breaking news
not respond officers
-
మీ సేవలు బుట్ట దాఖలు
ఒంగోలు టౌన్ : జిల్లాలోని మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీల్లో అధిక శాతం బుట్టదాఖలవుతున్నాయి. ప్రజలు తమకు కావలసిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తరువాత రోజుల తరబడి వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు ఆ అర్జీలు వెళ్లినప్పటికీ అక్కడి అధికారులు వాటిని పక్కన పెట్టడంతో మీ సేవ కేంద్రాల ఉద్దేశం నీరుగారిపోతోంది. ఈ–సేవ కేంద్రాలుగా కొనసాగుతున్న వాటిని మీ–సేవ కేంద్రాలుగా మారుస్తూ 2011లో ఉన్న అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పేరు మార్చినప్పటికీ తీరు మారలేదు. సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైపెచ్చు ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్న సర్టిఫికెట్ల పరిష్కారం కంటే వాటిని రిజక్ట్(తిరస్కరణ) చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా గణాంకాలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని ఈ–సేవ కేంద్రాలు 2011 నవంబర్ 4వ తేదీ మీ సేవ కేంద్రాలుగా మారాయి. అయితే వాటి ద్వారా అందించే సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోగా, మరింత జాప్యం, తిరస్కరణ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 429 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఏపీ ఆన్లైన్ కింద 60 కేంద్రాలు, కార్వే సంస్థకు సంబంధించి 76 కేంద్రాలు, సీఎంఎస్‌కు సంబంధించి 293 కేంద్రాలు ఉన్నాయి. కార్వే సంస్థ మీ సేవ కేంద్రాలు అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు, సీఎంఎస్ సంస్థకు సంబం«ధించిన మీ సేవ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఏపీ ఆన్లైన్ ద్వారా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను ఏ, బీ కేటగిరీలుగా విభజించి వాటిని సంబంధిత అధికారులకు వాటి నిర్వాహకులు పంపిస్తుంటారు. ఏ–కేటగిరీ అర్జీలను ఎలాంటి విచారణ లేకుండా అప్పటికప్పుడే అందించాల్సి ఉంటుంది. బీ–కేటగిరీ అర్జీలను సంబంధిత శాఖలు విచారణ జరిపిన అనంతరం నిర్ణీత గడువులోగా అర్జీదారులకు మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలి. 2011 నవంబర్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏ, బీ కేటగిరీలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో 4,42, 096 అర్జీలు తిరస్కరించారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకు ఒక్క సంవత్సర కాలంలోనే 89,542 అర్జీలను తిరస్కరణకు గురికావడం చూస్తుంటే మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంపట్ల సంబంధిత అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మీ సేవ మా పనికాదు: అనేక శాఖలకు సంబంధించిన సర్టిఫికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా పొందేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. రెవెన్యూ శాఖకు సంబంధించి 71 రకాల సేవలు, వ్యవసాయ శాఖకు సంబంధించి 36 రకాల సేవలు, ట్రాన్స్‌కోకు చెందిన 34 రకాల సేవలు పొందేలా మీ సేవ కేంద్రాలకు రూపకల్పన చేశారు. వీటితోపాటు అనేక శాఖలకు సంబంధించిన సేవలను కూడా మీ సేవ కేంద్రాల ద్వారా రుసుం చెల్లించి నిర్ణీత గడువులోగా పొందేలా సిటిజన్ ఛార్టర్ను ఏర్పాటు చేశారు. అయితే సిటిజన్ ఛార్టర్ ప్రకారం సర్టిíఫికెట్లు పొందినవారి సంఖ్య చాలా స్వల్పంగానే ఉంటుంది. అందుకు కారణం మీ సేవ కేంద్రాల నుంచి సంబంధిత శాఖలకు అర్జీలు వెళ్లిన వెంటనే అక్కడి అధికారులు వాటిని పక్కన పడేస్తున్నారు. అర్జీదారుల అత్యవసరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన క్యాస్ట్, ఇన్‌కం తదితర అత్యవసర సర్టిఫికెట్లు పొందాలంటే మీకోసంలో దరఖాస్తు చేసుకున్న తరువాత, సంబంధిత వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ రాయ్ఙబేరాలు’ సాగిస్తుండటం బహిరంగ రహస్యమే. ఇక రైతులకు సంబంధించి భూ హక్కుల పత్రాలు పొందాలంటే రైతులు నేరుగా రెవెన్యూ అధికారులను కలిసి వారికి తృణమో ఫలమో సమర్పించుకుంటేగాని ఆ పత్రాలు రావన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. “మీ సేవ మా పని కాదు’ అన్నట్లుగా మీ సేవ కేంద్రాల పనితీరు ఉంది. నిర్లక్ష్యానికి నిదర్శనం: మీ సేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని సకాలంలో ఇవ్వకుండా తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వాటిని పొందలేకపోతున్నారు. జిల్లాలో 4792 అర్జీలు గడువు దాటినవి ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రతి సోమవారం మీ కోసం, మీ సేవ కేంద్రాలకు వచ్చిన అర్జీల గురించి సమీక్షించడం తప్పితే జాప్యానికి కారణం అవుతున్న శాఖల అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఇప్పటికైనా కలెక్టర్ మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటే ప్రజలకు సకాలంలో సేవలు అందుతాయి. లేకుంటే ప్రజలకు వ్యయ ప్రయాసలు తప్పవు. మీ సేవ అర్జీలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు మీ సేవ కేంద్రాలకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ సేవ కేంద్రాల్లో శాఖల వారీగా ఎన్ని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలను సేకరించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాం. – ప్రభాకరరెడ్డి, ఇన్చార్జి జేసీ మూడు నెలల కిందట దరఖాస్తు చేసినా పరిష్కారం కాలేదు ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుతో రేషన్‌షాపునకు వెళ్లి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని అడిగితే కార్డు ల్యాప్స్ అయిందని చెప్పారు. దీంతో తర్లుపాడులోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మూడు నెలల కిందట రేషన్‌కార్డు లోని లోపాలను సరిచేసి మళ్లీ నాకు ఉపయోగపడేలా ఇవ్వాలని మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇదే విషయాన్ని తహశీల్దార్ కార్యాలయంలో తెలిపాను. ఇంత వరకు నా అర్జీ పరిష్కారం కాలేదు. – జి.రంగారెడ్డి, నాయుడుపల్లె , తర్లుపాడు మండలం -
‘మిషన్’ చెరువుకు బుంగ
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని మిషన్ కాకతీయ ఊర చెరువుకు బుంగపడడంతో నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు రైతులు గురువారం చెరువుపై ఆందోళనకు దిగారు. చెరువుకు బుంగపడడం ఇది మూడోసారి. చెరువు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించకపోవడంతోనే తరచూ బుంగలు పడుతున్నాయని రైతులు అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ కక్కుర్తితో చెరువు ఖాళీ అయ్యేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. రైతు సమాఖ్యసంఘాల గ్రామ అధ్యక్షుడు అంబాల అయిలయ్య, నగేశ్, రాజమౌళి, సంపత్, రాజయ్య, మల్లేశ్, రమేశ్, రాజు, మహిమెుద్దీన్, కర్రె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
చెన్నూరు: స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బంధువులు తెలిపిన ప్రకారం తేజస్వినికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాల, ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం వైద్యశాలలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకురాగా రాత్రి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, కడపకు తీసుకెళ్లాలని సూచించారు. రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. విజృంభిస్తున్న విష జ్వరాలు : చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె, శివాలపల్లె, చెన్నూరు, బయనపల్లె గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చెన్నూరు తూర్పు దళితవాడకు చెందిన బాలిక డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతోంది. వనంవీధికి చెందిన సురేష్ కుమార్తె అలేఖ్య (7) విషజ్వరంతో బాధపడుతుండగా కడపకు తీసుకెళ్లగా డెంగీ జ్వరమని అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కర్నూలుకు తరలించారు. మండలంలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.