breaking news
no death to man
-
త్వరలో సంపన్నులకు మరణమే ఉండదు!
జీవితంలో మనుషులకు ఉండే నానా భయాల్లో ఎక్కువగా భయపెట్టేవి జరామరణ భయాలే! జరామరణాలనేవి లేకపోతే ఇక దేనికీ భయపడాల్సిన అవసరమే ఉండదనే భావన జనాల్లో చిరకాలంగా ఉంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఎంతగా అభివృద్ధి చెందినా, జరామరణాలను జయించే సాధనాలేవీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కొంతకాలంగా వార్ధక్యాన్ని జయించే దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటి ఫలితాలు కొన్ని ఆశలనూ రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఇక చావుకు చెల్లుచీటీ రాసి పారేయొచ్చునని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. మరో ముప్పయ్యేళ్లలోనే ప్రపంచంలోని సంపన్నులు మరణాన్ని జయించగలుగుతారని, ఆ తర్వాత ఇంకో ముప్పయ్యేళ్లకు పేద దేశాల్లోని ప్రజలు కూడా దీనిని సాధించగలుగుతారని చెబుతున్నారు. జరామరణాలపై తరతరాలుగా కొనసాగుతున్న భావనలు, వాటిని జయించడానికి జరుగుతున్న శాస్త్ర పరిశోధనలు, వాటిపై శాస్త్రవేత్తల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం... జరామరణాలను జయించడం మానవమాత్రుల వల్ల కాదనే ఇప్పటి వరకు మనకు తెలుసు. వివిధ మతగ్రంథాలు, పురాణాలు కూడా ఇదే సంగతి చెబుతున్నాయి. మృత్యువును జయించలేరు గనుకనే మానవులను మర్త్యులు అంటారు. జరామరణాలు లేని దేవతలు అల్లక్కడెక్కడో స్వర్గంలో ఉంటారని, అమృతపానం కారణంగా మృత్యువు వారి దరిచేరదని, అందువల్లనే వారు అమర్త్యులని ప్రస్తుతించాయి మన పురాణాలు. జరామరణాలకు సంబంధించి మన పురాణాల్లో అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం మృతస్య చ‘ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి‘‘’’ – అంటే ‘పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం శోకించడం తగదు’ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ‘గీత’బోధ చేశాడు. స్వర్గంలో ఉండే దేవతలే కాదు, భూమ్మీద పుట్టిన వారిలోనూ కొందరు వరప్రభావంలో చిరంజీవులుగా ఉన్నట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ‘‘అశ్వత్థామా బలిర్వా్యసో హనుమానశ్చ విభీషణః‘ కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః‘‘’’ అనే శ్లోకం ప్రకారం మన పురాణాలు పేర్కొన్న చిరంజీవులు ఏడుగురు. వారు: అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. పురాణాల సంగతి పక్కనపెడితే, ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం మనుషులను అత్యంత తీవ్రంగా భయపెట్టేది మరణ భయమేనని గుర్తించారు. మరణాన్ని జయించడానికి మనుషులు తరతరాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రాచీన గ్రీకు రసవాదులు కొందరు మరణాన్ని నివారించగల ‘ఫిలాసఫర్స్ స్టోన్’ (వేదాంతుల శిల) తయారీకి విఫలయత్నాలు చేశారు. ‘లాపిస్ ఫిలాసఫోరమ్’గా గ్రీకు గాథలు ప్రస్తావించిన ఈ శిలకు నానా మహత్తులు ఉంటాయట. దీనిని తాకిస్తే, పాదరసం వంటి అల్పలోహాలు బంగారంగా మారిపోతాయట. దీని మహిమతో