breaking news
MIDH scheme
-
కొత్త గోడౌన్లు ‘కోల్డ్ స్టోరేజీ’లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో మరిన్ని కోల్డ్ స్టోరేజీ గోడౌన్లను నిర్మించాలని ఉద్యానవనశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన రావట్లేదు. పండ్లు , కూరగాయలు, ఉల్లి వంటి ఉద్యాన పంటలతోపాటు మిర్చి, చేపలు, గుడ్లు, మాంసం, చీజ్ వంటి ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు భారీ స్థాయిలో కోల్డ్ స్టోరేజీల అవసరం ఉంది. ప్రస్తుతం ఉద్యానవనశాఖ పరిధిలోని సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 89 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉండగా మరో 100 యూనిట్లు ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ నిల్వ సామర్థ్యం సరిపోదని అధికారులు చెబుతున్నారు. అయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు.35 శాతం రాయితీ ఇవ్వనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలురాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12 కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే కేవలం సిద్దిపేట నుంచి ఒక దరఖాస్తు రాగా మిగతా జిల్లాల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో ఔత్సాహికులు తగిన అర్హతలతో ముందుకు వస్తే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఉద్యానవన శాఖ భావిస్తోంది. ఎంఐడీహెచ్ పథకం కింద శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. 5 వేల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ యూనిట్ నిర్మాణానికి రూ. 4.80 కోట్లు ఖర్చయితే అందులో రూ. 1.68 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించనున్నాయి. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 9,600 చొప్పున ఖర్చయితే అందులో రూ. 3,360 అందనుంది.సబ్సిడీ సరిపోదని..ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణదారులు ఐదు అంతస్తుల్లో రెండు వేర్వేరు చాంబర్లను నిర్మించాలి. ఒక్కో చాంబర్ నిల్వ సామర్థ్యం 3,631.90 టన్నుల చొప్పున రెండు చాంబర్లు కలిపి 7,284 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కట్టాలి. అయితే 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి మాత్రమే ఎంఐడీహెచ్ పథకం సబ్సిడీ లభిస్తుంది. అంటే మిగిలిన 2,284 మెట్రిక్ టన్నుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న కోల్డ్ స్టోరేజీలకు అద్దె ప్రాతిపదికన చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో లేకపోవడంతో పంటలు వృథా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తగినంత భూమి ఉన్న ఔత్సాహికులు కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలికోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం కోసం ఔత్సాహికులను ఆహ్వాని స్తున్నాం. ఇందుకోసం అందిస్తున్న 35 శాతం సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. శీతల గిడ్డంగులకు ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటే తగిన ఆదాయం లభిస్తుంది. రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. – యాస్మిన్ భాషా, ఉద్యానవన శాఖ డైరెక్టర్ -
2020 వరకు ‘కృషి ఉన్నతి’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించిన 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేరుస్తూ గతేడాది ప్రారంభించిన ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన’ కార్యక్రమాన్ని 2020 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,269 కోట్ల నిధులను తన వాటాగా కేంద్రం కేటాయించనుంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ‘హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత కూడా.. 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. 11 పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి పర్యవేక్షణ సులభమైందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ), సబ్–మిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ (ఎస్ఎంఏఈ) తదితర వ్యవసాయ రంగానికి చెందిన 11 పథకాలను కేంద్రం గతేడాది ఒకే గొడుగు కిందకు తెచ్చి హరిత విప్లవం– కృషి ఉన్నతి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం విదితమే. పెట్టుబడి పరిమితి రెండింతలు వృద్ధుల పింఛను కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన్ యోజన (పీఎంవీవీవై) పథకంలో పెట్టుబడి పరిమితిని కేంద్రం రెండింతలు చేసింది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గురువారమే (మే 3) చివరి తేదీగా ఉండగా, ఆ గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది. 