breaking news
nursery former
-
‘సిరి’పైనే పొగాకు రైతుల గురి
మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఈ ఏడాది సిరి అనే రకం పొగాకు విత్తనాలపై అమితాసక్తి చూపారు. దక్షిణ ప్రాంత తేలిక నేల ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గతంలో సిరి, వీటీ 1158, ఎన్ 98, జీ 11 తదితర రకాలను పొగాకు నారుమడి కోసం రైతులు, నర్సరీ వ్యాపారులు ఉపయోగించగా.. ఈ ఏడాది దీనికి భిన్నంగా సిరి రకం విత్తనాల వైపు మొగ్గు చూపారు. దక్షిణ ప్రాంత రైతులందరూ సిరి విత్తనాలతోనే నార్లు పోశారు. రైతుల ఆసక్తి మేరకు రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) విత్తనాభివృద్ధి శాస్త్రవేత్తలు సిరి విత్తనాలనే రైతుల కోసం అందించారు. రాజమహేంద్రవరంతోపాటు, కందుకూరులో విత్తనాలను కిలో రూ.900 చొప్పన విక్రయించారు. ఈ ఏడాది దాదాపు 8 వేల కిలోల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రైతుల కోసం ఉత్తర ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నర్సరీ వ్యాపారులు కూడా సిరి విత్తనాలతోనే పొగాకు నారుమడులు పెట్టారు. ఉత్తర ప్రాంతానికి అనువైన కన్సన్, ఎల్టీ కన్సన్తోపాటు ఐటీసీ విత్తన రకాలు ఇక్కడ రైతులు ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరం నారుమడికి గరిష్టంగా నాలుగు కేజీల విత్తనాలను రైతులు వాడుతున్నారు. అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు ఆకుముడత అతి తక్కువగా ఉంటోంది. అందువల్లే రైతులు సిరి పొగాకు విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు దిగుబడి ఎక్కువ ఆకుముడత తక్కువ ఇతర విత్తనాలతో పోల్చుకుంటే సిరి విత్తనాలు దిగుబడి బాగా వస్తుంది. పైగా ఆకుముడత తక్కువగా ఉంటోంది. అందుకే సిరి విత్తనాలనే నారుమడులకు ఉపయోగిస్తున్నాం. – బాలు కోటిరెడ్డి (89853 11626), పొగాకు రైతు, కనిగిరి, ప్రకాశం జిల్లా విత్తనాలకు డిమాండ్ పెరిగింది గతేడాది వరకు ఎన్ 98, జీ 11 విత్తనాలను ఉపయోగించేవాళ్లం. ఈ ఏడాది సిరి విత్తనాలనే కొనుగోలు చేశాం. కందుకూరులో విత్తనాలు అయిపోవడంతో రాజమహేంద్రవరం వచ్చి తీసుకున్నాం. – జి. అబ్దుల్లా, కొండాపురం, నెల్లూరు జిల్లా – పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం -
లారీ ఢీకొని నర్సరీ రైతు దుర్మరణం
లారీ ఢీకొని నర్సరీ రైతు దుర్మరణం వేమగిరి (కడియం), : మండలంలోని వేమగిరి వద్ద హైవేపై కొత్తపల్లి అరవ రాజేష్ (అరవాలు) (24) అనే నర్సరీరైతు లారీ ఢీకొని దుర్మరణం పాల య్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుర్రిలంక గ్రామానికి చెందిన రాజేష్ వేమగిరిలోని తన నర్సరీలో పనిచేసే కూలీలకు టీ తీసుకువెళ్లేందుకు వేమగిరి సెంటర్‌కు వచ్చాడు. వేమగిరి తోట వద్ద మోటారు సైకిల్‌పై డివైడర్‌ను దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో వెనుక వస్తున్న క్వారీ లారీ కూడా అదే డివైడర్‌ను దాటేందుకు మలుపు తిరిగింది. దీంతో మోటారు సైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడియం ఇన్స్పెక్టర్ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్సై శివాజీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని కడియం స్టేషన్‌కు తరలించారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బుర్రిలంక ఉం టుంది. సంఘటన విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామం నుంచి రాజేష్ స్నేహితులు, బంధువులు, నర్సరీ రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. పొలానికి వెళ్లి ఇప్పుడే వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన రాజేష్ ఇంతలోనే ప్రమాదం భారిన పడి మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని నర్సరీని అభివృద్ధి చేస్తున్నాడని, ఇంతలో ఇలా జరిగిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.