breaking news
N K Singh
-
మానని గాయం.. అందించండి సాయం
సాక్షి, అమరావతి : విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని.. అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధానిని కోల్పోయామని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, రవి కోటా తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ తదితర అధికారులు ఆయా రంగాలపై సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదీ ప్రభుత్వ పని తీరు పౌష్టికాహార లోపం నివారణపై దృష్టి బియ్యం నాణ్యతను పెంచాం. స్వర్ణ రకం బియ్యాన్ని అందిస్తున్నాం. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాం. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాల్లో అందిస్తాం. బియ్యాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఈ బియ్యంలో ఖనిజ లవణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్యాక్ చేసేచోటే వీటిని బియ్యంలో కలిపేలా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పౌష్టికాహారం లోపం అధికంగా ఉన్న 77 గిరిజన సబ్ ప్లాన్ మండలాల్లో మంచి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం ఇస్తున్న దానికంటే మరో 3 రెట్లు రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిధులు ఖర్చు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో కనీస సదుపాయాలను మెరుగు పరుస్తున్నాం. 9 రకాల సదుపాయాల్ని కల్పిస్తున్నాం. ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు– నేడు కింద వీటిని చేపడుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం.. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారుస్తున్నాం. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి పిల్లల తల్లుల్లో స్ఫూర్తి నింపేలా చర్యలు తీసుకుంటున్నాం. అమ్మ ఒడి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం. దీనివల్ల డ్రాప్ అవుట్ శాతం పూర్తిగా తగ్గుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతి కోర్సు కూడా ఉద్యోగం, ఉపాధి నిచ్చేలా పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నాం. పేద విద్యార్థులు ఎంత వరకు చదువుకుంటే అంత వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. దీనికి తోడు హాస్టల్, వసతి కోసం ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం. పరిపాలనలో సంస్కరణలు గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకు వచ్చాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది. ప్రభుత్వ పాలన అనేది నేరుగా గ్రామాలకు చేరింది. 10 మంది ఉద్యోగులు ఈ సచివాలయాల్లో ఉంటారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశాం. 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.6 లక్షలమంది వలంటీర్లు ఉన్నారు. ప్రతి పథకం ప్రజల గడపకు చేర్చడమే వారి పని. ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకతతో, సంతృప్త స్థాయిలో చేయడానికి వీళ్లంతా తోడ్పడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. అవినీతి లేకుండా, వివక్షకు తావు లేకుండా చేస్తున్నాం. స్కూలుకు టీచర్ వెళ్లకపోతే.. కచ్చితంగా వీళ్లంతా పరిశీలిస్తారు. మహిళా పోలీసులను కూడా పెడుతున్నాం. ఆరోగ్య రంగానికి పెద్ద పీట వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్య శ్రీని అందిస్తున్నాం. సబ్ సెంటర్లు, పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. టీచింగ్ ఆస్పత్రులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. మొత్తంగా రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. (చాలా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు పారా మెడికల్ సిబ్బందిపై ఆధారపడి ఉన్నాయని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ పేర్కొనగా.. దీనిని దృష్టిలో ఉంచుకునే బోధనాసుపత్రుల్లో నర్సింగ్ కాలేజీలను పెడుతున్నామని సీఎం వివరించారు.) ఇళ్ల పట్టాలు, ఇళ్లు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం. ఏటా ఆరు లక్షల చొప్పున ఇళ్లు కడతాం. ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నది లక్ష్యం. గోదావరి – పెన్నా అనుసంధానం రాయలసీమ ప్రాజెక్టులకు వరద జలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరించాల్సి ఉంది. కృష్ణా నదికి వరద వచ్చే ఆ కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టులు నింపాలి. ఇందు కోసం రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మరోవైపు గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కృష్ణా నదిలో శ్రీశైలానికి వచ్చే నీరు.. 