breaking news
NIPHO
-
ఆఫ్రికా నత్తల నియంత్రణ అంత సులువు కాదు!
ప్రకృతిలో పుట్టిన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే జాతులను ఇన్వాసివ్ స్పెసీస్ (దురాక్రమణ జాతులు) అంటారు. మొక్కలు, జీవులు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా ఉండవు. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని తామర తంపరగా పెంపొందించుకుంటూ సమస్యాత్మకంగా మారతాయి. స్థానికంగా పంటలను ఆరగించేస్తూ.. రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్మ, వయ్యారిభామ అలాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది ‘జెయింట్ ఆఫ్రికన్ నత్త’. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శక్తివేల్, డాక్టర్ ఎ. మరియదాస్, డాక్టర్ సి. ఆలిస్ ఆర్ పి సుజీత ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను సూచిస్తున్నారు. ‘సాక్షి సాగుబడి’ కోసం వారు అందించిన వివరాలతో ప్రత్యేక కథనం.మన దేశంలో దాదాపు 1,500 రకాల నత్తలున్నాయి. వాటిలో తొమ్మిది జాతుల నత్తలు పూలు, కూరగాయలు, పండ్ల తోటలకు హాని కలిగిస్తున్నాయి. హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అచటినా ఫులికా అనే జెయింట్ ఆఫ్రికన్ నత్త కూడా ఇప్పుడు తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని చోట్ల పండ్ల తోటలు, కూరగాయ తోటల్లో తామర తంపరగా విస్తరిస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దీన్ని ‘అత్యంత దురాక్రమణ గుణం కలిగిన వంద జాతు’ల్లో ఒకటిగా గుర్తించింది. నత్తల సమగ్ర నిర్వహణ మార్గాలివి:→ తోటను శుభ్రంగా ఉంచండి. కలుపు మొక్కలను తొలగించండి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొక్కల్లేకుండా ఖాళీగా ఉంచండి. → తోటలు/పొలాల్లోకి నత్తలు రాకుండా ఉండాలంటే చుట్టూతా ఉప్పు, సున్నపు పొడి లేదా కాపర్ సల్ఫేట్ చల్లితే చాలు. ఈ పదార్థాలను దాటి నత్తలు వెళ్లలేవు. → ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి, చంపుతుంది. కాపర్ సల్ఫేట్ విషపూరితమైన రసాయనం కాబట్టి అవరోధంగా పనిచేస్తుంది. వీటిని చల్లిన ప్రాంతాల్లో నత్తల సంఖ్య వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటల్లోకి ప్రవేశించకుండా లేదా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి నమ్మదగిన పద్ధతి ఇది. → ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా బీరు, వైన్ లేదా ఈస్ట్‌లను పోసి.. ఆ పాత్ర అంచు నేలతో సమానంగా ఉండేలా, పాతిపెట్టాలి. నత్తలు పాక్కుంటూ వచ్చి అందులో పడతాయి. అప్పుడు ఉప్పు వేస్తే, చనిపోతాయి. → నత్తలను ఆకర్షించడానికి కుండలు, బాక్సులు లేదా తడి సంచుల కింద నత్తలు లోపలికి వెళ్లే అంత ఖాళీ ఉండేలా రాళ్లు అమర్చి, వాటి లోపల క్యాబేజీ ఆకులు లేదా బొప్పాయి కాండాలను ఎరగా పెట్టి, రాత్రంతా అలా ఉంచాలి. ఉదయానికి నత్తలు వాటి కింద చేరతాయి. వాటిపై ఉప్పు చల్లితే చనిపోతాయి. లేదా వాటిని నలిపివేసి చంపండి. → పండ్ల చెట్లు, కూరగాయ మొక్కల కాండాలకు ఎగబాకకుండా ఉండాలంటే.. వాటి చుట్టూ ఒక వలయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లండి. → నత్తలు మొక్కలు, చెట్ల పైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు (సుమారు 0.8 మిమీ మందం) చుట్టండి. → నత్తలున్న తోటల్లో 3 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం (అంటే.. 400 లీటర్ల నీటిలో 12 కిలోల కాపర్ సల్ఫేట్ కలిపి హెక్టారుకు) పిచికారీ చేయండి. → కంచెలు/ప్రహరీలు, నత్తలు గుడ్లు పెట్టిన ప్రాంతాల్లో ఒక లీటరు నీటిలో కాపర్ సల్ఫేట్ (60 గ్రా.), పొగాకు(25 గ్రా.) రసం కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా నత్తల ముప్పును నియంత్రించవచ్చు. → పొగాకు మిశ్రమాన్ని తయారు చేసే పద్ధతి: 50 గ్రాముల పొగాకును 1.5 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ద్రావణం 1 లీటరుకు తగ్గే వరకు మరిగించండి. అందులో, 1 లీటరు నీటిలో 60 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కలపండి. ఆ ద్రావణాన్ని నత్తలున్న చోట పిచికారీ చేయండి. → ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టి సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు/చెట్లపై ఉండే నత్తలను ప్రజల సహకారంతో చేతులతో తీసివేయించటం, బాతులతో నత్తలను తినిపించటం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని నియంత్రించడానికి అవకాశం ఉంది.