breaking news
Nallamadugu Surender
-
పోలీసుల లాఠీచార్జి..ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపు
కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి సిద్ధవ్వ(45) అనే మహిళ మృతి చెందారు. దీంతో సిద్ధవ్వ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల ధర్నా, రాస్తారోకో దిగారు. రాస్తారోకో చేస్తున్న వారిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి నల్లమడుగు సురేందర్ గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం(రేపు) కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్‌లో ‘కొత్త’ ముసలం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి టౌన్/గాంధారి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొత్త చిక్కొచ్చిపడింది. పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్టు ఇస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని మండల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్టు నల్లమడుగు సురేందర్‌కు ఖరారైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఎల్లారెడ్డిలో ఏఎంసీ చైర్మన్ కృష్ణాగౌడ్, సొసైటీ చైర్మన్ దామోదర్, గాంధారిలో ఏఎంసీ చైర్మన్, మండల కమిటీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ చైర్మన్ తాన్సింగ్, లింగంపేట్‌లో డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నవారిని పక్కనబెట్టి, చివరి నిమిషం లో టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నల్లమడుగు సురేందర్‌కు టికెట్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను సాకుగా చూపుతూ వేరే పార్టీలోంచి వచ్చిన వ్యక్తికి టికెట్టు ఇవ్వడం భావ్యం కాదన్నారు. షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్‌లు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీపై పలుమార్లు దుమ్మెత్తిపోసిన వ్యక్తికి టికెట్టు ఇచ్చి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. సురేందర్‌కు పార్టీ బీఫాం ఇస్తే ఆరు మండలాల్లోని పార్టీ నాయకులమంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొత్తవారికి కాకుండా ఎవరికి టికెట్టు ఇచ్చినా కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సురేందర్‌కే పార్టీ టికెట్టు ఇస్తే రెబల్ అభ్యర్థిని బరిలో నిలుపుతామని హెచ్చరించారు. సురేందర్ వర్గీయుల్లో ఆందోళన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిపై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నల్లమడుగు సురేందర్ మూడు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై సానుభూతి ఉంది. దీనిని సొమ్ము చేసుకోవాల ని భావించిన కాంగ్రెస్.. ఆయనను పార్టీలో చేర్చుకొంది. ఆయనకే టికెట్టు ఖరారు చేసిం దని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోని నేతల తిరుగుబాటుతో ఎల్లారెడ్డి టికెట్టు ఖరారవనుందన్న ఆనందం సురేందర్ వర్గీయుల్లో లేకుండా పోయింది. మండల స్థాయి నాయకులు, కార్యకర్తల తీరుతో వారిలో ఆందోళన మొదలైంది. సీనియర్లు రెబల్ అభ్యర్థిని నిలిపితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు.