breaking news
national basket ball team
-
ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు
లెబ్రాన్ జేమ్స్(Lebron James).. బాస్కెట్ బాల్ గేమ్ ఫాలో అయ్యేవారికి పరిచయం అక్కర్లేని పేరు. నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్(NBA) గేమ్‌లో అతనికున్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికాలో ఎన్బీఏ గేమ్ బాగా పాపులర్. తాజాగా లెబ్రాన్ జేమ్స్ ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. దీంతో లీగ్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతని ఆట కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి అభిమానులు వెనుకాడడం లేదు. ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ లేకర్స్, ఓక్లహామా సిటీ థండర్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్లు రికార్డు ధర పలికాయి. ఒక్కో టికెట్ 92 వేల డాలర్లు (సుమారు రూ.75 లక్షలు)కు అమ్ముడుపోతున్నట్లు బ్లీచర్ రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి ఈ మ్యాచ్ లో లెబ్రాన్ జేమ్స్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు . లాస్ ఏంజిల్స్ లేకర్స్ అంతకుముందు ఫిబ్రవరి 4న న్యూ ఆర్లీన్స్ పెలికాన్స్ తో, ఫిబ్రవరి 9న మిల్వౌకీ బక్స్ తో, ఫిబ్రవరి 11న గోల్డెన్ స్టేట్ వారియర్స్ తో ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్ లలో ఏదో ఒకదాంట్లో జేమ్స్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సగటున లేకర్స్, థండర్ మ్యాచ్ టికెట్ ధర 1152 డాలర్లు (రూ.94 వేలు) గా ఉంది. ఇక లేకర్స్, బక్స్ మ్యాచ్ టికెట్ సగటు ధర 1302 డాలర్లు (రూ.లక్ష)గా ఉండటం విశేషం. ఎన్బీఏ (NBA)లో ఆల్ టైమ్ రికార్డు 38,387 పాయింట్లుగా ఉంది. ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఈ రికార్డు నాలుగు దశాబ్దాలుగా అలాగే ఉంది. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ 38,325 పాయింట్లతో అతనికి చాలా దగ్గరగా ఉన్నాడు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. ఈ మధ్యే ఇండియాన పేసర్స్ తోనూ అతడు 26 పాయింట్లు స్కోరు చేశాడు. -
స్లమ్ నుంచి జిల్లా బాస్కెట్‌బాల్ జట్టు వరకు...
కోల్‌కతా బాలిక ప్రస్థానం కోల్‌కతా: కోల్‌కతా మహానగరంలోని మురికివాడ గల్లీలో పుట్టి పెరిగింది ఆమె. క్రీడలపై ఉత్సాహమే ఆమెను జిల్లా స్థాయికి చేరుకునేలా చేసింది. కోల్‌కతాలోని రైల్వే పట్టాలకు చేరువలోని గుర్తింపులేని మురికివాడకు చెందిన ప్రియాంకా ప్రసాద్ (12) ఈ ఘనత సాధించేందుకు ఏటికి ఎదురీదింది. బామ్మ, తమ్ముడితో కలిసి మురికివాడలో నివాసం ఉంటున్న ఆమె వేకువ జామునే నిద్రలేచి, స్థానిక ఎన్జీవో నిర్వహిస్తున్న కోచింగ్ క్లాసులకు హాజరవుతుంది. అక్కడి నుంచి ఇంటికొచ్చాక వంటా వార్పు వంటి పనులన్నీ తనే చేస్తుంది. సాయంత్రం చేత్లా సెంట్రల్ పార్కులో బాస్కెట్‌బాల్ ప్రాక్టీసు కొనసాగిస్తుంది. ఇదీ ఆమె దినచర్య. ఎంఎస్ వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన ఆసరాతో ఆమె పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లా జట్టులో చోటు సంపాదించగలిగింది. రాష్ట్రస్థాయిలో 24 పరగణాల జిల్లా జట్టును చాంపియన్‌గా నిలిపింది. ఎంఎస్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన గురువులు లాహా, కరీమా ఇచ్చిన శిక్షణతోనే తాను ఈ ఘనత సాధించగలిగానని, వారి ఆసరాతో మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నానని ప్రియాంక చెప్పింది.