47 సంవత్సరాల సగటు చూస్తే దాదాపు 1200 టీఎంసీలు ఉంది. గత 10 సంవత్సరాల సగటు చూస్తే శ్రీశైలంలోకి కృష్ణా నీరు 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో చూస్తే 600 టీఎంసీలు కూడా రావడం లేదు. 400 టీఎంసీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి నీటిని బొల్లాపల్లికి, అక్కడ నుంచి బనకచర్లకు తరలించాల్సి ఉంటుంది. దీనికోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు. అలాగే పోలవరం ఎడమ కాల్వ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.15 వేల కోట్లు అవసరం. విద్యుత్ సంస్కరణలు.. ఇతర పనులు డిస్కంలు రూ.20 వేల కోట్ల రుణ భారంతో ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 18.5 లక్షల పంపు సెట్ల ద్వారా రైతులు ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఏటా విద్యుత్ సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లను ట్రాన్స్‌కోకు చెల్లిస్తోంది. ఈ మేరకు 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుంటే రూ.32 వేల కోట్లకుౖపైగా ఖర్చు అవుతుందని అంచనా. దీనివల్ల ప్రభుత్వంపై సబ్సిడీల భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాం. మరోవైపు భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతున్నాం. తొలిదశలో రూ.11,150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2049 – 50 నాటి డిమాండ్‌కు అనుగుణంగా దశల వారీగా చేపట్టే పనుల కోసం రూ.47,937 కోట్లు ఖర్చు చేయనున్నాం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణ పనుల కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్ అండ్ ఆర్ కోసం రూ.33 వేల కోట్లు అవసరం. నిర్మాణ పనులు ఒక వైపు పూర్తి చేస్తున్న కొద్దీ.. మరోవైపు పునరావాస చర్యలను అంతే వేగంగా చేపట్టాల్సి ఉంటుంది. నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుకు చేరింది. వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు మునిగి పోతున్నాయి. పనులు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ పునరావాస పనులు కూడా చేపట్టాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పునరావాస పనుల కోసం రూ.10 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రూ.6 వేల కోట్లు (మొత్తం రూ.16 వేల కోట్లు) కావాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇదీ రాష్ట్ర పరిస్థితి.. ►రాష్ట్ర విభజన వల్ల పారిశ్రామిక రంగం వాటా 25.2 నుంచి 23.4 శాతానికి, సేవా రంగం వాటా 44.6 నుంచి 43.0 శాతానికి పడిపోయింది. ►తలసరి ఆదాయం కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీకి తక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,05,696 అయితే ఏపీలో రూ.1,64,025 మాత్రమే. రెవెన్యూ షేర్ ఏపీలో 46 శాతం, తెలంగాణలో 54 శాతం. ►షెడ్యూలు 9లో ఉన్న ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. షెడ్యూల్ 10లో 142 ఆస్తులు ఉంటే తెలంగాణకు 107, ఏపీకి 15 మాత్రమే వచ్చాయి. ఇంకా 20 ఆస్తులు తెలంగాణ, ఆంధ్ర చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయి. ఏపీ భవన్ విభజన కూడా ఇంకా జరగలేదు. ►ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోయాయి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 15 – 29 ఏళ్ల వయసున్న వారిలో నిరుద్యోగ శాతం ఏపీలో 22.8 శాతం ఉంటే.. దేశం మొత్తం మీద ఇది 20.6 శాతం మాత్రమే. ►తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.5,127 కోట్లు, దీనిపై వడ్డీ రూ. 604.7 కోట్లు ఇంకా రాలేదు. ►మొత్తంమీద రాష్ట్రం ఆర్థిక అసమతుల్యతను ఎదుర్కొంటోంది. మిగులు నిధుల నుంచి లోటు ఎదుర్కొనే పరిస్థితిలోకి వచ్చాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫార్సు చేయాలి. భౌగోళికంగా రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాలు నిరంతరం కరువుతో అల్లాడుతున్నాయి. కోస్తా ప్రాంతంలో 8 జిల్లాలపై తుపాన్లు తరచుగా దండెత్తుతున్నాయి. ►పట్టణీకరణ దేశ సగటుతో పోలిస్తే తక్కువ. దేశంలో పట్టణ జనాభా సగటున 31.16 శాతం అయితే ఏపీలో 29.6 శాతం మాత్రమే. