breaking news
NFC grounds
-
హైదరాబాద్ చేజారిన విజయం
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-25 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు విజయం చేజారింది. విదర్భతో ఇక్కడి ఎన్ఎఫ్సీ మైదానంలో గురువారం ముగిసిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో హైదరాబాద్ విఫలమైంది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆఖరి రోజు 420 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగలిగింది. తుషార్ కడు (118 బంతుల్లో 79; 10 ఫోర్లు, 1 సిక్స్), ఏవీ వాంఖడే (54 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో విదర్భను ఆదుకున్నారు. ఏపీ ఛోరే (36), ఏసీ శర్మ (27), ఏఏ సార్వతే (25) కూడా ప్రత్యర్థి గెలుపును అడ్డుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కనిష్క్ నాయుడు 3, మెహదీ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు 172/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ 8 వికెట్లకు 306 పరుగులకు డిక్లేర్ చేసింది. బెంజమిన్ థామస్ (75 బంతుల్లో 59; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ సింగ్ (47 బంతుల్లో 61; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. -
పటిష్టస్థితిలో హైదరాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: కల్నల్ సీకే నాయుడు అండర్-25 టోర్నమెంట్లో హైదరాబాద్ ‘ఎ’ జట్టు తొలిఇన్నింగ్స్‌లో 114 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో నిమేష్ రెడ్డి సెంచరీతో కదంతొక్కడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం మూడో రోజు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలో 276 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ సాకేత్ సాయిరామ్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడిచేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చే సింది. నిమేష్ రెడ్డి (107; 16 ఫోర్లు; 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రోహిత్ నాయుడు 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్ సార్వతే రెండు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్ ప్రస్తుతం 286 పరుగులు ముందంజలో ఉంది.