breaking news
Myanmar Military Plane
-
మయన్మార్‌లో విమానం గల్లంతు
సముద్రంలో శకలాలు గుర్తించినట్లు ప్రకటించిన సైన్యం యాంగాన్: సుమారు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై–8ఎఫ్–200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయినప్పటి నుంచి నేవీ ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాలింపు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరు వైద్య పరీక్షలకు, మరికొందరు పాఠశాలలకు బయల్దేరినట్లు భావిస్తున్నారు. దావేయ్ పట్టణానికి 218 కి.మీ దూరంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిలిటరీ అన్వేషణ కొనసాగిస్తోందని చెప్పారు. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానం మయన్మార్ దక్షిణ తీరంలో ఉండగా సంబంధాలు తెగిపోయాయని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో ప్రస్తుతం వర్షాకాలం. అయితే విమానం గల్లంతైనపుడు వాతావరణం బాగానే ఉంది. -
గగనతలంలో విమానం అదృశ్యం
నెపైడా: 116 మందితో వెళుతున్న మయన్మార్ సైనిక విమానం గగనతలంలో అదృశ్యమైంది. దక్షిణాది నగరం మైయిక్, యాంగాన్ మధ్య బుధవారం కనిపించకుండాపోయిందని ఆర్మీ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా విమానంతో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. విమానంలో 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. సాంకేతిక లోపమే విమానం అదృశ్యానికి కారణమని, వాతావరణం బాగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యమైనప్పుడు అండమాన్ సముద్రంపై ప్రయాణించింది. దీంతో అండమాన్ సముద్రంలో గాలింపు చేపట్టారు. ఓడలు, విమానాలను రంగంలోకి దింపారు.