breaking news
Mineral water business
-
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం
పరిగి, న్యూస్‌లైన్: లాభాల వేటలో వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. వేసవిలో నీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో బరిలోకి దిగిన వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన మినరల్ నీరంటూ 20 లీటర్ల డ బ్బాకు రూ. 15 వసూలు చేస్తున్నారు. అయితే ఈ నీటి తయారీకి కనీస ప్రమాణాలు పాటించకున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిగి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండటం, కొత్తగా పలు విద్యా సంస్థలు కూడా వెలియడంతో జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పట్టణంలో మినరల్ వాటర్ వినియోగం పెరిగిపోయి వ్యాపారులకు కాసుల పంటపండిస్తోంది. పరిగి పట్టణంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆరు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 3వేల లీటర్ల వరకు నీటిని విక్రయిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల ద్వార డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే నీటిని సరఫరా చేసే కంపెనీ తమ బాటిళ్లపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. కాని పరిగిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లకు చెందిన ఏ ఒక్కరూ బాటిళ్లకు స్టిక్కర్లు అతికించడం లేదు. ఇంటి దగ్గరకే నీరు వస్తుండటంతో ప్రజలు కూడా ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. శుద్ధి చేసిన నీటిలో క్రిమికీటకాలు రాకుండా ఓ రసాయన పదార్థాన్ని కలుపుతారు. నీటిని ఫిల్టర్ చేశాక తిరిగి వాటిలో సమపాల్లలో మినరల్స్ కలపాల్సి ఉంటుంది. వీటని సంబంధిత కంపెనీలు ఆచరించటం లేదు. అంతేకాకుండా కనీసం బాటిళ్లను కూడా శుభ్రపర్చకపోవడంతో అవి నాచు పట్టి కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎవరూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు. అయితే ఆ తర్వాత మాత్రం సదరు కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేవు.... పరిగి పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లకు ఎలాంటి అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. తదుపరి పంచాయతీ నుంచి ప్లాంటును నిర్మించడానికి, నీటిని విక్రయించడానికి ఎలాంటి అనుమతులు పొందలేదు. రెండు ప్లాంట్లకు తప్పా మిగితావాటికి ఐఎస్ఐ సర్టిఫికెట్లు కూడా లేవు. ఐఎస్ఐ సర్టిఫికెట్ పొందాలంటే అన్ని రకాల పరీక్షలను ప్లాంటు ఎదుర్కొవాల్సి ఉంటు ంది. దీంతో ప్లాంట్ల నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకున్నవారు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిన విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన నీటిని పంపిణీ చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.