జరామరణాలను జయించడమూ సాధ్యమవుతుందట. గ్రీకుగాథలు ప్రస్తావించిన ఈ ‘వేదాంతుల శిల’ ఎవరి చేతికీ అందిన దాఖలాల్లేవు. అలాగే, దీని మహిమవల్ల చిరంజీవులైన వారు ఉన్నట్లు కూడా దాఖలాల్లేవు. పురాణగాథలు, వాటిలోని కల్పనలు ఎలా ఉన్నా, త్వరలోనే మనుషులందరూ చిరంజీవులు కావచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు తమ భవిష్యత్ అంచనాలతో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు మరణం అనివార్యం... పురాణాలు మొదలుకొని ఆధునిక శాస్త్ర పరిశోధనల ఇప్పటి వరకు చెబుతున్నదేమిటంటే, జీవులకు మరణం ఒక అనివార్యమైన దశ. పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. అనివార్యమైన మరణానికి కారణాలు సవాలక్ష. వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి వాటి వల్ల కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, వీటిన్నింటినీ తప్పించుకున్న వారు వార్ధక్యం కారణంగా శరీరం వడలిపోయి, ఏదో ఒక సమయంలో రాలిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. జీవితంలో వార్ధక్యం ఒక సహజ పరిణామంగానే ఇటీవలి కాలం వరకు వైద్యనిపుణులు పరిగణిస్తూ వచ్చారు. అయితే, ఇరవయ్యో శతాబ్దిలో కొందరు వైద్య నిపుణులు వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని, దీనిని నయం చేయవచ్చనే వాదన లేవనెత్తారు. వార్ధక్యాన్ని నివారిస్తే, దాని వల్ల సంభవించే మరణాన్ని నివారించడం కూడా సాధ్యమేనని వారి వాదన. రాబర్ట్ ఎం పెరిమాన్ అనే అమెరికన్ వైద్యుడు తొలిసారిగా ఈ వాదన లేవనెత్తుతూ, 1954లో ‘ది ఏజింగ్ సిండ్రోమ్’ పేరిట రాసిన వ్యాసం ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ గేరియాట్రిక్ సొసైటీ’లో ప్రచురితమై, వైద్యరంగంలో చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా రేగిన ఈ చర్చతో కొందరు శాస్త్రవేత్తలు వార్ధక్యానికి మూలకారణం కనుగొనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో మొదటిగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన అనాటమీ ప్రొఫెసర్ లియొనార్డ్ హేఫ్లిక్ 1962లో కృతకృత్యుడయ్యాడు. మానవ శరీరంలోని ఒక్కో జీవకణం అంతరించిపోయేలోగా అది పొందే విభజనకు ఒక నిర్దిష్టమైన పరిమితి ఉంటుందని గుర్తించాడు. జీవకణాలు విభజన పొందే ప్రతిసారీ క్రోమోజోమ్‌ల చివర క్యాప్‌లా ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోతూ ఉంటుందని, ఇది పూర్తిగా కుంచించుకు పోయాక జీవకణం మరిక విభజన చెందదని, ఈ ప్రక్రియ కారణంగానే వార్ధక్యం సంభవిస్తోందని వివరించాడు. హేఫ్లిక్ పరిశోధనతో వెలుగులోకి వచ్చిన వాస్తవాల నేపథ్యంలో మానవుల జీవకణాల్లోని క్రోమోజోమ్‌లను అంటిపెట్టుకుని ఉండే ‘టెలోమెరిస్’ కుంచించుకు పోవడాన్ని నిలువరించగలిగితే నిత్య యవ్వనం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అప్పట్లో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు ప్రభుత్వాలేవీ నిధులు ఖర్చు చేయడానికి సుముఖత చూపకపోవడంతో ఈ అంశమై స్తబ్దత ఏర్పడింది. దాదాపు ఆరు దశాబ్దాల స్తబ్దత తర్వాత 2015లో ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడమే కాకుండా, దీనిని అధికారికంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఫలితంగా 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ‘వార్ధక్య సంబంధ వ్యాధుల’కు ఒక ఎక్స్టెన్షన్ కోడ్ కేటాయించింది. వార్ధక్యాన్ని వ్యాధి అనలేం వార్ధక్యం కూడా వ్యాధేననే వాదన కొందరు శాస్త్రవేత్తలు వినిపిస్తుంటే, వార్ధక్యాన్ని వ్యాధి అనలేమని ఇంకొందరు చెబుతున్నారు. భూమ్మీద ప్రస్తుతం నివసిస్తున్న సుమారు 770 కోట్ల మంది మనుషులూ తప్పించుకోలేని దశను వ్యాధిగా నిర్వచించడం సాధ్యం కాదని డెన్మార్క్‌లోని అర్హర్స్ యూనివర్సిటీ సెల్యులర్ ఏజింగ్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సురేశ్ రత్తన్ చెబుతున్నారు. ఆయన చెబుతున్న ప్రకారం– వార్ధక్యం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, కొన్ని రకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వయసు మళ్లే దశలో సర్వసాధారణంగా ఎదురవుతాయి. దాదాపు అరవై అయిదేళ్ల వయసు దాటిన తర్వాత చాలామంది ఇలాంటి వ్యాధుల బారిన పడతారు. అలాగని, వయసు మళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ జబ్బులు కచ్చితంగా వస్తాయని కూడా చెప్పలేం. ఒక్కోసారి యవ్వనంలో ఉన్నవారిలో సైతం ఈ జబ్బులు కనిపించడమూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల వార్ధక్యాన్ని వ్యాధిగా పరిగణించడం సాధ్యమయ్యే పనికాదు. గెరాంటలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా 2019లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, రకరకాల కేన్సర్లు, అల్జీమర్స్ వంటి వ్యాధులు వార్ధక్యంలో కొంత సర్వసాధారణంగా తలెత్తేవే అయినా, నేరుగా వీటికి వార్ధక్యంతో సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. కేవలం వార్ధక్యం కారణంగానే ఈ వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయనడానికి కూడా ఇదమిత్థమైన ఆధారాలేవీ లేవని కూడా వారు వెల్లడించారు. శరీరంలో జరిగే జైవిక ప్రక్రియలు వార్ధక్యానికి మూలకారణం అవుతుంటే, ఇలాంటి వ్యాధులన్నీ వాటివల్ల తలెత్తే పర్యవసానాలు మాత్రమేనని వారంతా అభిప్రాయపడ్డారు. మనిషి మరణాన్ని జయించే కాలం ఎంతో దూరంలో లేదనే అంచనాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వార్ధక్యం, దాని ఫలితంగా సంభవించే మరణం సహజ పరిణామాలేనని బలంగా నమ్ముతున్న శాస్త్రవేత్తలు కూడా తమ వాదనను వినిపిస్తుండటం గమనార్హం. గేరియాట్రిక్ నిపుణులు చెబుతున్న దానిబట్టి మనుషులు గరిష్ఠంగా నూట ఇరవై ఏళ్ల వరకు బతకగలుగుతారు. భారతీయ జ్యోతిషశాస్త్రంలోని వింశోత్తరి పద్ధతిలో జీవితంలో ఎదురయ్యే గ్రహ దశల పూర్తి నిడివి కూడా నూట ఇరవై ఏళ్లే. నానా రకాల వ్యాధులను జయించి మనుషులు గరిష్ఠ ఆయుర్దాయం వరకు జీవించగలుగుతారో, ఫ్యూచరాలజిస్టుల అంచనా మేరకు చిరంజీవులుగా మారుతారో వేచి చూడాల్సిందే! 2045 ఈనాటికి మెదడును యంత్రాలకు అనుసంధానించడం సాధ్యమవుతుంది. 