breaking news
Micro-finance company
-
పేదల నుంచి లాభాలు పిండుకోవద్దు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ హితవు ముంబై: సమాజంలో అట్టడుగునున్న నిరుపేదల నుంచి కూడా లాభాలను పిండుకోవడం తగదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ(ఎంఎఫ్ఐ)లనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంబంధించిన రుణాల విషయంలో ఎంఎఫ్ఐలు అధిక లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఎంఎఫ్ఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురు సీకే ప్రహ్లాద్ రాసిన ‘ద ఫార్చూన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్’ అనే పుస్తకంలో అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా రాజన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కంపెనీలు పేదల లక్ష్యంగా వస్తు, సేవల వ్యాపారాల నిర్వహణ కోసం అనుసరించాల్సిన కొత్త వ్యాపార విధానాలను ప్రహ్లాద్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ప్రహ్లాద్ తన పుస్తకంలో అట్టడుగున సంపద దాగి ఉందంటూ పేర్కొనడం ద్వారా పేదలపై నిర్దయతో వ్యవహరించారని భావిస్తున్నా. నిరుపేదల నుంచి ఎవరైనాసరే ఎలా లాభాలు దండుకుంటారు. తమ వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు అవసరమైనమేరకే స్వల్ప లాభాలకు పరిమితం కావాలనేదే నా ఉద్దేశం. ఎడాపెడా లాభాలు పిండుకుంటే అది సమాజంలో ఆందోళనలు పెరిగేందుకు దారితీస్తుంది. ప్రహ్లాద్ చెప్పిన మేనేజ్మెంట్ పాఠాలతో చాలా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మారుమూల మార్కెట్లలోకి చొచ్చుకెళ్లాయి. ముఖ్యంగా దేశంలోని కన్సూమర్ గూడ్స్, వాహన, టెలికం కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. అయితే, ఎవరైనాసరే నిరుపేదలకు సేవల విషయంలో అధిక లాభాపేక్షలేకుండా వ్యవహరించాలి’ అని రాజన్ అన్నారు. -
డ్వాక్రా మహిళలకు సర్కార్ షాక్..!
కర్నూలు రూరల్ : అధికారం చేపట్టిన వెంటనే తీపికబురు అందిస్తుందనుకున్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు షాక్ ఇచ్చింది. స్త్రీనిధి పథకం కింద తీసుకున్న రుణాలన్నింటినీ తప్పనిసరిగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది ఈ నెల నుంచే అమలు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.5, పది రూపాయల వడ్డీకి రుణాలు తీసుకొని మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ ఉచ్చు నుంచి వారిని బయట పడేసేందుకు, కుటుంబ అవసరాలకు చిన్న మొత్తాలను వడ్డీ లేకుండా అందించేందుకు 2011 నవంబరు నెలలో స్త్రీ నిధి బ్యాంకును అప్పటి ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. ఒక్కో సంఘంలో పది మంది దాకా రుణగ్రహీతలు ఉన్నారు. ఇలా కర్నూలు మండలంలో సుమారు 240 మంది మహిళలు రూ. 43 లక్షల రూపాయలు తీసుకున్నారు. నిన్నటి వరకు ఈ రుణాలపై వడ్డీని నేరుగా ప్రభుత్వమే సంబంధిత బ్యాంకులకు చెల్లించేది. అయితే ఈ నెల నుంచి అసలుతో పాటు వడ్డీ వసూలు చేయాలని కొత్తప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టోలో డ్వాక్రా మహిళల అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో అసలుతో పాటు వడ్డీ ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.