breaking news
The new record
-
రికార్డ్ కోసమని ఈ ప్రయత్నం చేయలేదు!
- సంగీత దర్శకుడు, గీత రచయిత ఇ.యస్. మూర్తి కీరవాణి లాంటి సంగీత దర్శకులు అడపాదడపా పాటలు రాస్తుంటారు. కానీ ఓ సంగీత దర్శకుడు ఒక సినిమాలో మొత్తం అన్ని పాటలూ రాయడం మాత్రం నిజంగా రికార్డే. ఆ ఘనత ఇ.యస్. మూర్తికి దక్కుతుంది. రాజేంద్రప్రసాద్‌తో ఆర్.కె. మలినేని దర్శకత్వంలో రామోజీరావు, క్రిష్ నిర్మించిన ‘దాగుడుమూత దండాకోర్’కి ఆయనే స్వరకర్త, గీత రచయిత. ఇ.యస్. మూర్తిగా సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈవని సత్యనారాయణ మూర్తితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ... ‘దాగుడుమూత దండాకోర్’తో కొత్త రికార్డ్ సృష్టించినట్టున్నారు? ఏదో రికార్డు కోసమని నేనీ ప్రయత్నం చేయలేదు. ‘సూర్యవంశం’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘సంక్రాంతి’ తదితర చిత్రాల్లో ఇప్పటికి 50కి పైగా పాటలు రాశా. ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగిన క్రిష్, పాటలు కూడా నన్నే రాయమన్నారు. మూడు పాటలు నేను రాసి, ఒక పాట సీతారామశాస్త్రిని రాయమన్నా. నాలుగోది కూడా నువ్వే రాసేస్తే ఒక రికార్డు అవుతుందని ఆయనే చెప్పారు. సీతారామశాస్త్రితో ‘కొక్కొకొక్కో’ పాటలో పాడించాలనెందుకనుకున్నారు? కొంచెం జానపద తరహా గీతమది. ఆయన గొంతులో వింటే చాలా బావుంటుందనిపించింది. నాకాయన బాగా సన్నిహితుడు. అందుకే అడగగానే ఒప్పుకున్నారు. పారితోషికం ఇస్తామంటే, ఒకే ఒక్క రూపాయి అడిగారు. అంత గొప్ప మనిషి ఆయన. ఎప్పుడో ‘కళ్లు’ సినిమాలో ‘కొక్కొరోకో’ పాట పాడారు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత ‘కొక్కొ కొక్కో’ అంటూ కోడి మీద పాటలో గొంతు కలపడం భలే గమ్మత్తుగా అనిపించింది. ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌తో మీకు బంధుత్వం ఉందట? అవును. ఆయన నాకు మేనమామ. మా అమ్మకు రెండో అన్నయ్య. తణుకులో రెండేళ్లు అమ్మమ్మ వాళ్లింట్లో ఉన్నాను. ఆ సమయంలో ఆయనతోనే ఎక్కువ గడిపేవాణ్ణి. నేను గిటార్ బాగా వాయిస్తానని తెలిసి నన్ను ‘గిటార్ మూర్తి’ అని ముద్దుగా పిలిచేవారు. అసలు మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా మొదలైంది? మా మేనమామలు రామారావు, తిమ్మేశ్వరరావుల పుణ్యం. వాళ్ల దగ్గర గిటార్ నేర్చుకున్నా. కాకినాడలో స్థిరపడ్డాక సంగీతాభిలాష మరీ ఎక్కువైంది. సినిమా ఫీల్డ్కి ఎలా వచ్చారు? చార్టెర్డ్ అకౌంటెన్సీ చదవడం కోసం మద్రాసు వెళ్లాను. ఓ స్నేహితుని ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయమై, తన దగ్గర గిటారిస్టుగా పని చేసే అవకాశమిచ్చారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు విద్యాసాగర్ పరిచయమయ్యారు. ఆయన ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఎస్.ఎ. రాజ్‌కుమార్ దగ్గర చేరా. ‘నవవసంతం’ దగ్గర్నుంచీ చాలా ఏళ్లు ఆయన దగ్గరే సహాయకునిగా పనిచేశా. మరి మ్యూజిక్ డెరైక్షన్ ఎప్పుడు చేశారు? దాసరి నటించిన ‘మాయదారి కుటుంబం’కు తొలిసారిగా స్వరాలందించా. ఆ సినిమా ఆడలేదు. దాంతో మళ్లీ రాజ్‌కుమార్ దగ్గర చేరిపోయా. కొన్ని అవకాశాలొచ్చినా సాహసించలేదు. పదహారేళ్ల తర్వాత ‘గమ్యం’కు మ్యూజిక్ చేశా. ఆ తర్వాత ‘భలే మొగుడు-భలే పెళ్లాం’, ఇప్పుడేమో ‘దాగుడుమూత...’ మ్యూజిక్ డెరైక్షన్, రైటింగ్, సింగింగ్... వీటిల్లో మీ ప్రాధాన్యం దేనికి? నాకు సంగీత దర్శకత్వమంటే ప్రాణం. ఆ తర్వాతే ఏదైనా! అయితే నా దగ్గరకు వచ్చి పాటలు రాయమని అడిగితే రాస్తా. పాడమన్నా పాడతా. చాలామందికి తెలియదు కానీ, చాలా ఏళ్ల క్రితం రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలోని ‘సూపర్ బాయ్’ అనే త్రీడీ సినిమాకు డైలాగ్స్ కూడా రాశా. నేను అభిమానించే ఎమ్మెస్ విశ్వనాథన్ దానికి సంగీత దర్శకుడు. అందులో టైటిల్ సాంగ్ నేనే రాశా. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు, లఘు చిత్రాలు డెరైక్ట్ చేశా. ‘రుచికరమైన వక్కపొడి... క్రేన్ వక్కపొడి’ అనే పాపులర్ జింగిల్కు రచన, సంగీతం నావే! ‘ఎల్.బి. డబ్ల్యూ’ సినిమాలో హీరోయిన్గా చేసిన నిశాంతి మీ అమ్మాయే కదూ! అవును. తనకు డెరైక్షన్ అంటే చాలా ఆసక్తి. ముంబైలో రెండేళ్లు డెరైక్షన్ కోర్సు కూడా చేసింది. అనుకోకుండా ‘ఎల్.బి.డబ్ల్యూ’లోనూ, మరికొన్ని లఘు చిత్రాలలోనూ నటించింది. నటి జియాఖాన్‌తో, మా అమ్మాయి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇంతలో జియా చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం నిశాంతి ముంబయ్‌లో ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. - పులగం చిన్నారాయణ -
రీట్వీట్లలో మోదీ, ఫాలోవర్లలో అమితాబ్ టాప్
న్యూఢిల్లీ: ట్వీటర్లో ప్రధాని మోదీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ చెరో కొత్త రికార్డు సృష్టించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత మోదీ చేసిన ట్వీట్‌ను దేశంలో అత్యధికంగా 70,515 మంది షేర్ చేశారు. ‘భారత్ గెలిచింది. భారత్‌కు విజయం. ఇక మంచి రోజులు రాబోతున్నాయి’ అంటూ మోదీ చేసిన ట్వీట్‌కు దేశంలో అత్యధిక రీట్వీట్లు దక్కాయి. ట్వీటర్లో దేశంలో అత్యధిక మంది అనుసరిస్తున్న ప్రముఖుడిగా అమితాబ్ రికార్డు సృష్టించారు. దేశంలోఆయనకు మొత్తం 1.18 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
మార్కెట్ ః 100 లక్షల కోట్లు
మార్కెట్ అప్డేట్ చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ మరోసారి దేశీ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు సాధించింది. తొలిసారి ముగింపులో రూ. 100 లక్షల కోట్ల విలువను నిలుపుకుంది. వాస్తవానికి గత శుక్రవారం ఇంట్రాడేలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. అయితే ఆపై అమ్మకాల కారణంగా వెనక్కి తగ్గింది. కాగా, బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 1,00,40,625 కోట్ల(1.6 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలవడం ద్వారా మార్కెట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు బ్లూచిప్స్‌తోపాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం పురోగమించడం లాభించింది. ఈ ఏడాదిలోనే మార్కెట్ విలువకు రూ. 29 లక్షల కోట్లు(500 బిలి యన్ డాలర్లు) జమకావడం చెప్పుకోదగ్గ విశేషం! 2009లో నమోదైన రూ. 50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2003లో ఉన్న రూ. 10 లక్షల విలువతో పోలిస్తే 10 రెట్లు ఎగసింది!! తద్వారా విలువరీత్యా ప్రపంచంలోని టాప్-10 ఎక్స్ఛేంజీలలో బీఎస్ఈ స్థానాన్ని పొందింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్ ఒక్కటీ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. అక్కడక్కడే.... ఉదయం నుంచీ పలుమార్లు ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ చివరికి మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ నామమాత్రంగా ఒక పాయింట్ నష్టపోయి 28,443 వద్ద నిలవగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 8,538 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,929 లాభపడితే, 1,082 మాత్రమే నష్టపోయాయి. 200 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకడం విశేషం. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, భెల్ 2.5%పైగా పురోగమించగా, డాక్టర్ రెడ్డీస్ అదే స్థాయిలో డీలాపడింది.