2050 ప్రపంచంలోని సంపన్నులు తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2060 సంపన్న దేశాల్లోని మధ్యతరగతి ప్రజలు, కార్మిక వర్గాల వారు కూడా తమ మెదళ్లను రోబోలతో, కంప్యూటర్లతో అనుసంధానం చేయించుకోగలుగుతారు. 2070 పేద దేశాల్లోని సామాన్యులు సైతం తమ మెదళ్లను కంప్యూటర్లతో అనుసంధానించ గలుగుతారు. 2080 మనుషులందరూ మరణాన్ని జయిస్తారు. రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించగలుగుతారు. రోబో శరీరాలకు ప్రభుత్వాలే సబ్సిడీ కల్పిస్తాయి. ‘ప్రపంచంలో నిశ్చయమైనవి రెండే రెండు. ఒకటి: చావు, రెండు: ప్రభుత్వం విధించే పన్నులు’ అని అమెరికన్ రాజనీతిజ్ఞుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏనాడో చమత్కరించాడు. పన్నులనేం చేయలేం గాని, చావుకు చెల్లుచీటీ రాసేయడానికి ఇంకెంతో కాలం వేచి చూడక్కర్లేదంటున్నారు ఫ్యూచరాలజిస్టులు. మరణాన్ని జయించగలిగే మార్గాలను కూడా వారు ప్రతిపాదిస్తున్నారు. మరణాన్ని జయించడానికి ముచ్చటగా మూడు దారులు ఉన్నాయని చెబుతున్నారు అమెరికన్ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్. అవి: శరీర అవయవాలకు పునర్యవ్వనం కల్పించడం, ఆండ్రాయిడ్ రోబో శరీరాలను ఆశ్రయించుకుని జీవితాన్ని కొనసాగించడం, జెనెటిక్ ఇంజనీరింగ్‌లో వివిధ పద్ధతుల ద్వారా జీవకణాలు వయసుమళ్లడాన్ని నిరోధించడం ద్వారా శరీర అవయవాలకు పునర్యవ్వనం కలిగించడం సాధ్యమవుతుందని, దీని ద్వారా మరణాన్ని జయించడం సాధ్యమవుతుందని డాక్టర్ పియర్సన్ చెబుతున్నారు. శరీరంతో యథాతథంగా నవయవ్వనంగా ఉంటూ, మరణాన్ని జయించడం సాధ్యం కాకుంటే, మన మెదళ్లను ఆండ్రాయిడ్ రోబోలకు అనుసంధానించడం ద్వారా రోబో శరీరాల్లో జీవితాన్ని కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలా కాకుంటే, మెదళ్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా వర్చువల్ జీవితాన్ని చిరకాలం కొనసాగించవచ్చు. చావుకు చెల్లుచీటీ రాసే ప్రక్రియలో డాక్టర్ పియర్సన్ అంచనా ఇదీ... - ఈ లెక్కన డాక్టర్ పియర్సన్ అంచనా నిజమైతే, మరో అరవయ్యేళ్లకు ప్రపంచంలోని మనుషులందరూ చిరంజీవులే అవుతారు. ఇదివరకటి విఫలయత్నాలు మెసపొటేమియన్ పురాణగాథల ప్రకారం గిల్గమేష్ అనే వీరుడికి ఎన్కిడు అనే మిత్రుడు ఉండేవాడు. వయసు తీరకుండానే ఎన్కిడు మరణించాడు. ఎన్కిడు మరణం తర్వాత గిల్గమేష్ తనకు అలాంటి దుస్థితి వాటిల్లకూడదనే ఉద్దేశంతో మరణాన్ని జయించడానికి కఠోర ప్రయత్నాలే చేశాడు. ఈ క్రమంలో ఎదురైన రెండు పరీక్షల్లో అతడు విఫలమవడంతో మరణాన్ని జయించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఈ కథ క్రీస్తుపూర్వం 2600 నాటి ‘ఎపిక్ ఆఫ్ గిల్గమేష్’లోనిది. మరణాన్ని జయించేందుకు మనుషులు చేసే ప్రయత్నాలను వర్ణించిన తొలి గాథ ఇదే. పురాణగాథల సంగతి సరే, పురాతన చరిత్రను తరచిచూస్తే, మరణాన్ని జయించే యత్నాలు చేసినవారు లేకపోలేదు. చైనా తొలి చక్రవర్తి కిన్ షి హువాంగ్ వయసు మళ్లిన దశలో జరామరణాలను జయించడానికి విఫలయత్నాలు చేశాడు. తన ఆస్థానంలోని జుఫు అనే రసవాది ఆధ్వర్యంలో నవయవ్వన ఔషధాన్ని అన్వేషించడం కోసం వందలాది మందిని ప్రపంచం నలుమూలలకూ పంపాడు. వార్ధక్యంలో జ్ఞాపకశక్తి క్షీణించడంతో అతని ఆస్థాన వైద్యుల సలహాపై పాదరసంతో కూడిన మాత్రలను అతిగా వాడటం వల్ల అర్ధంతరంగానే కన్నుమూశాడు. మరణాన్ని జయించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తిగా క్రీస్తుపూర్వం 259–210 కాలంలో చైనాను పరిపాలించిన కిన్ షి హువాంగ్ చరిత్రలో నిలిచిపోయాడు. -
