breaking news
More Rainfall
-
పరామర్శించడానికా.. ఎంజాయ్ చేయడానికా!..
సాక్షి, ముంబై: వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి గిరీష్ మహాజన్ సెల్ఫీ వీడియోల వ్యవహారం వివాదాస్పదమైంది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలో అధిక భాగం ముంపుకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం బాధితులను పరామర్శించటానికి మంత్రి అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన రెండు వీడియోలు బయటకొచ్చాయి. ఒక దానిలో ఆయన నవ్వుతూ, చేతులూపుతుండగా, మరో వీడియోలో రోడ్డు మీద నిలబడి ముంపు ప్రాంతాలను చూస్తున్నట్టు ఉంది. దీంతో నువ్వు బాధితులను పరామర్శించడానికి వెళ్లావా? లేక టూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అంటూ ప్రతిపక్ష ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండే మండిపడ్డారు. అంతేకాక, ఇలాంటి చర్యకు పాల్పడిన మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించి, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన డిమాండ్ చేశారు. కాగా, పశ్చిమ మహారాష్ట్రలో ఉన్న ఈ రెండు జిల్లాల్లో వరదల వల్ల ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం
వాషింగ్టన్: తమిళనాడు రాజధాని చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలను.. చెన్నైవాసులు గతంలో ఎప్పుడూ చూసిఉండకపోవచ్చు. గత వందేళ్లలో చెన్నైలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురవలేదు. 1901 తర్వాత ఈ నెల 1-2 తేదీల మధ్య 24 గంటల్లో చెన్నైలో అతిభారీ వర్షం పడినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలియజేసింది. అంటే గత 114 ఏళ్లలో చెన్నైలో ఇదే అతి భారీ వర్షం. ఈ నెల 1-2 తేదీల మధ్య ఆగ్నేయ భారత్‌లో కురిసిన వర్షపాతంపై మంగళవారం నాసా యానిమేషన్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఉపగ్రహం సాయంతో చెన్నైలో వర్షపాతాన్ని అంచనా వేసింది. ఇటీవలి భారీ వర్షాలకు చెన్నైలో ఓ ప్రాంతంలో 50 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు నాసా వెల్లడించింది. రుతుపవనాల వల్ల ఈ సీజన్లో డిసెంబర్‌కు ముందే తమిళనాడులో సాధారణ శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం వల్ల భారత్ తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రతి ఏటా 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. చెన్నైలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 250 మంది మరణించిన సంగతి తెలిసిందే. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయం కావడంతో బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు దొరకక చెన్నై వాసులు అలమటించారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గాక సహాయక చర్యలను వేగవంతం చేయడంతో చెన్నై వాసులు కోలుకుంటున్నారు.