నత్తలన్నీ గుడ్లు పెడతాయి!జెయింట్ ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తలన్నిటిలో మగ, ఆడ జననాంగాలుంటాయి. కాబట్టి ఆడ, మగ కూడా గుడ్లు పెడతాయి. సాధారణంగా శరద్ రుతువు, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు జతకూడి తడి నేలలో గుండ్రని తెల్ల గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు ఒక సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. నత్త మూడు నుంచి ఐదేళ్లు జీవిస్తుంది. జెయింట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50–200 గుడ్లు పెడుతుంది. దాని జీవితకాలంలో వెయ్యి వరకు గుడ్లు పెడుతుంది.నత్తల ద్రావణంతో పంటలకు మేలు!నత్తలు పంటలకు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ నత్తలతో పంటల పెరుగుదలను వేగవంతం చేసే ద్రావణం(గ్రోత్ పమోటర్) తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నత్తల ద్రావణం తయారు చేసే పద్ధతి: అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకొని, అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం పొయ్యాలి. 15 రోజులు ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగానే పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిని 7 రోజులు వూరబెట్టండి. నత్తల ద్రావణం అర లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో ఏ పంటల కైనా పిచికారీ చెయ్యొచ్చు. నత్తల సమస్య తీరిపోతుంది. పంట బలంగా పెరిగి రైతుకు డబ్బులు వస్తాయని ఆయన సూచించారు. -
రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవినియోగానికి స్వస్తి సేంద్రియ సేద్యంతో మెరుగైన దిగుబడి నేడు మల్యాల మండలం ఓబులాపూర్‌లో మామిడి సాగుపై రైతులకు శిక్షణ జిల్లా రైతులు వేలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగుపై సరైన అవగాహన లేక వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. రైతులకు మెలకువలు నేర్పించి మేలైన దిగుబడులు సాధించేలా తోడ్పాటునందించాల్సిన ఉద్యానవన అధికారులు కనిపించకుండా పోతున్నారు. మామిడిలో తెగుళ్ల నివారణ కోసం, అధిక ఫలసాయం కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులనే నమ్ముకుని నష్టపోతున్నారు. కొక్కు అశోక్‌కుమార్ సైతం మొదట్లో అందరిలాగే ముందుకు సాగాడు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. మామిడిలో అధిక దిగుబడి సాధించడంపై పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యూడు. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఏకంగా ఎనిమిది లక్షల ఆదాయం ఆర్జించబోతున్నట్టు ధీమాగా చెబుతున్నాడు. నాడు ఎంఈవోగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. నేడు మామిడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. -జగిత్యాల వ్యవసాయంలో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. హరితవిప్లవం తర్వాత అధిక దిగుబడి అంటూ సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో భూములు నిస్సారమై దిగుబడులు గణనీయంగా తగ్గారు. రసాయనాల ప్రభావంతో భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు కూడా కనుమరుగవుతున్నారు. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన కొక్కు అశోక్‌కుమార్ అనే రిటైర్డ్ ఎంఈవో వినూత్న ప్రణాళికతో పెట్టుబడి లేని సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాడు. తోటి రైతుల కోసం ఆదివారం తన తోటలో ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం విశేషం. ఎనిమిది ఎకరాల్లో మామిడి అశోక్‌కుమార్ మల్యాల మండలం ఓబులాపూర్ శివారులో ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. మొదట్లో అందరిలాగే బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు వేయడం, నాలుగైదుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఐదారుసార్లు మామిడివేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో దున్నించడం చేశాడు. దీంతో భూమి కొనుగోలుకు అరుున ఖర్చు కంటే మామిడితోట నిర్వహణపై పెట్టే ఖర్చు మూడింతలు ఎక్కువగా ఉండేది. ఇలా నాలుగైదు ఏళ్లు రసాయన మందులు విపరీతంగా పిచికారీ చేస్తుండటంతో మామిడితోటలో