breaking news
Nagari Assembly Constituency
-
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్‌గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్‌గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్‌గా నిరసనలు నిర్వహించారామె. -
ఆర్కే రోజా కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డ్
మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ప్రతి ఏడాది ఒక్కరికి మాత్రమే ప్రతిష్టాత్మకంగా అందించే హెర్మన్ బి వెల్స్ (Herman B Wells) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ (Computer Science)లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అన్షు శాస్త్రవేత్త (Scientist) కావాలనే లక్ష్యంతో చదువుపైనే దృష్టి పెట్టిందని రోజా చెప్పిన విషయం తెలిసిందే. చదువుతో పాటు ఆమె కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, 'ఆర్ట్ ఫర్ ఎ కాజ్' ద్వారా సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.ఇండియానా యూనివర్సిటీ అందించే అవార్డును అన్షు మాలిక అందుకోవడంతో ఆర్కే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'డియర్ అన్షు నీ కఠోర శ్రమ, అంకితభావం, ధైర్యం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. ఒక చిన్న కలగా మొదలైన ప్రయాణం ఇప్పుడు మాకు అపారమైన గర్వకారణంగా, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.' అంటూ పేర్కొన్నారు.1961 నుంచి ఇండియానా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక అత్యుత్తమ విద్యార్థికి ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారం అందిస్తారు. విద్యలో టాపర్‌గా నిలవడంతో పాటు నాయకత్వం, సేవ వంటి నైపుణ్యంలో మేటిగా నిలిచిన వారిని ఈ అవార్డ్‌తో సత్కరిస్తారు. ఈ గౌరవం పొందిన గ్రహీత పేరు ఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది.


