డిమాండ్ ఉన్నా కొత్త శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకు రాని ఔత్సాహికులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 35 శాతం సబ్సిడీ ప్రకటించినా కానరాని స్పందన
ఈ ఏడాది ‘ఎంఐడీహెచ్’ ద్వారా 5 వేల టన్నుల సామర్థ్యంగల 12 గిడ్డంగుల నిర్మాణానికి చాన్స్
ఐదు అంతస్తుల్లో రెండు చాంబర్ల నిర్మాణం ఎక్కడ జరిపినా ప్రభుత్వ ప్రోత్సాహం
రాష్ట్ర అవసరాలకు 100 కోల్డ్ స్టోరేజీలు అవసరం ఉందంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో మరిన్ని కోల్డ్ స్టోరేజీ గోడౌన్‌లను నిర్మించాలని ఉద్యానవనశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన రావట్లేదు. పండ్లు , కూరగాయలు, ఉల్లి వంటి ఉద్యాన పంటలతోపాటు మిర్చి, చేపలు, గుడ్లు, మాంసం, చీజ్ వంటి ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు భారీ స్థాయిలో కోల్డ్ స్టోరేజీల అవసరం ఉంది.
ప్రస్తుతం ఉద్యానవనశాఖ పరిధిలోని సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 89 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉండగా మరో 100 యూనిట్లు ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ నిల్వ సామర్థ్యం సరిపోదని అధికారులు చెబుతున్నారు. అయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు.
35 శాతం రాయితీ ఇవ్వనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12 కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే కేవలం సిద్దిపేట నుంచి ఒక దరఖాస్తు రాగా మిగతా జిల్లాల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో ఔత్సాహికులు తగిన అర్హతలతో ముందుకు వస్తే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఉద్యానవన శాఖ భావిస్తోంది.
ఎంఐడీహెచ్ పథకం కింద శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. 5 వేల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ యూనిట్ నిర్మాణానికి రూ. 4.80 కోట్లు ఖర్చయితే అందులో రూ. 1.68 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించనున్నాయి. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 9,600 చొప్పున ఖర్చయితే అందులో రూ. 3,360 అందనుంది.
సబ్సిడీ సరిపోదని..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోల్డ్ స్టోరేజీ యూనిట్‌ల నిర్మాణదారులు ఐదు అంతస్తుల్లో రెండు వేర్వేరు చాంబర్లను నిర్మించాలి. ఒక్కో చాంబర్ నిల్వ సామర్థ్యం 3,631.90 టన్నుల చొప్పున రెండు చాంబర్లు కలిపి 7,284 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కట్టాలి. అయితే 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి మాత్రమే ఎంఐడీహెచ్ పథకం సబ్సిడీ లభిస్తుంది.
అంటే మిగిలిన 2,284 మెట్రిక్ టన్నుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న కోల్డ్ స్టోరేజీలకు అద్దె ప్రాతిపదికన చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో లేకపోవడంతో పంటలు వృథా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తగినంత భూమి ఉన్న ఔత్సాహికులు కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.
ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలి
కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం కోసం ఔత్సాహికులను ఆహ్వాని స్తున్నాం. ఇందుకోసం అందిస్తున్న 35 శాతం సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. శీతల గిడ్డంగులకు ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటే తగిన ఆదాయం లభిస్తుంది. రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. – యాస్మిన్ భాషా, ఉద్యానవన శాఖ డైరెక్టర్


