breaking news
multilingual film
-
ఇఫీలో మా కాళి
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్ సావంత్, ఆనంద బోస్గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్. -
సౌత్ ఇండియాలో క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇవే
తెలుగు అనగానే గుర్తొచ్చేది ఆవకాయ్... తమిళ్ అంటే సాంబార్... మలయాళంకి కూడా సాంబార్ టచ్ ఉంది. ఇప్పుడు ఆవకాయ్ డైరెక్షన్‌కి సాంబార్ సై అనడంతో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అదేనండీ.. మన తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్లో తమిళ, మలయాళ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇటు తెలుగు అటు తమిళ, మలయాళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక తెలుగు డైరెక్టర్లు – పరభాషా హీరోల కాంబో గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల, ధనుష్... డీ 51 వాణిజ్య అంశాల కంటే కథకి, సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక సినిమా తర్వాత మరో సినిమా వెంట వెంటనే చేసేయాలని కాకుండా కొంచెం ఆలస్యమైనా మంచి సినిమాలు తీస్తుంటారు శేఖర్ కమ్ముల. ‘ఫిదా, లవ్‌స్టోరీ’ వంటి వరుస హిట్లు అందుకున్న ఆయన తన తర్వాతి చిత్రాన్ని తమిళ హీరో ధనుష్‌తో చేస్తున్నారు. ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెలుగు–తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించనున్నారట శేఖర్. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. కాగా ధనుష్ చేసిన తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ చేస్తున్నది సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. చందు, సూర్య కాంబో కుదిరిందా? ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘ఎన్సీ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చందు. ఇప్పటివరకూ తెలుగు హీరోలతోనే సినిమాలు తీసిన ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగు తోంది. సూర్య– చందు కాంబినేషన్ దాదాపు కుదిరిందని టాక్. సరైన కథ కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ చెప్పుకొస్తున్న సూర్య.. చందు మొండేటి చెప్పిన కథ తెలుగు ఎంట్రీకి కరెక్ట్ అని భావించారట. మైథాలజీ నేపథ్యంలో సోషియో–ఫ్యాంటసీ జానర్లో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. పరశురామ్‌తో కార్తీ? ‘గీత గోవిందం, సర్కారు వారి పాట’ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ–డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తమిళ హీరో కార్తీతో పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య చెన్నై వెళ్లి కార్తీకి కథ వినిపించారట ఆయన. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ సరైన స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్న కార్తీకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్. ఈ సినిమాకు ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారట పరశురామ్. అటు కార్తీ, ఇటు పరశురామ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తయ్యాకే వీరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీతో దుల్కర్ లక్కీ భాస్కర్ తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’(తమిళంలో వాత్తి) సినిమాని తెరకెక్కించి, సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన తాజా చిత్రాన్ని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో తీస్తున్నారు వెంకీ అట్లూరి. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో వెంకీ అట్లూరితో ‘సార్’ నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ నిర్మిస్తున్నారు. ‘సార్’ సినిమాతో విద్యా వ్యవస్థ నేపథ్యంలో సమాజానికి చక్కని సందేశం ఇచ్చిన వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ద్వారా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట. ఒక సామాన్యుడు తనకు అడ్డొచ్చిన అసమానతలను దాటుకుని ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ‘మహా నటి’, ‘సీతా రామం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’. -
మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా
బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా మారిన ప్రభాస్ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గత చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుండగా, త్వరలో సెట్స్ మీదకు వెళ్లే సినిమాలను ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తొలి భాగం లానే ఈ సీక్వల్‌ను కూడా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి తరువాత రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా భారీగా మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్తోనే కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించగలిగితే, ప్రభాస్ మార్కెట్‌కు తిరుగుండదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.