breaking news
not sufficient
-
ఒక్క‘ట్రీ’ బతకలేదు!
సాక్షి, సిరిసిల్ల : జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఆటంకంగా మారిన ఏళ్లనాటి వృక్షాలను తొలగించిన అధికారులు.. వాటిని శాస్త్రీయ పద్ధతిన సంరక్షించేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. 2017 జూన్‌లో ఆర్ అండ్ బీ, అటవీశాఖ అధికారులు తొలగించిన చెట్లకు ప్రాణం పోసేందుకు చేసిన కృషి మట్టిపాలైంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా నాటిన 55 చెట్లు బతకలేదు. మొత్తం 300 వృక్షాలకు పునరుజ్జీవం పోసేందుకు రూ.36 లక్షలు కేటాయించగా.. 55 చెట్లను క్రేన్ల సాయంతో మట్టితో సహా పెకిలించి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో నాటారు. సంరక్షణ చర్యలు విస్మరించడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఏళ్లనాటి చెట్లు ఎండిపోయాయి.. పట్టణంలో 20 – 30ఏళ్ల క్రితం చెట్లు రోడ్డు విస్తరణలో తొలగించాల్సి వచ్చింది. ఫారెస్ట్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలు తొలగించి, వేర్లతో సహా పెలించారు. అయితే, మట్టి వాటి వేర్లకు అంటుకుని ఉండకపోవడంతో చెట్లు వాడిపోయాయి. వాటిని నాటిన ప్రాంత భూసారం, అవి పెరిగిన ప్రాంత భూసారానికి తేడా ఉండడంతో వృక్షాలు జీవం పోసులేకపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు అప్పట్లో చెట్లను రక్షించేందుకు చేపట్టిన చర్యలు అభినందనీయం కాగా.. ఆ చెట్లు ఒక్కటీ దక్కకపోవడం బాధాకరం. కొన్ని నాటి ఆపేశాం జిల్లాకేంద్రంలో 300 చెట్లను తరలించాలని భావించాం. కానీ కొన్ని చెట్లను తరలించిన తర్వాత అవి బతికే అవకాశం లేదని తెలిసింది. వేర్లకు మట్టి అంటుకుని ఉండలేదు. ఇది గుర్తించి మిగితా వాటిని నాటకుండానే వదిలేశాం. కొత్త విధానంలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. – విఘ్నేశ్వర్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ -
వసంతోత్సవం.. వనరులు భారం
తణుకు అర్బన్ : సర్కారీ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం.. దీనిలో భాగంగా వసంతోత్సవాలు (వార్షికోత్సవం) నిర్వహిస్తున్నాం.. అని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు వసంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతనెల 15వ తేదీ నుంచి ఆయా పాఠశాలల్లో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అయి తే ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో ఉపాధ్యాయులను దాతల సాయం అభ్యర్థించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నామమాత్రంగా వార్షికోత్సవంతో సరిపెట్టాల్సి వస్తోంది. 3,237 పాఠశాలలు.. రూ.32.11 లక్షల మంజూరు జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలలకు రూ.8.66 లక్షలు, 266 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.3.99 లక్షలు, 2,538 ప్రాథమిక పాఠశాలలకు రూ.19.46 లక్షలు మొత్తం 3,237 పాఠశాలలకు రూ.32.11 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులు ఎంతమంది ఉన్నా అతిథులందరినీ పిలవాల్సిందేనని ఖర్చులు ఒకటే అయినా విద్యార్థుల సంఖ్యను బట్టి సొమ్ము కుదించడం దారుణమని ఉపాధ్యాయ సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి. వసంతోత్సవం నిధులు ఉన్నత పాఠశాల రూ.2,000 ప్రాథమికోన్నత పాఠశాల రూ.1,500 ప్రాథమిక పాఠశాల రూ.1,000 50లోపు విద్యార్థులు ఉంటే రూ.500 పాఠశాలకు రూ.10 వేలు పైనే.. ఉన్నత పాఠశాలకు రూ.2 వేలు చొప్పున ఇస్తుండగా ఇది కనీసం షామియానా ఖర్చుకు కూడా సరిపోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పాలకులను, పూర్వ విద్యార్థులను పిలిచి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతోందని అంటున్నారు. నిధులు సరిపోక దాతల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తలో కొంత వేసుకుని వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వసంతోత్సవాలు జరిగిన తీరును ఫొటోల ద్వారా ఉన్నతాధికారులకు చూపించాలన్న ఆదేశాలు కూడా ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్నాయి. సొమ్ములు సరిపోవడం లేదు ప్రభుత్వ పాఠశాలల్లో వసంతోత్సవాలు నిర్వహించేందుకు సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన నిధులు సరిపోవడంలేదు. ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500 నుంచి రూ.1,000 లోపు ఇవ్వడం సరికాదు. ఖర్చులు రూ.వేలల్లో అవుతున్నాయి. –ఆర్.కర్నేలు, యూటీఎఫ్ పట్టణ కార్యదర్శి, తణుకు రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది వసంతోత్సవాల నిర్వహణకు హైస్కూల్‌కు రూ.2 వేలు, ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500, రూ.1,000 ఇస్తున్నారు. కానీ ఒక్కో పాఠశాలలో రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. షామియానా, ఇతర ఖర్చులు పెరిగాయి. నగదు మొత్తం పెంచితే బావుండేది. – వి.రామమోహన్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, తణుకు కార్పొరేట్‌కు దీటుగా అంటే ఇదేనా.. కార్పొరేట్‌కు దీటుగా అంటే ఇదేనా. వసంతోత్సవాలకు నిధుల కొరత వేధిస్తోంది. గ్రామపెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లితండ్రులను ఆహ్వానించి పాఠశాల స్థితిగతులు వివరించడానికి వసంతోత్సవం వేదిక. మెమెంటోలు, స్నాక్స్, షామియానా, మైకు ఖర్చులకు రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. –పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు, తణుకు