breaking news
Narayankhed Assembly Constituency
-
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్.. 80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం
సాక్షి, నిజామాబాద్/ నారాయణ్‌ఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడుతూ.. ఎంపీగా కవితను ఓడించారని కేసీఆర్ నిజామాబాద్‌పై పగ పట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ జాడ లేకుండా పోయాడని ధర్మపురి అర్వింద్‌ను ఉద్ధేశించి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రేవంత్ మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్.. 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి పదేళ్లు గడిచిందని.. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకూ చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మద్దతు ధర అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని అన్నారు. రైతుల భూములు మింగేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని విమర్శించారు. చదవండి: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్ నారాయణ్‌ఖేడ్ గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయం: రేవంత్ ‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్. స్వాతంత్ర్యం కోసం నినదించిన కుటుంబం షెట్కాట్ కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ ఎవరికీ?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇంకా ఎవరికీ ఖరారు కాకముందే అసంతృప్తి రాజుకుంటుందా?.. దీని కోసం ఇద్దరు ముఖ్యనేతలు ఎవరికి వారే ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే అలకలు షురూ అయ్యాయా?.. పార్టీకి చెందిన మాజీ ఎంపీలంతా ఇటీవల హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని పరిశీలిస్తే అవుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖేడ్ టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్ పోటీ పడుతున్నారు. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. మరో వైపు పార్టీలోని ఇరు వర్గాలు కూడా తమ నాయకుడికే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నాయి. ఎలాగైనా ఈసారి తమ నాయకుడు పోటీలో ఉంటారని ఇరువర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. తొలి జాబితాలో దక్కని చోటు కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రవ్యాప్తంగా 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ తొలి జాబితాలో ఖేడ్‌కు చోటు దక్కలేదు. రెండో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఈసారైనా నియోజకవర్గం టికెట్ ప్రకటిస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చాకే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీలంతా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మధుయాష్కి నివాసంలో భేటీ అయ్యారు. అందులో నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్న సురేష్‌షెట్కార్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు, బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య తదితరులు ఉన్నారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ రాని ఈ మాజీ ఎంపీలంతా సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నారాయణఖేడ్‌లో పార్టీ కేడర్ చాలా ఏళ్లుగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక్కడ ఈ ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరు కారణంగానే బీఆర్ఎస్ విజయం సాధిస్తూ వస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఇరు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం టికెట్ రెండో జాబితాలో ఖరారయ్యే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.