రైల్వే మరణాలు 0
న్యూఢిల్లీ: ఈ ఏడాది రైలు ప్రమాదాల వల్ల ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని భారత రైల్వే ప్రకటించింది. దీంతో రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది చాలా సురక్షితమైనదిగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిబ్బంది చనిపోయారని, ప్రయాణికులు చనిపోలేదని తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 16 మరణాలు, 2017–18లో 28, 2016–17 మధ్య కాలంలో 195 మరణాలు సంభవించాయి. అదే 1990–95 మధ్య కాలంలో సరాసరి ఏటా 500 రైల్వే ప్రమాదాలు జరిగేవి. ఈ ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 2,400 మరణాలు సంభవించగా, 4,300 మంది గాయపడ్డారు. 2013–18 మధ్య కాలంలో ఏటా 110 ప్రమాదాలు జరగ్గా, ఈ ఐదేళ్లలో 990 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారని సమాచారం. కొన్నేళ్లుగా రైల్వేలో యాక్సిడెంట్లు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. -
మనిషి చావును జయిస్తాడా ?
మనిషికి మరణం లేకపోతే.. దేవుడవుతాడు. అప్పుడు దేవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి వస్తుందా? వైద్య విజ్ఞాన రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న మానవుడు చావును జయంచగలడా? జయించవచ్చని అంటున్నారు జెరూసలేంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యువల్ నోవా హరారి. జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని, జెనెటికల్ ఇంజనీరింగ్ లేదా సైబోర్గ్ టెక్నాలజీని ఉపయోగించి చావుకు చావును లిఖించవచ్చని ఆయన చెబుతున్నారు. అప్పుడు చావు, పుట్టుకలు మానవుడి చేతిలోనే ఉంటాయి. అప్పుడు పురాణాలను తిరగ రాసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా మెషిన్‌ను, మనిషిని కలగలిపి హాలీవుడ్ చిత్రం టెర్మినేటర్‌లోని ష్వాజ్నెగ్గర్ పాత్రలాగా సైబోర్గ్‌ను సృష్టించవచ్చని, ఇప్పటికే ప్రపంచంలోని అనేక సాంకేతిక దిగ్గజ సంస్థలు ఈ దిశగా ప్రయోగాలు ప్రారంభించాయని ప్రొఫెసర్ హరారి తెలిపారు. ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రయోగాలు ఫలించి ఓ 200 సంవత్సరాల్లో మానవుడు పూర్తి సైబోర్గ్గా మారుతాడని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. మానవుడు సైబోర్గ్గా మారితే బాడీలో ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకుంటా చావు దరిదాపుల్లోకి రాకుండా చూసుకోగలడని ఆయన అన్నారు. అయితే సైబోర్గ్గా మారడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో ధనవంతులకే అజరామరులయ్యే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.