అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.