breaking news
miss iraq
-
'మాతో చేరకపోతే ఎత్తుకుపోతాం'
బాగ్దాద్: ఇస్లామిక్ ఉగ్రవాదులు అందాల భామలనూ వదలడం లేదు. తమతో చేరకపోతే ఎత్తుకుపోతామని బెదిరిస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత మిస్ ఇరాక్ టైటిల్ గెల్చుకున్న షయమా ఖాసిం అబ్దెల్ రహమాన్(20)కు ఐఎస్ఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఫోన్ వచ్చిందని 'జెరూసలెం పోస్ట్' వెల్లడించింది. తమ సంస్థలో సభ్యురాలిగా చేరాలని లేకుంటే కిడ్నాప్ చేస్తామని ఆమెను బెదిరించినట్టు తెలిపింది. ఐఎస్ఐఎస్ హెచ్చరికతో షయమా ఆందోళనకు గురైందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకెళ్లాలని ఆమె నిర్ణయించుకుందని అందాల పోటీ నిర్వాహకులు తెలిపారు. 'సమాజంలో ఇరాకీ మహిళ ఉనికి నిరూపించాలని కోరుకుంటున్నాను. పురుషులతో సమానంగా ఆమెకు హక్కులు ఉన్నాయి. నేను దేనికి భయపడడం లేదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నేనేం తప్పు చేయడం లేదు' అని ఉత్తర ఇరాక్ లోని కిర్ కుక్ ప్రాంతానికి చెందిన షయమా పేర్కొంది. అందాల పోటీలో పాల్గొనేందుకు 200 మంది ఆసక్తి చూపించారు. బెదిరింపుల కారణంగా చివరకు 10 మంది మాత్రమే పోటీలో పాల్గొన్నారని గ్రేవ్ మేగజీన్ తెలిపింది. -
చంపేస్తామని బెదరించినా.. ఇరాక్‌లో అందాలపోటీ!
ఇరాక్ లాంటి ఛాందస దేశంలో.. మహిళలు బురఖా లేకుండా బయటకు రావడమే కష్టం. ఏవైనా ఆటల్లో వాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నా కాళ్లు కూడా కనపడకుండా దుస్తులు ధరించి పాల్గొనాలి. అలాంటి దేశంలో అందాల పోటీలు నిర్వహించడం అంటే మాటలా? కానీ.. 43 ఏళ్లలో తొలిసారిగా అక్కడ అందాల పోటీలు నిర్వహించారు. వాటిలో పాల్గొంటే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా షైమా ఖాసిం అనే యువతి మిస్ ఇరాక్ టైటిల్ గెలుచుకుంది. ఇరాక్‌లో కూడా ఇలాంటి పోటీలు జరగాలని ఈ పోటీల డైరెక్టర్ అహ్మద్ లీత్ అన్నారు. ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, లెబనాన్ లాంటి ఇతర దేశాలు చేస్తున్నట్లే తాము కూడా అందాల పోటీలు పెడదామని అనుకున్నామని ఆయన చెప్పారు. తొలుత ఈ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలోనే అమ్మాయిలు ముందుకొచ్చినా, తర్వాత పోటీ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ.. క్రమంగా పల్చబడ్డారు. ఈ పోటీకి సంబంధించిన వెబ్సైట్లోను, ఫేస్బుక్ పేజిలోను లెక్కలేనన్ని హెచ్చరికలు పోస్ట్ అయ్యాయి. అన్నింటిలో ఉన్నది... అమ్మాయిలను చంపేస్తామన్న బెదిరింపులే. దాంతో మొదట్లో 200 మంది వరకు వచ్చిన పోటీదారులు, తర్వాత 10 మందికి పడిపోయారు. చివరకు యూనివర్సిటీ ఆఫ్ కిర్కుక్లో ఎకనమిక్స్ చదువుతున్న షైమా ఖాసిం (20) కిరీటాన్ని గెలుచుకుంది. అన్ని రకాల బెదిరింపులు, కష్టాలను దాటుకుని ఆమె ఈ కిరీటం గెలుచుకుందని, ఇది కేవలం ఈ పోటీలో విజయం మాత్రమే కాదని.. ఆమె తన జీవిత పోరాటంలో కూడా విజయం సాధించిందని అక్కడ అంతా అంటున్నారు.