breaking news
MLA Bandaru Madhav Naidu
-
మొగల్తూరులో టీడీపీ నాయకులకు షాక్
నరసాపురం: నరసాపురం : మొగల్తూరులో టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనుచరులకు షాక్ తగిలింది. పేరుపాలెం సొసైటీలో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. మండలంలో ముఖ్య టీడీపీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తోన్న సొసైటీలో రూ.50 లక్షల వరకూ అవినీతి జరిగిందని సహకార శాఖ చేపట్టిన విచారణలో తేటతెల్లమైంది. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి సొసైటీకి ముగ్గురు సభ్యులతో కూడిన మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. అయితే విచారణ ఇంకా సవ్యంగా సాగలేదని, మరికొందరు ముఖ్యులను తప్పించే ప్రయత్నం సాగుతోందని, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన రైతులు, సొసైటీ మాజీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బరితెగింపు , పేరుపాలెం సొసైటీలో రూ.1 కోటి దాటిన అవినీతి పేరుతో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఈ అవినీతి వ్యవహారంపై కదలిక వచ్చింది. సంఘంలో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరుగుతోందని 51 విచారణ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.ధర్మరాజు తరువాత ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. విచారణలో భాగంగా 509 మందికి అప్పు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. విచారణలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని తేల్చారు. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా నరసాపురం డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.రామదాసును, మొగల్తూరు డీసీసీబీ మేనేజర్, సూపరింటెండెంట్లను సభ్యులుగాను నియమించారు. టీడీపీ నేతలకు చెంపపెట్టు సొసైటీలో అవినీతి వ్యవహారం అధికారికంగా బయటపడటంతో మండల టీడీపీ నేతలకు చెంపపెట్టుగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు సత్యనారాయణ పాలకవర్గం రద్దయ్యింది. అలాగే ఈ వ్యవహారంలో మొదటి నుంచి వినిపిస్తున్న మరోపేరు సత్తినేని త్రినాథరావు. ఈయన మండలంలో టీడీపీకి కీలకనేత. సొసైటీ అవినీతి వ్యవహారం బయటకు రాకుండా అనేక విధాలుగా ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వీరందరికీ షాక్ తగిలినట్టయ్యింది. సొసైటీలో సభ్యులందరూ పేద రైతులు, పైగా నిరక్షరాస్యులు ఎక్కువ. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే వ్యవహారానికి ఒడిగట్టారు పేరుపాలెం సొసైటీ ప్రతినిధులు. సదరు సొసైటీ వ్యవహారాల్లో అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చి పోయారు. సొసైటీ ద్వారా రూ.10 వేలు అప్పు ఇచ్చి తమ ఇస్టానుసారం రూ.25 వేలు, రూ.50 వేలు ఇచ్చినట్టుగా రాసేసుకున్నారు. అప్పుదారులకు కనీసం రుణమాఫీ సొమ్ము కూడా దక్కకుండా చాలాకాలంగా చీకటి తతంగాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. చివరకు చనిపోయిన వారి పేరు మీద కూడా అప్పులు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించారు. మీ పేరులతో వేలల్లో బకాయిలున్నాయి, అప్పులు కట్టండంటూ సొసైటీల నుంచి నోటీసులు రావడంతో రైతులు నోరెళ్లబెట్టారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేసినా మొదట ప్రయోజనం లేకపోయింది. 51 విచారణ వేసినా ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని చీకటిలోకి నెట్టేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ‘సాక్షి’ ద్వారా విషయం బహిర్గతం కావడం, రైతుల ఆందోళన పెద్దదవ్వడంతో సహకారశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. చివరకు రూ.50 లక్షలు అవినీతి జరిగిందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. ఇంకా ఈ వ్యవహారంలో సొసైటీ కార్యదర్శి అందే రవికిషోర్ పాత్రపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మరి చివరకు మునుముందు ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, టీడీపీ నేతల తదుపరి ప్రయత్నాలు ఎలా ఉంటాయనే దానిపై సొసైటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
ఏరువాకకు శ్రీకారం
చిట్టవరంలో సీఎం పర్యటన నరసాపురం రూరల్: పౌర్ణమి ఏరువాక కార్యక్రమానికి నరసాపురం మండలం చిట్టవరంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. నిర్ణీత సమాయానికంటే సుమారు రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్న సీఎం సభా ప్రాంగణం వద్ద ఎడ్లబండి ఎక్కి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో కలసి ఏరువాక కార్యక్రమం నిర్వహించే ఎంవీ రావు పంట భూమికి చేరుకున్నారు. భూమి పూజ చేసి నాగలితో అరక దున్ని సాగును ప్రారంభించారు. నారుమడుల్లో వరియంత్రం ద్వారా నాట్లు వేశారు. సంచార భూసార పరీక్షల వాహనాన్ని ప్రారంభించారు. ఎంటీయూ 1061 విత్తనాలను పంట భూమిలో వెదజల్లారు. ముందుగా సభా ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, అటవీ, మత్స్య, విద్యుత్, డీఆర్డీఏ అధికారులు ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలించారు. ఉత్తమ రైతులుగా ఎంపికైన కూనపరెడ్డి నారాయణరావు (నరసాపురం మండలం, ఎల్బీ చర్ల), భూపతిరాజు రామకృష్ణంరాజు (నాచుగుంట)ను సీఎం సత్కరించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి లెసైన్స్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సీఎం ప్రారంభించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం నరసాపురం: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ అన్నారు. ఏరువాక సభలో తక్కువ విద్యుత్‌తో తిరిగే ఫైవ్‌స్టార్ ఫ్యాన్ల పంపిణీని తూర్పుప్రాంత విద్యుత్ సంస్థ చేపట్టింది. సీఎం ఫ్యాన్ల పంపిణీని ప్రారంభించారు. విద్యుత్ ఆదా, అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా విషయంలో పశ్చిమగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని భవానీ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర గనులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రైతుల్లో భరోసా కల్పించడానికే సీఎం ఏరువాక కార్యక్రమం చేపట్టారని అన్నారు. దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడారు. నరసాపురం ఎమ్మె ల్యే బండారు మాధవనాయుడు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామంటూ సీఎం హామీలు ఇచ్చారు. వశిష్ట వంతెన, కాళీపట్నం భూములు, నల్లీక్రీక్ తవ్వకం, మోడీ వంతెన పనులపై స్పందించారు. ఎంవీ రావుకు నివాళి నరసాపురం ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎంవీ రావు చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగులోకి అనువదించిన విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.