breaking news
m.kodandaram
-
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్తదా?
► రైతు అనిపించుకోవడమే అవమానంగా మారింది ► రైతు దీక్షలో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ► సంఘీభావం తెలిపిన పలు సంఘాలు, మేధావులు సాక్షి, హైదరాబాద్: రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడ్తదా అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ప్రశ్నించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ‘రైతు దీక్ష’ను ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అవమానం జరుగుతున్నదని, రైతు అనిపించుకోవడమే అవమానంగా మారిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతీ రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, సగటున ఒక్కో రైతుపై రూ.93 వేల అప్పు భారం ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి దీనంగా ఉందని, వారి సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పడానికే దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. రుణమాఫీ చేయడం లేదని, బ్యాంకులు కొత్తగా రుణాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతును కుంగదీస్తున్నాయని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమే వ్యవసాయమని, 60 శాతం మంది దానిపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం తేవాలి.. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, విత్తన చట్టం, రైతులకు ఆదాయ భద్రత చట్టం తేవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వానికి, రైతులకు మధ్య సమన్వయానికి అది ఉపయోగపడుతుందన్నారు. విచ్చలవిడిగా భూసేకరణ జరపాలని, అయితే రైతుకు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు ఇస్తేనే కంపెనీలు వస్తాయని చెప్పడం అవివేకమని దుయ్యబట్టారు. వ్యవసాయ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కోదండరామ్ విమర్శించారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే దీక్షకు దిగాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయం ఏమీలేదని స్పష్టం చేశారు. మొన్నటి సర్వేతో ఓట్లు పడతాయో లేదో తెలియదు కానీ.. వ్యవసాయం విధానం తెస్తే రైతుల ఓట్లు కచ్చితంగా పడతాయని చెప్పారు. తుగ్లక్ పాలన: జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, సీఎం కె.చంద్రశేఖర్రావుది తుగ్లక్ పాలన అని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల సానుభూతి లేదని విమర్శించారు. నకిలీ విత్తన కంపెనీలకు, దళారులకు ప్రభుత్వమే ఏజెంటుగా పని చేస్తున్నదని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, సంఘటిత పోరాటాలు లేకపోవడం వల్లే రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, రైతాంగం విచ్ఛిన్నం అవుతున్నదన్నారు. కొత్త అభివృద్ధి నమూనాను రైతాంగ పోరాటాలు ప్రశ్నించేలా ఉండాలన్నారు. రైతులు ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. రైతులు నిజాయితీపరులు కావడం వల్లే కేవలం రూ.10 వేల అప్పునకు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగాలకు పాల్పడిన వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. భూములను అమ్మేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారని, ఇది కేసీఆర్కు మంచిది కాదని హెచ్చరించారు. దీక్షకు మాజీ మంత్రి పురుషోత్తమరావు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ పి.జనార్దన్ రెడ్డి, మహిళా నేతలు సంధ్య, పశ్యపద్మ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నర్సింహా రెడ్డి, గుమ్మడి నర్సయ్య, రైతు సంఘం నాయకులు అంజి రెడ్డి, జేఏసీ ముఖ్య నేతలు పిట్టల రవీందర్, జి.వెంకట రెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, పి.రఘు, ఎన్.ప్రహ్లాద్, బీజేపీ నేత ఎన్.వేణుగోపాల్ రెడ్డి, టీవీవీ అధ్యక్షుడు గురజాల రవీందర్ రావు, టీడీపీ ప్రతినిధి డి.పి.రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్ రెడ్డి, రమా మెల్కోటె, వివిధ సంఘాల ప్రతినిధులు, నేతలు, మేధావులు, విద్యావంతులు సంఘీభావం ప్రకటించారు. -
రాజకీయ శక్తిగా ఎదగాలంటున్నారు
జేఏసీ భేటీలో కోదండరాం వ్యాఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో జేఏసీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని పలువురు కోరుకుంటున్నారని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించా రు. గురువారం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన జరిగిన జేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన భేటీలు, వాటిలో వచ్చిన సూచనలను కోదండరాం వివరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ సంఘాలు నిర్వహించిన సమావేశాలకు విశేష ఆదరణ దక్కిందన్నా రు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆవిర్భవించిన జేఏసీ రాజకీయాలకు అతీ తంగానే, ప్రజల పక్షాన పోరాటం చేయాలని కొందరు సూచించగా మరికొందరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజ లకు చెప్పిన మాటలను నిజం చేయడానికి అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని కోరినట్టుగా కోదండరాం వెల్లడించారు. రాజకీయాలకతీతంగా, ఒక రాజకీయ లక్ష్యం కోసం దీర్ఘకాలికంగా పనిచేసి విజయం సాధించడంతోపాటు నిలదొక్కుకున్న సామాజిక సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని పలు వర్సిటీల ప్రొఫెసర్లు విశ్లేషించినట్టు కోదండరాం చెప్పారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నం గా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ ఇక్కడి పాలకులు భూమిని కేంద్రంగా చేసుకుని ఆలోచనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాద్, డి.పి.రెడ్డి, పురుషోత్తం, రమేశ్, ఖాజా మోహినుద్దీన్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.