breaking news
Mini ATMs
-
పీఏసీఎస్‌లలో ఇక మినీ ఏటీఎంలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) తమ ఖాతాదారులు ఆయా సంఘాల్లోనే నగదు తీసుకునే వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సహకార బ్యాంకులను బలోపేతం చేయడం కోసం ప్రతి సంఘాన్ని మినీ ఏటీఎం కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు ఇక నగదు తీసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించే ఇబ్బంది లేకుండా.. నేరుగా మినీ ఏటీఎంల ద్వారా సహకార సంఘంలోనే నగదు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం అన్ని సంఘాలకు ఏటీఎంలతోపాటు మైక్రో సిమ్ కార్డులను పంపిణీ చేసింది. అయితే సహకార బ్యాంకులో ఖాతా ఉండి.. ఏటీఎం కార్డు ఉన్న వారికి ఇది ఉపయోగపడనుంది. ఒక్క ఏటీఎం కార్డు నుంచి రోజుకు రూ.10వేల వరకు నగదు తీసుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో కలిపి 1.60లక్షల మంది సభ్యులు ఉండగా.. ఇప్పటికే 1.50లక్షల మందికి ఏటీఎం కార్డులు జారీ చేశారు. వివిధ కారణాల వల్ల వీటిలో అనేకం ఉపయోగించకపోవడం, కొన్నిచోట్ల రైతులు వీటిని వినియోగించాలన్నా అవి పనిచేయకపోవడం వంటి అంశాలను గుర్తించిన సహకార బ్యాంకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏటీఎం కార్డులన్నింటినీ యాక్టివేట్ చేస్తున్నారు. ఎర్రుపాలెం సహకార సంఘంలోని మినీ ఏటీఎం అక్కడి రైతులకు సేవలందిస్తోంది. ఇదే తరహాలో అన్నిచోట్ల రైతులకు సేవలందించేలా ఏటీఎం కేంద్రాలను సిద్ధం చేయాలని సహకార శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రారంభ దశలో కేవలం రైతుల ఖాతాలో ఉన్న నగదును తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నా.. మరో మూడు నెలల్లో కొత్త సాఫ్ట్వేర్ సహాయంతో ఆయా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో ఇదే ఏటీఎం ద్వారా డబ్బులు వేసుకోవడం.. ఇతర ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకోవడం వంటి సేవలను కూడా అందించాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. రోజుకు వెయ్యి మందికి సరిపోను.. ప్రతి రోజు ఒక్కో సహకార సంఘం నుంచి వెయ్యి మంది రైతులు రూ.10వేల చొప్పున నగదు తీసుకునేందుకు అనువుగా డబ్బును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఖమ్మం, వైరా, సత్తుపల్లి, పెనుబల్లి, మర్లపాడు, అశ్వారావుపేట, కొత్తగూడెం, కూసుమంచి, ఎర్రుపాలెం, చర్ల, వెంకటాపురంలో ఏటీఎం కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి బహుళ ఆదరణ ఉండటంతో మరో ఐదు ప్రాంతాల్లో కొత్త ఏటీఎం కేంద్రాల కోసం సహకార బ్యాంకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. సహకార బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలు కలిగిన ఖాతాదారులు సైతం సహకార సంఘాల వద్ద ఉన్న మినీ ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించారు. దీంతో నగదు అవసరాల కోసం మండల, పట్టణ కేంద్రాలకు వచ్చి ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గంటలతరబడి బారులు తీరాల్సిన అవసరం రైతులకు, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు లేకుండా.. ఆయా గ్రామాల్లోనే ఈ ఏటీఎం కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుకు సమయం ఆదా అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో మినీ ఏటీఎం కేంద్రాలు రైతులకు, డీసీసీబీ ఖాతాదారులకు సేవలు అందించనున్నాయి. జిల్లాలో 47 కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిలు ఉండగా.. వాటి పరిధిలో పనిచేసే పీఏసీఎస్‌లు ఆయా బ్యాంకుల నుంచి రోజువారీగా నగదు తీసుకుని రైతులకు ఏటీఎం కేంద్రాల ద్వారా అందజేసి.. మిగిలిన మొత్తాన్ని లేదా ఆరోజు లావాదేవీలను బ్యాంకు అధికారులకు ఖాతాలవారీగా సమర్పించనున్నారు. -
గ్రామీణ పోస్టాఫీసులు ఇక మినీ ఏటీఎంలు
- హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు - తెలంగాణ, ఏపీల్లో ఏప్రిల్ చివరి నాటికి 2 వేల గ్రామాల్లో అందుబాటులోకి.. - ‘సాక్షి’తో భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు ఏటీఎంల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించాయి. తపాలా శాఖ మాత్రం అన్ని గ్రామాల్లోని తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను అందుబాటులోకి తెచ్చి వాటిని మినీ ఏటీఎంలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు రిజర్వ్ బ్యాంకు కూడా అనుమతివ్వడంతో ఈ నెల చివరి నాటికే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ నెలాఖరునాటికి దేశవ్యాప్తంగా 24 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి 2 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. త్వరలో ఆ సంఖ్య 13 వేలకు చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.... దేశవ్యాప్తంగా 13 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలకు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను సమకూర్చబోతున్నాం. ఇప్పుడు కొన్ని పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అవి కేవలం పోస్టాఫీసుల్లో ఖాతా ఉన్నవారు మాత్రమే నగదు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. వాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే డివైస్ల నుంచి ఎవరైనా నగదు పొందవచ్చు. తపాలా కార్యాలయాల పనివేళల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది. తొలుత రూ.5 వేల వరకు నగదు పొం దవచ్చు. ఆ తర్వాత పెంచుతాం. అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు నిల్వలు సిద్ధం చేస్తున్నాం. ఏటీఎం కార్డుతో వచ్చే వారు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లో స్వైప్ చేస్తే అక్కడున్న సిబ్బంది డబ్బు అందిస్తారు. తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉన్న వారికి ఎలాంటి రుసుములు ఉండవు, బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఒక్కో విత్‌డ్రా యల్‌కు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఖాతాదారు నుంచి కాకుండా సంబంధిత బ్యాంకు నుంచి వసూలు చేస్తాం. తపాలా కార్యాలయాలతో గ్రామాల్లోని దుకాణాలను అనుసంధానం చేసి నగదు రహిత లావాదేవీలు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.