breaking news
munnabhai
-
నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి
మంత్రి డాక్టర్ సి.ల క్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్ : ‘నేను మున్నాభాయ్ అవునో కాదో తేల్చాలి. నాపై వచ్చిన ఆరోపణలు రుజువైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా. నాపై విమర్శలు చేసిన వారు సవాలు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. తన విద్యార్హతలపై ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనంపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలోని పార్టీ శాసన సభాపక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన విద్యార్హతలపై ప్రజలకు అపోహ కలిగేలా ఆరోపణలు చేసిన నేతతో పాటు, సదరు పత్రికపై న్యాయపరమైన చర్యలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. తన విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను మీడియా సమావేశంలో చూపుతూ, తను చదివిన విద్యాలయంలో విచారణ జరుపుకోవచ్చన్నారు. -
ఎవరో ఒకరు ఎపుడో అపుడు..
సమాజ సేవలో ఆటో డ్రైవర్ ♦ క్యాన్సర్ బాధితులకు తనవంతు చేయూత ♦ సంపాదనలో సింహభాగం సేవకే.. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు’ అన్నాడో సినీ గీత రచయిత. తన తల్లికి జరిగినది ఇంకెవరికీ జరగకూడదని అడుగు ముందుకేశాడో అతి సామాన్య ఆటో డ్రైవర్. ‘సమాజం నాకేమిచ్చింది’ అని ప్రశ్నించే జనాలు ఉన్న నేటి ప్రపంచంలో తనకు సాయం చేయని అదే సమాజం కోసం పాటుపడుతున్నాడు మన మనసున్న మున్నాభాయ్ ఎస్ఎస్సీ అలియాస్ సందీప్ బచ్చే. ముంబై : ‘సమస్య వచ్చిందా అయితే మున్నాభాయ్ ఎస్ఎస్సీని కలవండి’ ఇదీ ముంబై నెటిజన్లు మన మున్నాభాయ్ ఎస్ఎస్సీ అలియాస్ సందీప్ బచ్చే గురించి చెప్పే మొదటి మాట. ముంబైలో ఓ సాదా సీదా ఆటోడ్రైవర్ సందీప్. 1995లో టెన్త్ పూర్తి చేశా డు. తర్వాత పొట్టకూటి కోసం ఓ ట్రావెల్ ఏజెన్సీలో ప్యూన్‌గా చేరినా కొన్నాళ్లకు మానేశాడు. అయితే అక్కడ పనిచేసే సమయంలో బస్‌లో ఉన్న సౌకర్యా లు నచ్చాయి సందీప్‌కి. దీంతో ఆటో కొంటే ఆ సౌకర్యాలన్నీ అందులో పెట్టాలనుకున్నాడు. ఉద్యోగం మానేశాక వచ్చిన పీఎఫ్ డబ్బులతో ఓ ఆటో కొన్నా డు. ఇప్పుడు అదే ‘టాక్ ఆఫ్ ది ముంబై’ అయ్యింది. సకల సౌకర్యాలు.. ‘అతిథి దేవో భవ’ అన్న మాటను నిజం చేస్తున్నాడు మున్నాభాయ్. ఆటో ఎక్కిన ప్రయాణికులకు చదువుకోవడానికి పేపర్లు, తాగడానికి మంచినీళ్లు, అడిగితే ఫ్లాస్క్ తీసి ఛాయ్ కూడా ఇస్తాడు. టైం పాస్ కోసం ఎల్సీడీ టీవీ ఆన్ చేస్తాడు. అంతేనా... అవసరమైతే లోకల్, ఎస్టీడీ చేసుకునేందుకు టెలిఫోన్, వైఫై ఉం టుంది. అత్యవసర నంబర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉం టుంది. రోడ్డుపై ఎవరికైనా గాయాలైతే వెంటనే డ్రైవ ర్ నుంచి డాక్టర్ అవతారం ఎత్తుతాడు. ప్రాథమిక చికిత్స చేసి వాళ్లను జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాడు. మానవ సేవే.. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని క్యాన్సర్ బాధితులకు ఇస్తూ ఉంటాడు. ఇంటింటికీ తిరిగి దుస్తులు, డబ్బులు సేకరిస్తాడు. అవసరం అని వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు. ప్రతి ఆదివారం కొంతమంది క్యాన్సర్ బాధితులకు ఉదయం అల్పాహారం అందజేస్తుంటాడు. వికలాంగులు, గర్భిణిలు, వృద్ధులకు చార్జీలో కొంతమేర రాయితీ ఇస్తాడు. క్యాన్సర్ బాధితులకు సాయం చేయండంటూ ఆటో వెనకాల డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వాళ్లకు విషయం చెప్పి సాయం చేయమని అడుగుతాడు. డొనేషన్ చేసిన వాళ్లు ఒక మిఠాయి కూడా ఇస్తాడు. ఆపద్బాంధవుడు.. క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారిని గుర్తించి స్థానిక బాంద్రా, టాటా మెమోరియల్ ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. ఆ మధ్య ఒక మహిళకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఒక స్వచ్ఛంద సంస్థ ఆపరేషన్ చేసేం దుకు ముందుకు వచ్చింది. అయితే అంతకు ముందు చేయాల్సిన చెకప్‌ల కోసం రూ. 