దిగుబడి పెరిగే బదులు కొమ్మతొలుచు పురుగు, ఆకుమచ్చ ఏర్పడం మొదలైంది. పలు రకాల తెగుళ్లు, రోగాలు వచ్చి మామిడిని నష్టం చేస్తుండేవి. హైదరాబాద్‌లో శిక్షణ హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) మామిడి రైతులకు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లి నాలుగైదు నెలలపాటు శిక్షణ పొందాడు. విద్యాధికుడు కావడంతో ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంటలకు మేలు చేసే పురుగులు ఎలా కనుమరగవుతున్నారుు? అనే విషయాలతోపాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా వాడాలి? అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మొదలైన మిత్ర పురుగుల పెంపకం శిక్షణ తర్వాత ఎన్ఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు ఉచితంగా రెడ్‌విడ్ బగ్స్, బ్రేకాన్స్, ట్రైకోగ్రామా, ట్రైకోకాడ్స్ వంటి మిత్రపురుగులను ఒక్కో జత అందించారు. దీంతో ఈ పురుగులను లార్వా దశ నుంచి ఎగిరే దశ వరకు ఇంటి దగ్గర పెంచుతున్నాడు. ఇవి కొద్ది రోజుల్లోనే ఒక్కో పురుగు తన జాతి లక్షణాన్ని బట్టి 400-500 గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే మిలియన్, ట్రిలియన్ మిత్ర పురుగులను తయారు చేసి, మామిడితోటలో వ దులుతుంటాడు. ఈయన మామిడితోటకు వెళితే పురుగుమందుల వాసనకు బదులు మంచి సువాసన వెదజల్లే మిత్ర పురుగులు కనువిందు చేస్తూ, స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ కొమ్మ మీద సాలేపురుగులు వంటివి కనిపిస్తాయి. ఏడాదికి ఒకమారు మాత్రమే మామిడి తోటను దున్నిస్తాడు. భూమి బలోపేతం కోసం మరిన్ని చర్యలు భూమిని సారవంతం చేసేందుకు సుభాష్ పాలేకర్ విధానంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మరింత ఆధునికతను జోడించాడు. చిక్కుడు, పెసర, కంది, మినుములు, ఉలువలు, జనుము, జీలుగ వంటివి సేకరించి, వర్షాలు కురియగానే మామిడితోటలో చల్లుతాడు. ఒక లీటర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతంలో, 100 గ్రాముల టైకో డెర్మా శిలింధ్రంతోపాటు 100 గ్రాముల సుడోమోనాస్ బ్యాక్టీరియాతో లీటర్ ద్రావణం తయారవుతుంది. దీంట్లో విత్తనాలను మూడు రోజులు నానబెట్టి, తర్వాత ఆరబెట్టాలి. విత్తనాలు చల్లుతున్నాడు. ఇలా రెండేళ్లుగా చేస్తున్నాడు. పంటకు వచ్చిన తర్వాత వాటి నుంచి విత్తనాలను మరో పంటకు సేకరించి, మొక్కలను అలాగే వదిలేస్తాడు. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూమికి మల్చింగ్గా పనిచేస్తాయి. వర్మి కంపోస్టు, వర్మివాష్ మామిడి చెట్లకు వర్మి కంపోస్టు, వర్మి వాష్‌ను ఉపయోగిస్తారు. ఒక లారీ పేడ తెప్పించి దాంతో వర్మి కంపోస్టు తయారు చేస్తాడు. ఇందుకోసం రెండు షెడ్లు నిర్మించుకున్నాడు. ఇందులో తయారైన వర్మికంపోస్టును మొక్కలకు పోస్తాడు. ఓ డ్రమ్ములో ఇసుక, కంకరరాళ్లు, వర్మి కంపోస్టు పోసి, అందులో ఆవు మూత్రం పోసి వర్మి వాష్ తయారు చేస్తుంటాడు. దీనిని లీటర్ల కొద్ది చెట్లకు అందిస్తుంటాడు. వీటి తయారీలో ఎక్కడ కూడా నీటిని ఉపయోగించడు. ఆవును కొనుగోలు చేసి, దాని ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి అన్ని పదార్థాల్లో ఉపయోగిస్తాడు. ఆవు మూత్రం నేరుగా ఓ తొట్టెలోకి వెళ్లేలా షెడ్డు నిర్మించాడు. జీవామృతం తయారీలో బెల్లంకు బదులు రాలిన మామిడి కాయలను ఓ తోట్టిలో వేసి నెలల తరబడి మాగబెట్టి వాడుతుంటాడు. రెండేళ్లుగా ఇలాంటి పద్ధతులు పాటించడంతో గతేడాది రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు లేకపోగా... ఈ విధానంలో దిగుబడి పెరిగే అవకాశముండడంతో దాదాపు రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ రాదని ఘంటాపథంగా చెపుతుండటం విశేషం. రైతులకు శిక్షణ ఇచ్చే స్థాయికి.. హైదరాబాద్‌లోని ఎన్ఐపీహెచ్ఎంలో జరిగే కార్యక్రమాల్లో తోటి రైతులకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొందిన జగిత్యాల మండలం లక్ష్మీపూర్, మల్యాల మండలం లంబాడిపల్లె, ఓగులాపూర్, మేడిపల్లి మండలం మాచాపూర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, నాగునూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు, ఆసక్తి ఉన్న ఇతర రైతులకు ఓబులాపూర్‌లోని తన తోటలో ఒక్క రోజు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రైతు కోక్కు అశోక్‌కుమార్‌ను 98661 92761లో సంప్రదించవచ్చు.


