breaking news
Nannapaneni Mohan
-
ప్రవాసులకు అత్యవసర సమయాల్లో చేయూతగా..
కాలిఫోర్నియా : ప్రవాస భారతీయులకు అత్యవసర సమయాల్లో చేయూత ఇవ్వాలనే సంకల్పంతో టీం ఎయిడ్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు. ఈ సంస్థ గురించి అవగాహన కలిగించేదుకు బే ఏరియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. లాభాపేక్షలేని ఈ సంస్థ పూర్తిగా స్వచ్ఛంద సేవకుల అంకితభావంతోనే నడుస్తున్నదనీ, తమ సేవలను అమెరికాలోని 50 రాష్ట్రాల్లో విస్తరింపజేయాలని భావిస్తోన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బే ఏరియాలోని వివిధ రాష్ట్రాల సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిలికానాంధ్ర వైస్ ఛైర్మన దిలీప్ కొండిపర్తి మాట్లాడుతూ.. ‘ఎంతటి వివేకవంతులైనా ఆపద సమయాల్లో అయోమయంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో పడతారని, అలాంటివాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం తోటి ప్రవాసుల నైతిక బాధ్యత. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా వేరే సేవ ఉండదు. టీం ఎయిడ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి సిలికానాంధ్ర తమ జగమంత కుటుంబంతో ఎల్లప్పుడూ సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు. ‘బంగారు భవిష్యత్తును ఆశిస్తూ స్వదేశాన్ని విడిచి వచ్చిన వారికి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా భుజం తట్టి సహాయం చేయాలనే సదుద్దేశంతో టీం ఎయిడ్ ప్రారంభించాము. టీం ఎయిడ్.. ఏ ఇతర కమ్యూనిటీ సంస్థలకు పోటీ కాదు. అమెరికా పోలీసులతో పాటు, విదేశాంగ ప్రతినిధులతో, భారతదేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తుంది. అమెరికాలోని భారతీయ సంస్థలన్నిటినీ కలుపుకుంటూ, ఒక కేంద్రీయ సహాయ కేంద్రంగా పనిచేస్తుంది. ఆపద సమయాల్లో సమయం వృధా కాకుడదు, ఎంత త్వరగా మేలుచేస్తే అంతటి ఊరట కలుగుతుంది. అందుకే ఈ సంస్థను ఏర్పాటుచేస్తున్నాము' అని నన్నపనేని ఈ సంస్థ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, సీ ఈ ఓ రాజు చమర్తి, సీఎఫ్ఓ దీనబాబు కొండుభట్ల, రవిప్రకాష్ ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాజ్ భనోత్ (హిందూ టెంపుల్ అండ్ కమ్యునిటీ సెంటర్), నీరజ్ భాటియా (ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్) తో పాటు బే ఏరియాలోని బే ఏరియా తమిళ్మాండ్రమ్, మలయాళీ అసోసియేషన్ మాన్కా, బే మలయాళీ అసోసియేషన్, మైత్రీ , సన్నీవేల్ హిందూ టెంపుల్, స్పెక్ట్రమ్ చర్చ్, శాన్ జోస్ గురుద్వార, బే ఏరియా ఫభసి( బెంగాలీ అసోసియేషన్), ఉప్మా( ఉత్తరప్రదేశ్ అసోసియేషన్), మహారాష్ట్ర మండల్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఒరిస్సా అసోసియేషన్, భువనేశ్వర్ సిస్టిర్ సిటీస్ ఆఫ్ కూపర్టినో, కాశ్మీరీ అసోసియేషన్, ఇండియన్ ముస్లీం అండ్ చారీటీస్ (ఐఎమ్ఆర్సీ), పంజాబ్ షౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, అప్పప, రాణా ( రాజాస్థాన్ అసోసియేషన్) సింధీ అసోసియేషన్, అకాలీ దళ్ (పంజాబీ) సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యి తమ సంఘీభావాన్ని తెలిపారు. టీమ్ ఎయిడ్‌తో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందని, సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతామని, టీమ్ ఎయిడ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి అవసరమైన వారికి సహాయం అందించేందకు సహాకారం చేస్తామని అన్నారు. -
రూ.200 కోట్లతో ‘తానా’ సేవలు
భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: ‘తానా’ ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలకు ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) అధ్యక్షుడు నన్నపనేని మోహన్ చెప్పారు. ఆయన గురువారం భద్రాచలంలోని నన్నపనేని మోహన్ హైస్కూల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పలు సేవాకార్యక్రమాలకు ఏడాది కాలంలో ఏడుకోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రతి ఏటా రెండువేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పది అనాధాశ్రమాల్లో వెయ్యి మందికి నిరంతర సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి నెలా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో క్యాన్సర్ వైద్య శిబిరాలు ఏడింటిని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఒంగోలులో పారిశుధ్య నివారణకుగాను ప్రభుత్వానికి పదిలక్షల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు. తెలుగు వారికి అండగా ఉండేందుకు అమెరికాలో ‘తానా’ అత్యవసర సహాయక బృందం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అమెరికాలోని యూనివర్శిటీల్లో చదువుకునేందుకు వెళ్లి.. అవి మూతపడడం తో మోసపోయిన మూడువేల మంది తెలుగు విద్యార్థులను ఆదుకున్నట్టు చెప్పారు. వారిని ఇతర యూనివర్శిటీల్లో చేర్పించామన్నారు. రానున్న రోజుల్లో తానా సేవాకార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు చెప్పారు. అమెరికాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళలను, యువతను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. మిస్ అమెరికాగా ఎంపికైన మీనా, శివ వేదులూరి, అరుణ మీనన్, స్పెల్‌బీలో ప్రతిభ చూపిన తెలుగు విద్యార్థులు స్నిగ్ద, అరవింద్ మహంకాళిని ప్రత్యేకంగా సన్మానిస్తామన్నారు. జానపద కళలను కాపాడేందుకుగాను ఈ ఏడాది డిశంబర్‌లో భద్రాచలంలో ‘జానపద కళోత్సవం’ నిర్వహిస్తామన్నారు. జన్మదిన వేడుకలు నన్నపనేని మోహన్ గురువారం తన జన్మదిన వేడుకలను స్థానిక ఎస్ఎన్ఎం పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తొలుత, ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా చదవాలన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగువాడైన సత్య నాదెళ్ల నియామకం గర్వకారణమని అన్నారు. ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు. తాను చదువుకున్నప్పుడు పడిన ఇబ్బందులు ఇప్పటి విద్యార్థులకు కలగకూడదని అనుకున్నానని, అందుకే తన స్వార్జితంతో ఈ పాఠశాలను నిర్మించానని అన్నారు. దీనిని అభివృద్ధి చేసుకునే బాధ్యత ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలదేనని అన్నారు.