breaking news
Neelapu vamsi krishna
-
పరారీ ఖైదీ లొంగిపోయాడు..
న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు చెన్నూర్ అటవీ ప్రాంతంలో బేడీలు గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని కోర్టు నుంచి గురువారం ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ శుక్రవారం అదే కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడైన వంశీకృష్ణను ఓ హత్యకేసులో గురువారం కోర్టుకు తీసుకురాగా, పరారైన విషయం తెలి సిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు లు వంశీకృష్ణ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఒత్తిడి తేవడంతో అతడు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయవాది పూర్మ శ్రీనివాస్ ద్వారా శుక్రవారం కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే వంశీకృష్ణను వన్‌టౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వంశీకృష్ణను అరెస్ట్ చేశామని, శనివారం కోర్టులో హాజరుపర్చుతామని సీఐ తెలిపారు. వంశీకృష్ణను బైక్‌పై తప్పించిన నాగరాజు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చెన్నూరు అటవీ ప్రాంతంలో మకాం.. అయితే, వంశీకృష్ణ కోర్టు నుంచి తప్పించుకొని ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లాడు. గోదావరినది బ్రిడ్జి దాటిన తర్వాత బైక్‌ను వదిలేసి మరో వాహనంలో చెన్నూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వంశీకృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ బంధువులు న్యాయవాదిని సంప్రదించారు. ఆయన అటవీ ప్రాంతానికి వెళ్లి వంశీకృష్ణను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. వంశీకృష్ణ చేతులకు నూనె రాసి బేడీలను తొలగించుకుని చెన్నూర్ అటవీ ప్రాంతంలోనే పడేశానని తెలిపినట్టు న్యాయవాది వివరించారు. జైల్లో చంపుతాడనే భయానికే... కరీంనగర్ జిల్లా జైలులోనే ఉన్న మరో నిందితుడు తనని చంపుతాడనే భయంతోనే వంశీకృష్ణ పరారైనట్లు న్యాయవాది తెలిపారు. ఈ నెల 11న గోదావరిఖని ఐబీ కాలనీలో ప్రశాంత్ అలియాస్ సన్నీ అనే యువకుడి హత్య కేసులో చందు అనే నిందితుడిని జిల్లా జైలుకు తీసుకొచ్చారు. చందు, వంశీకృష్ణలు హైదరాబాద్‌లో ఉండగా, వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత వారు కలుసుకోలేదు. ఇరువర్గాల మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో చందు తనను చంపుతాడనే భయంతోనే పరారైనట్లు వంశీకృష్ణ చెప్పాడని న్యాయవాది సత్యనారాయణ పేర్కొన్నారు. -
కోర్టు నుంచి అండర్ ట్రయల్ ఖైదీ పరారీ
కోల్‌సిటీ (గోదావరిఖని): కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని జిల్లా ఆరవ అదనపు జడ్జి కోర్టు నుంచి అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ ఎస్కార్ట్ పోలీసులను కళ్లుకప్పి తప్పించుకున్నాడు. మూత్రవిసర్జనకు వెళ్తానని ఎస్కార్ట్‌తో చెప్పి కోర్టు ప్రహరీగోడ దూకిన వంశీకృష్ణ అప్పటికే రోడ్డుపై బైక్‌తో సిద్ధంగా ఉన్న యువకుడితో కలిసి పరారయ్యాడు. అతడిపై గోదావరిఖని వన్‌టౌన్ ఠాణాలో రౌడీషీట్‌తోపాటు పలు హత్యకేసులున్నాయి. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు... ఐబీ కాలనీకి చెందిన నీలపు వంశీకృష్ణ(23)ను గంజాయి రవాణా కేసులో ఈ నెల 15న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. 2010 నవంబర్ 7న ఐబీ కాలనీలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట పిడుగు సతీష్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటనలో వంశీకృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీకృష్ణను కరీంనగర్ జైలు నుంచి గోదావరిఖని కోర్టుకు గురువారం ఉదయం ఎస్కార్ట్ పోలీసులు మధుసూదన్‌రావు (ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్), సుభాష్ (కానిస్టేబుల్) తీసుకొచ్చారు. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించడానికి సుభాష్ వెళ్లగా వంశీకృష్ణకు ఎస్కార్ట్‌గా మధుసూధన్‌రావు ఉన్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్తానని మధుసూదన్‌ను నమ్మంచిన అతడు కోర్టు గోడదూకి అప్పటికే బైక్‌తో సిద్ధంగా ఉన్న యువకుడితో కలసి పరారయ్యాడు. ఈ ఘటనపై వెంటనే మధుసూధన్‌రావు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.