుటేజ్ సేకరించాం. శివాని ఇతర పరిచయాలపై ఆరా తీస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ మృతికి కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రమేష్ డ్యూటీలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతని సహచరులు అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజ నిజాలు వెల్లడిస్తాం అని సాక్షితో అన్నారాయన. -
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు
-
విజయవాడ వన్‌టౌన్‌లో కుంగిన రోడ్డు
-
అర్ధరాత్రి ఆలయాల కూల్చివేత
అధికార పక్ష నేతలపై భక్తుల ఆగ్రహం వన్‌టౌన్‌లో ఉద్రిక్తత వన్‌టౌన్ : వన్‌టౌన్‌లో గురువారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నగర పాలక సంస్థ సిబ్బంది పలు ఆలయాలను నేలమట్టం చేశారు. వన్‌టౌన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్‌టౌన్‌లోని గణపతిరావురోడ్డులో చేపలమార్కెట్ బస్టాండ్ సమీపంలోని రోడ్డును ఆనుకొని ఉన్న దాసాంజనేయస్వామి దేవస్థానం, దాని పక్కనే ఉన్న విఘ్నేశ్వరస్వామి దేవస్థానాలను రాత్రికిరాత్రి తొలగించారు. అందులోని విగ్రహాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. బాబూ రాజేంద్రప్రసాద్ రోడ్డులోని రాయల్‌హోటల్ సమీపంలో ఉన్న గంగానమ్మ దేస్థానాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. రాత్రి పదకొండు గంటల వరకూ ఎటువంటి హడావుడి లేదని ఉదయం చూడగానే ఆలయాలు మాయమైనట్లు స్థానిక నివాసితులు చెబుతున్నారు. 86 ఏళ్ల పురాతన ఆలయాన్ని కూల్చడంపై నిరసన గణపతిరావురోడ్డులోని దాసాంజనేయస్వామి దేవస్థానాన్ని 1930లో ప్రతిష్టించారని స్థానికులు చెబుతున్నారు. హనుమత్ జయంతి, శ్రీరామనవమి, ఇతర వైష్ణవ పండుగల సమయాల్లో ఈ ఆలయంలో పెద్దస్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారని తెలిపారు. పురాతన ఆలయాన్ని ఏ విధంగా తొలగించారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాయల్‌హోటల్ సమీపంలోని గంగానమ్మ దేవస్థానం కూడా 40 ఏళ్లుగా అక్కడ ఉందని, స్థానికంగా మసీదు ఉన్నా మతసామస్యంగా అక్కడి వాతావరణం కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. అధికారుల వివక్ష అధికారులు, అధికారపక్ష నేతలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయా ఆలయాల నిర్వాహకులు, స్థానిక భక్తులు మండి పడుతున్నారు. 25వ డివిజన్లో ఆరు మాసాల కిందట ఒక మతానికి చెందిన ప్రార్థనా మందిర స్థలంలో నాలుగు వైపుల రోడ్డు ఆక్రమించి దుకాణాలు అధికారులు దగ్గరుండి కట్టించారని, వారికి అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు మద్దతు పలికారంటూ స్థాయిలో భక్తులు ధ్వజమెత్తారు. అదే డివిజన్లో మరో ప్రార్థనా మందిరం పేరుతో భారీ హోర్డింగులను ఏర్పాటుచేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారని, అధికారులు అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. పాఠశాల భవనం తొలగింపు గణపతిరావు రోడ్డు విస్తరణలో భాగంగా శ్రీ కస్తూరి సీతారామయ్య నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించే పనులను అధికారులు గురువారం రాత్రి ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుడు కస్తూరి సీతారామయ్య స్మారకార్థం నగర పాలక సంస్థ రెండున్నర దశాబ్దాల కిందట ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. రోడ్డు విస్తరణ పేరుతో అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు పాఠశాలను తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కస్తూరి సీతారామయ్య పేరుతో ఉన్న పాఠశాలను తొలగిం చటం ఆయనను అవమానించటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.