60 లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో ఇప్పటివరకు వృద్ధులు గరిష్టంగా రూ. 7.5 లక్షలను మాత్రమే పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉండగా, తాజా నిర్ణయంతో ఆ పరిమితి రూ.15 లక్షలకు పెరిగింది. పీఎంవీవీవైలో పెట్టుబడి పెట్టిన వృద్ధులకు వారి పెట్టుబడిపై ఏడాదికి 8 శాతం రాబడి పదేళ్లపాటు వస్తుంది. ఆ మొత్తాన్ని ప్రతినెలా లేదా మూడు లేదా ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి వృద్ధులు తీసుకునే వెసులుబాటు ఉంది. పరిమితి పెంచడంతో ఇప్పుడు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టిన వృద్ధులు నెలకు రూ.10 వేల పింఛనును పదేళ్లపాటు పొందొచ్చని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,540 కోట్లను (మొత్తం బకాయిల్లో 10%) రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని నిర్ణయించారు. ► చెన్నై, లక్నో, గువాహటి నగరాల్లోని విమా నాశ్రయాల్లో రూ.5,082 కోట్ల వ్యయంతో కొత్త టర్మినళ్ల నిర్మాణానికి అంగీకారం. ► ఖనిజ రంగంలో సంస్కరణలకోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)ను పునర్వ్యవస్థీకరించేందుకు ఆమోదం. ► ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజనని 2019–20 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఎంఎస్‌డీపీ ఇక పీఎంజీవీకే బహుళ రంగాల అభివృద్ధి కార్యక్రమం (ఎంఎస్‌డీపీ–మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పేరు మార్చి, పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంఎస్డీపీకి ‘ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమ్’ (పీఎంజేవీకే) అనే కొత్త పేరు ను ఖరారు చేసింది. మైనారిటీలకు మ రింత మెరుగైన సామాజిక–ఆర్థిక మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఈ పథకం పరిధిని విస్తరించేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. -
కేంద్ర వ్యవసాయ పథకాల్లో నగదు బదిలీ
రాష్ట్ర వ్యవసాయ శాఖలకు కేంద్రం ఆదేశాలు ⇒ నేడు ఢిల్లీలో రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ సాక్షి, హైదరాబాద్: కేంద్రం ద్వారా రాష్ట్రాల్లో అమలుచేసే 10 వ్యవసాయ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల బీమా సొమ్ము రైతుకు చేరడంలో జాప్యమవుతుండటంతో పంట నష్టపోయిన రైతు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఎంఐడీహెచ్ పథకం ద్వారా ఉద్యాన రైతులకిచ్చే సూక్ష్మ సేద్యం సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోందన్న విమర్శలూ ఉన్నా యి. ఈ నేపథ్యంలో డీబీటీ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. దీన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు డీబీటీ పోర్టల్ సిద్ధం చేసింది. దీని ద్వారా సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలకే చేరుతుంది. అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ సెంటర్స్ (ఏసీఏబీసీ) పథకం, వ్యవసాయ యాంత్రీకరణ, పీఎంకేఎస్‌వై, సమగ్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (ఎంఐడీహెచ్), వ్యవసాయ విస్తరణలో సం స్కరణల పథకం, విత్తనాలు, మొక్కల మెటీరియల్ పథకం, రైతులకు పంట రుణాల వడ్డీ పథకం, పంటల బీమా పథకం, జాతీ య ఆహార భద్రత మిషన్, వ్యవసాయ సహకార సమగ్ర పథకాల్లో ఈ విధానాన్ని అమ లుచేస్తారు. లబ్ధిదారుల జాబితాను డీబీటీ పోర్టల్‌లో పొందుపరుస్తారు. దీనివల్ల పర్యవేక్షణ సులువుగా ఉంటుందనేది కేంద్రం ఆలోచన. ప్రతి పథకానికి ఒక యునిక్ కోడ్ నంబర్ ఇవ్వడంతో పాటు పథకాల పురోగతిని పోర్టల్‌లో ఉంచుతారు. డీబీటీ విధానం అమలుపై రాష్ట్రాలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధం... కేంద్రం ద్వారా అమలు చేసే పథకాలతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలుచేసే పథకాల్లోనూ డీబీటీని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. విత్తనాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు చేస్తారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. వరి, సోయాబీన్, శనగ, వేరుశనగ, పచ్చిరొట్ట తదితర విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సరఫరా చేస్తోంది. ఈ బాధ్యతలను కొన్ని సంస్థలకు అప్పగించి, దీనికి ఇచ్చే సబ్సిడీని రైతు ఖాతాలో జమచేస్తారు. వ్యవసాయ యంత్రాల సబ్సిడీ కూడా రైతు ఖాతాలో జమ చేస్తారు.