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ, జీఎస్డీపీలో 34 శాతం. రాష్ట్రంలో 31.9 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ►రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.18,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.3,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాల్లో చాలా ప్రాంతాలకు సాగు, రక్షిత తాగు నీరు లేదు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవు. వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. ►విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాల్సి ఉంది. 2018 కల్లా ఫేజ్–1 పూర్తి చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీనికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి. రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించాం. తగిన సహాయం కోసం సిఫార్సు చేయాలి. ►ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు, ట్యాక్స్ మినహాయింపులు కూడా చట్టంలో పెట్టారు. వాటిని వెంటనే అమలు చేసేలా చూడాలి. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటును ప్రకటించాలి. ►విభజన హామీల అమలు కోసం కేంద్రంలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు సిఫార్సు చేయాలి. 2013 – 14 లో రాష్ట్రం అప్పు రూ.1,23,586 కోట్లు. 2018–19లో రాష్ట్రం అప్పు రూ.2,60,330 కోట్లు. జీఎస్డీపీలో రెవిన్యూ లోటు శాతం 2013 –14లో 2.4 శాతం, ఇప్పుడు 3.6 శాతం. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి 2013–14లో 22.2 శాతం కాగా, ఇప్పుడు 28.2 శాతం ఉంది. -
15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్.. ఎన్కే సింగ్
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్కే సింగ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్ కమిషన్ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు, కేంద్ర, రాష్ట్రాల్లో ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలను కమిషన్ పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. అక్టోబర్ 2019 నాటికి కమిషన్ తన నివేదికను సమర్పిస్తుంది. మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరి, నీతీ ఆయోగ్ సభ్యులు రమేష్ చాంద్, జార్జిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనూప్ సింగ్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 2020 ఏప్రిల్ 1 నుంచీ ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలంపై దృష్టి సారిస్తుంది. 14వ ఫైనాన్స్ కమిషన్ 2013 జనవరి 2న ఏర్పాటయ్యింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31వ తేదీ వరకూ సంబంధించిన కాలానికి ఈ కమిషన్ సిఫారసులు చేసింది. -
ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందకిషోర్ సింగ్ (75) జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 'ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్' అవార్డు కు ఆయనను ఎంపిక చేసింది. బ్యూరోక్రాట్ టర్న్డ్ పొలిటీషియన్ ఎన్ కే సింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండో-జపాన్ ఆర్థిక సంబంధాల కోసం చేసిన కృషికి గాను ఆయనను ఈ జాతీయ అవార్డుతో సత్కరించనుంది. ప్రజపాన్ ప్రధాని అబే ఎన్ కే సింగ్ కు వ్యక్తిగత ఆహ్వానం పంపించారు. ఈ మే 10 న టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగే ఒక కార్యక్రమంలో, జపాన్ రాజు అకిహితో సమక్షంలో జపాన్ ప్రధానమంత్రి షింజే అబే చేతులు మీదుగా ఈ అవార్డును సింగ్ అందుకోనున్నారు. మనదేశ ప్రధాని నరేంద్ , మోదీ జపాన్ ప్రధాని అబే నేతృత్వంలో ఇండో - జపాన్ సంబంధాల్లోచారిత్రక మార్పుల్లో భాగంగా తనకు ఈ అవార్డు దక్కిందని సింగ్ వ్యాఖ్యానించారు. 21 వ శతాబ్దం ఆసియా పునరుజ్జీవనం ఇరుదేశాల లోతైన సంబంధాలపై ప్రధారంగా ఆధారపడి ఉందన్నారు. అత్యున్నత ప్రభుత్వ పదవులను నిర్వహాంచిన సింగ్ మంచి ఆర్థిక వేత్త. ఈ క్రమంలో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగా తన సేవలందించారు. మారుతి సుజుకి సహా జపనీస్ ఆటోమొబైల్ కంపెనీల పెట్టుబడుల నిర్ణయం కాలంలో జపాన్ లో పనిచేశారు.1875 జపాన్ రాజు మియాసి ప్రవేశపెట్టిన ఈ సత్కారాన్ని1981 జపానేతరులకు అందిస్తున్నారు. కాగా బీహార్ నుంచి జేడీయూ ఎంపీగా రాజ్యసభకు ఎంపికైన ఆయన 2014 లోబీజేపీలో చేరారు. గతంలో భారత్ - జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంల్లో కృషికి గుర్తింపుగా భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ జపాన్ ప్రభుత్వం సత్కరించింది.