ఆగ్రహం–అడ్డగింత
అన్నదాతకు ఆగ్రహం వచ్చింది. నేతలు చెబుతున్నదొకటి...చేస్తున్నదొకటన్న విషయం తేటతెల్లం కావడంతో అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని భావించి అడ్డుకున్నారు. జిల్లా ఉన్నతాధికారికే సమాచారం ఇచ్చారు. స్పందించిన రెవెన్యూ అధికారులు వచ్చి ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదంతా ఒక ఎత్తయితే తరలింపు సమయంలో సంబంధిత వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ పేరిట ఉన్న లేఖను చూపడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే...
నందిగాం : ఒడిశా రాష్ట్రం నుంచి ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో నందిగాం గ్రామానికి చెందిన పలువురు రైతులు ధాన్యం బస్తాల లారీలను శుక్రవారం వేకువజామున అడ్డుకున్నారు. ఏపీ 30వీ 0889, ఏపీ 31 డబ్ల్యూ 8199, ఏపీ 35టీ 1767, ఏపీ 16టీసీ 8388 నంబర్లు గల మూడు లారీలు, ఒక వ్యాన్‌ను పెంటూరులో ఉన్న వెంకటేశ్వర, మహాలక్ష్మి, వినాయక రైస్ మిల్లులకు తరలిస్తుండగా రైతులు అడ్డుకొని కలెక్టర్ లక్ష్మీనరసింహంకు ఫోన్లో సమాచారం అందజేశారు. స్పందించిన కలెక్టర్ లారీలను నిలుపుదల చేయాలని బదులివ్వడంతో రైతులు లారీలను గ్రామం మధ్యలో నిలిపివేశారు. గత ఏడాది మండలంలో పండిన ధాన్యాన్ని కొనడానికి ఇష్టపడకుండా వేరే మండలాల వైపు మిల్లర్లు చూస్తూ ఇక్కడ రైతాంగాన్ని ముంచుతున్నారనే భావన రైతుల్లో నెలకొన్న సమయంలో ఈ ఏడాది కూడా మిల్లర్లు ఒడిశా నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నారనే ఉద్దేశంతో రైతులు వీటిని అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లారీల ద్వారా ఒడిశా నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి కంచిలి మండలంలోని బురదపాడు, బోగాబంది, బెల్లుపొడ గ్రామానికి చెందిన కొంత మంది రైతులు పేరిట మూడు లారీలలో 385 బస్తాలు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ మూడు లారీల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నందిగాంలో ఉన్న ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నట్టు ఉంది. కానీ వీరు కేంద్రాలకు కాకుండా మిల్లర్లకు తరలిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బురదపాడుకు చెందిన రైతుకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌కు రికమెండ్ చేస్తూ రాసిన లెటర్‌ను వారు చూపడంతో రైతులు విస్తుపోయారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడుకు చెందిన పలువురు రైతుల ధాన్యాన్ని టెక్కలి మండలం బూరగాంకు చెందిన జనపాన రమేష్ దళారీగా వ్యవహరిస్తూ 280 బస్తాల కామన్ రకాలను తరలిస్తున్నారు. వీరు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించవలసి ఉన్నప్పటికీ కేంద్రాలకు కాకుండా మిల్లులకు తరలించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా నందిగాం మండలంలోని మిల్లులకు తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నాలుగు వాహనాలకు వే బిల్ కూడా లేకుండా తరలిస్తుండటం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దారు డి.రామ్మోహనరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ గణపతి, పౌరసరఫరాల డీటీ ఎమ్.సతీష్, ఆర్ఐ పి.కామేశ్వరరావు తదితరులతో చేరుకొని రైతులను శాంతింపజేసి లారీలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ తరలింపు వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా విజెలెన్స్ డీటీ, పౌర సరఫరాల డీటీ, ఆర్ఐలకు అదేశించారు. అయితే వ్యవహారం పెద్దది కావడంతో కంచిలి మండలానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ ధాన్యాన్ని తామే విక్రయించినట్టు అధికారులకు తెలియజేసి వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు సాగించడం కొసమెరుపు.