breaking news
nagarathnamma
-
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... హిందూపురం సంజీవరాయనిపల్లికు చెందిన నాగరత్నమ్మ (33) పురిటి నొప్పులతో 12న హిందూపురం ఆస్పత్రిలో చేరింది. గర్భిణి పరిస్థితిని గమనించిన వైద్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆమెను అర్థరాత్రి 12 గంటల సమయంలో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు కాస్త జాప్యం చేయడం పెద్ద సమస్యగా మారింది. ఓ గైనిక్ వైద్యురాలు, అనస్టీషియా వైద్యురాలు 13న రాత్రి సిజేరియన్ చేశారు. ఆపరేషన్ జరిగే సమయంలోనే బాలింతకు ఫిట్స్ వచ్చాయి. అప్పటికే గుండె ఫంక్షనింగ్ తక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. సిజేరియన్ చేయగా బాబు జన్మించాడు. అప్పటికే నాగరత్నమ్మ గుండె ఫెయిలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అనస్తీషియా వైద్యులు బాలింతను ఏఎంసీ (అక్యూట్ మెడికల్ కేర్)కు తరలించి వెంటిలేటర్ ద్వారా శ్వాసనందించారు. ఉదయం 8.30 గంటల సమయంలో బాలింత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త సురేష్‌తో పాటు వారి బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు ప్రయత్నించారనీ.. కాకపోవడంతోనే సిజేరియన్ చేశారని గైనిక్ హెచ్ఓడీ షంషాద్‌బేగం చెప్పారు. నాగరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. -
అన్యోన్య బంధం ఆవిరైంది
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య తమ్ముడి మరణం జీర్ణించుకోలేకే.. తనయుల మృతితో తల్లడిల్లిన తల్లి వారిద్దరూ అన్నదమ్ములు.. వయసు తేడా ఉన్నా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉండేవారు. ఆడుకోవాలన్నా.. అన్నం తినాలన్నా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అనుబంధం వారిది. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు.. ఏది చేసినా తోడుగా ఉండేవారు.. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న అన్నదమ్ముల జీవితాన్ని విధి వెక్కిరించింది. ఉన్నత విద్యలో సరైన ‘మార్గదర్శకులు’ లేక మానసిక వేదనకు గురై నాలుగునెలల క్రితం తమ్ముడు రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. నీడలా ఉండే తమ్ముడు తన వెంట లేకపోవడం శూన్యంలా అనిపించడంతో అన్న కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘దేవుడా కన్నకొడుకులిద్దరినీ కళ్లముందు లేకుండా తీసుకుపోతివా?’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. - పామిడి పి.కొండాపురం రైల్వేగేట్ పెద్దమ్మ గుడి సమీపాన శనివారం రాత్రి బీటెక్ విద్యార్థి ఎన్.రవికుమార్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పామిడిలోని ఎద్దులపల్లిరోడ్డులో నివాసమున్న నల్లబోతుల రామాంజనేయులు, నాగరత్నమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఎన్.రవికుమార్ (19), ఎన్.పవన్‌కుమార్ (16) సంతానం. రామాంజనేయులు బోర్వెల్ పనులకు కూలికెళ్తుంటాడు. భార్య నాగరత్నమ్మ మినీ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త. చిన్నకుమారుడు ఎన్.పవన్‌కుమార్ పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. అయితే పది తర్వాత ఏ కోర్సులో చేరాలన్న విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆటో మొబైల్ కోర్సులో చేరాడు. ఇది సరైనది కాదని అనుకున్నాడో ఏమో గత ఏడాది సెప్టెంబర్ 25న ఎద్దులపల్లిరోడ్డులోని టంగుటూరి చిన్నప్పశ్రేష్టి తోట సమీపాన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎన్.రవికుమార్ అప్పట్లోనే బలవన్మరణానికి యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని వారించారు. ప్రస్తుతం రవికుమార్ గుత్తి గేట్స్కాలేజ్లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి శనివారం సాయంత్రం ఇంటికి చేరాడు. రాత్రి కలిసి భోజనం చేయాలని తల్లిదండ్రులు రవికుమార్‌తో అన్నారు. అంతలోనే బయటకు వెళ్లొస్తానంటూ బయల్దేరాడు. అలా వెళ్లిన అతను రాత్రికి రాత్రే రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.