breaking news
Naqvi
-
‘బెంగాల్ సహా దేశమంతటా సీఏఏ’
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన సీఏఏ భారత్‌లో అంతర్భాగమైన బెంగాల్ సహా దేశమంతటా అమలవుతుందని చెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుగా చరిత్ర, రాజ్యాంగాన్ని అథ్యయనం చేయాలని ఆయన హితవు పలికారు. కాగా,బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీలను తమ ప్రభుత్వం అమలు చేయబోదని, వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మమతా బెనర్జీ తెలిపిన క్రమంలో నక్వీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా పౌరసత్వ చట్టం ద్వారా ఎవరి పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఉండదని తన కోల్‌కతా పర్యటన రెండవ రోజున ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పౌర చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. -
‘ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింలు’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింల పేర్లను అక్రమంగా చేర్చారని బీజేపీ బుధవారం ఆరోపించింది. పాలక టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లు మూకుమ్మడిగా కుట్ర పన్ని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని, దీనిపై ఈసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ జాతీయ మీడియా చీఫ్ అనిల్ బలూనిలతో కూడిన ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ మేరకు ఈసీ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసినా తెలంగాణలో వారిని ఓటర్లుగా చేర్చారని నక్వీ ఆరోపించారు. దేశ చట్టాలకు విరుద్ధంగా రోహింగ్యా ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ఈసీ తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను చక్కదిద్దాలని కోరారు. ఓటర్ల జాబితాలో అసాధారణ హెచ్చుతగ్గులున్నాయని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. పాలక టీఆర్ఎస్ అక్రమ పద్ధతుల్లో బోగస్ ఓటర్లను చేర్పించిందని కేంద్ర మంత్రి నక్వీ ఆరోపించారు. -
కశ్మీర్లో వరద బీభత్సం
ఎడతెరపి లేని వానలు... జనజీవనం అస్తవ్యస్తం కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి.. శిథిలాల కింద 8 మంది ఉప్పొంగుతున్న జీలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం రంగంలోకి దిగిన కేంద్రం.. రూ.200 కోట్ల తక్షణ సాయం కేంద్రమంత్రి నఖ్వీని హుటాహుటిన కశ్మీర్‌కు పంపిన మోదీ శ్రీనగర్/జమ్మూ: ఏడు నెలలు తిరగకుండానే జమ్మూకశ్మీర్‌ను మళ్లీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. 36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వానలు, ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో తొమ్మిది మంది చనిపోయారు. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 8 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దూకాయి. జాతీయ విపత్తు సహాయక దళానికి(ఎన్డీఆర్ఎఫ్)చెందిన ఎనిమిది బృందాలు, ఆర్మీ బలగాలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. తక్షణ సాయం కింద కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ శ్రీనగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బుద్గాం జిల్లాలోని లాడెన్ గ్రామంలో నాలుగు ఇళ్లపై కొండచరియలు విరిగిపడంతో అందులోని వారంతా శిథిలాల్లో చిక్కుకుపోయారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, అందులో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో 8 మంది ఈ శిథిలాల కింద ఉండొచ్చని తెలిపారు. వరదలకు ఉధంపూర్‌లో కూడా ఒకరు చనిపోయారు. మరోవైపు వరుసగా మూడోరోజు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసేశారు. 294 కిలోమీటర్లున్న ఈ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో సుమారు 2 వేల ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కశ్మీర్‌లోని ఏడు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున స్థానికులు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ.. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని హుటాహుటిన కశ్మీర్‌లోయకు పంపారు. బారాముల్లా జిల్లాలోని పటాన్ ప్రాంతంలో పర్యటించిన నఖ్వీ.. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా సీఎం ముఫ్తీకి ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూడు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి సీఎం సయీద్, మంత్రులు స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. జీలం ఉగ్రరూపం.. భారీ వర్షాలతో కశ్మీర్లో జీలం నది ఉగ్రరూపం దాల్చింది. అనంతనాగ్ జిల్లాలోని సంగం, రామ్మున్షీ బాగ్లతోపాటు అనేకచోట్ల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాలవారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. సోమవారం సాయంత్రానికి నది కాస్త శాంతించింది. నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక రాజధాని శ్రీనగర్‌తోపాటు కశ్మీర్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలతో నిరాశ్రయులైనవారికి ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. 320 కుటుంబాలు ఈ శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. పూంఛ్ జిల్లాలోని చాందిక్-కలీ బ్రిడ్జి ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 50 మందిని పోలీసులు, సైనిక బలగాలు రక్షించాయి. సోమవారం ఉదయం శ్రీనగర్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కిందటేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ఆ వరదల్లో 300 మందికిపైగా చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.