అభిమాన నేత కోసం భర్తనే చంపి...రొమ్ము కోసేసినా..
దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది తమ పోరాటాలకు, అప్పుడు అందించిన సేవలకు తగిన గుర్తింపును పొందారు. అయితే స్వాతంత్య్ర యోఢులుగా గుర్తింపు పొందిన వారిలో అత్యధికులు పురుషులే కాగా.. అలా వెలుగులోకి వచ్చిన మహిళలు తక్కువ మందే. అలాంటి వారిలో నీరా ఆర్య ఒకరు. ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో భారతీయులకు తెలియని ఆ పేరు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇప్పుడీ గుర్తింపు రావడానికి ఆమె జీవిత కధ బయోపిక్‌గా తెరకెక్కడం కూడా ఓ కారణం. భారత జాతీయ సైన్యంలో మొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య. దేశం పట్ల నిస్వార్థ అంకితభావం కలిగిన నీరా ఆర్య సాహసోపేతమైన కథ కన్నడ చిత్ర నిర్మాత దర్శకత్వం వహించిన చిత్రం ద్వారా వెలుగులోకి వస్తోంది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరా ఆర్య(Neera Arya) మార్చి 5, 1902న బాగ్పత్ జిల్లాలోని ఖేక్రా నగర్లో ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, సేథ్ ఛజ్జుమల్, ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త, ఆయన నీరా ఆమె సోదరుడు బసంత్ లకు కోల్‌కతాలో విద్యాభ్యాసం చేయించారు. చిన్నప్పటి నుంచీ, నీరా తన దేశ శ్రేయస్సు, జాతీయతా భావాల పట్ల బలమైన మక్కువను చూపించేవారు. ఆ మక్కువతోనే పాఠశాల చదువు పూర్తి చేసిన తర్వాత, ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో సైనికురాలిగా చేరారు.అయితే ఆమె తండ్రి ఆమెను బ్రిటిష్ ఆర్మీ అధికారి, సిఐడి ఇన్ స్పెక్టర్ అయిన శ్రీకాంత్ జై రంజన్ దాస్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రి మాట కాదనలేక పెళ్లి చేసుకున్నప్పటికీ... ఆ దంపతులు ఇద్దరివీ భిన్నమైన నమ్మకాలు భిన్నమైన దారులుగా మారాయి, ఒకరు బ్రిటిష్ ప్రభుత్వం కోసం పనిచేస్తుంటే మరొకరు భారతదేశపు అజాద్ హింద్ ఫౌజ్ కోసం.. చేస్తుండడం ఇద్దరి మధ్య గొడవల్ని సృష్టించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో నీరా భాగమని శ్రీకాంత్ తెలుసుకుని, అతను ఆమె నుంచి ఏదో ఒకలా నేతాజీ గురించిన సమాచారం పొందడానికి ప్రయత్నించాడు. అయితే నీరా అతను ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా చెప్పడానికి నిరాకరించేది.ఒక రోజు, నీరా బోస్‌ను కలిసేందుకు వెళుతుండగా శ్రీకాంత్ ఆమెను రహస్యంగా అనుసరించాడు. చెంత తుపాకీతో సహా స్థావరాన్ని చేరుకున్న శ్రీకాంత్ అక్కడ దాడికి పాల్పడి బోస్ డ్రైవర్‌ను కొట్టడం మొదలుపెట్టాడు.భర్తను చూసి అవాక్కయిన నీరా.. ఆ సమయంలో బోస్‌ను రక్షించడానికి ఏ మాత్రం సంకోచించకుండా తన భర్త శ్రీకాంత్‌ను చంపేసింది.దీని ఫలితంగా బ్రిటిష్ వారు ఆమెను అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలుకు పంపారు. కానీ ఆమె తన దేశం కోసం ప్రేమించడం పోరాడటం అప్పుడూ ఆపలేదు. ఆమె జైలు శిక్ష సమయంలో, నీరా భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గురించి, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గురించి సమాచారం వెల్లడిస్తే ఆమెకు బెయిల్ ఇస్తామని ప్రలోభ పెట్టినా కూడా తన అభిమాననేత గురించి చెప్పడానికి ఆమె నిరాకరించింది. అంతేకాదు తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి జైలు అధికారులపై ఖాండ్రించి ఉమ్మివేసింది.దీంతో ఆమె అక్కడ చిత్ర హింసలకు గురయ్యారు. సుభాష్ చంద్రబోస్ తన గుండెల్లో ఉన్నారని చెప్పినందుకు శిక్షగా ఆమె రొమ్ములు కూడా కత్తిరించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ క్రూరమైన హింస ఎదుర్కున్నా, నీరా విధేయురాలిగా ఉండి, ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి మహిళా గూఢచారిగా బోస్ తో గుర్తింపు దక్కించుకుంది. నీరా ఆర్య జీవిత కధ∙ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో రూపా నాయర్ బాలీవుడ్లో నటిగా దర్శకురాలిగా అరంగేట్రం చేయనున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న రచయిత వరుణ్ గౌతమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.