35 వేలు అవసరమయ్యింది. ఆమె భర్త ఎంతమందిని అడిగినా డబ్బు మాత్రం అందలేదు. వెంటనే విషయం తెలుసుకున్న సందీప్, ఆ మొత్తాన్ని సమకూర్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే ‘ఏ సమస్య వచ్చినా మున్నాభాయ్ ఎస్ఎస్సీని కలవండి. అతను సంజయ్ దత్ ఫ్యాన్. సంజయ్ సినిమాల్లో సేవ చేస్తే ఈ అభినవ మున్నాభాయ్ నిజ జీవితంలో చేస్తున్నాడు’ అంటూ సందీప్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు నెటిజన్లు. ఓ అతి సామాన్య ఆటో డైవర్‌గా జీవనం గడుపుతూ ఆపదలో ఉన్న వారికి నిస్వార్థ సేవ చేస్తున్న సందీప్ కాదు కాదు... మున్నాభాయ్ ఎస్ఎస్సీని ఏమని కీర్తిద్దాం. సలాం సందీప్ భాయ్. మా అమ్మలా ఎవరికీ జరగొద్దు.. ‘మా అమ్మ గొంతు క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చూపించడానికి చాలా మందిని డబ్బు అడిగాను. ఆటో డ్రైవర్‌వి అంటూ అందరూ ఛీదరించుకున్నారు. హీరో సంజయ్ దత్ కొంత సాయం చేశాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను. అమ్మకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదని. అప్పటి నుంచి ఈ మార్గంలో నడుస్తున్నా’ అంటాడు సందీప్. ఈయన సేవలు గుర్తించిన ముంబై నగరం అతన్ని అవార్డులతో సత్కరించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 8 అవార్డులు గెలుచుకున్నాడు. సంజయ్ దత్‌పై ఉన్న అభిమానంతో చేతిపై మున్నాభాయ్ ఎస్ఎస్సీ అని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. -
మలుపులు తిరుగుతున్న మున్నా కేసు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నరహంతకుడు మున్నాభాయ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో ఇద్దరు రాజకీయ నాయకులు, నలుగురు ప్రభుత్వాధికారులకు సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపించిన మున్నాభాయ్ అనేక మందిని వలలో వేసుకున్నాడు. డబ్బుకు ఆశపడి మున్నాకు సహకరించిన వారిలో అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అత్యంత గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి వివరాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ కేసుతో సంబంధం ఉన్న నె ల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్‌ను అరెస్ట్ చేసి వారంరోజుల తర్వాతగానీ వెల్లడించలేదు. డీఎంహెచ్‌వోతో పాటు మరో నలుగురు ప్రభుత్వ అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులకు మున్నాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. వారిలో ఇద్దరు అధికారులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు అధికారులు, ఇద్దరు రాజకీయ నాయకులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. అయితే వారి పేర్లు ఏమాత్రం బయటకు రాకుండా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి చెన్నై పోలీసులు... మున్నా కేసు విచారణకు చెన్నై నుంచి ‘క్యూ’ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. వీరు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి మున్నాభాయ్ బెంగళూరులో గడిపినట్లు సమాచారం. ఆ సమయంలో నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్, ఇతర అధికారులు అనేకసార్లు బెంగళూరు వెళ్లి మున్నా బృందంతో కలిసి విలాసాలతో ఆనందంగా గడిపినట్లు తెలిసింది. అక్కడ మున్నాతో పాటు ఐఎస్ఐ వర్గాలకు కూడా నెల్లూరు డీఎంహెచ్‌వో సుధాకర్ మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. మున్నాకు డబ్బు చేరకపోతే సుధాకరే పలువురితో మాట్లాడి సెటిల్ చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. మున్నా బ్యాంకు ఖాతాతో ఎక్కువ లావాదేవీలు నడిపిన వారిలో సుధాకర్ ఒకడిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సుధాకర్‌ను పూర్తిస్థాయిలో విచారించిన పోలీసులు.. అతని ద్వారా అనేక విషయాలు తెలుసుకుని మిగిలిన వారిపై కూడా దృష్టి సారించారు. సుధాకర్ గతంలో చిత్తూరు జిల్లాలో కూడా పనిచేసినందున అక్కడి వారితో కూడా ఈ కేసుతో సంబంధాలుండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, బెంగళూరు పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాల పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో మున్నాభాయ్ కేసు ఇంకా అనేక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.