breaking news
metarnity ward
-
గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన
సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె... వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు. -
‘ప్రసవ’ వేదన
ఆంటినేటల్ వార్డులో పడకల కొరత - ఒకే మంచంపై ఇద్దరికి చికిత్స - రాత్రిళ్లు గర్భిణిల అవస్థలు వర్ణనాతీతం - చెట్ల కింద రోజుల తరబడి నిరీక్షణ - కటిక నేలపైనే నిరీక్షణ - ముదిగుబ్బ మండలం నడిచెర్లపల్లికి చెందిన చంద్రకళ రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిని ఆశ్రయించింది. ఆంటినేటల్ వార్డులో పడకలు లేకపోవడంతో ఆరుబయట చెట్ల కింద నిరీక్షిస్తోంది. - ఆత్మకూరు మండలం బి.యాలేరుకు చెందిన శివమ్మ ప్రసవం కోసం సర్వజనాస్పత్రికి వచ్చి ఐదు రోజులవుతోంది. పగలూ, రాత్రీ తేడా లేదు. చెట్ల కింద బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. - వీరిద్దరే కాదు.. సర్వజనాసుపత్రికి ప్రసవం కోసం వచ్చే గర్భిణీలందరి పరిస్థితి ఇదే. అనంతపురం మెడికల్: ప్రయివేట్ ఆసుపత్రుల మెట్లెక్కే స్థోమత లేక పెద్దాసుపత్రిని ఆశ్రయించే నిరుపేదలను అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. ఇక్కడ నిత్యం 30 నుంచి 40 ప్రసవాలు నిర్వహిస్తుండగా.. 10 నుంచి 15 సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రసవ సమయం సమీపించగానే ఆసుపత్రి వచ్చే గర్భిణిలను ఆంటినేటల్ వార్డులో ఉంచుతారు. అయితే ఈ వార్డులో సరిపడా పడకలు లేకపోవడం ‘ప్రసవ వేదన’కు కారణమవుతోంది. మొత్తం 30 పడకలు ఉండగా.. నిత్యం 45 మంది వరకు అడ్మిషన్లో ఉంటున్నారు. ఈ కారణంగా ఒక్కో పడకపై ఇద్దరు గర్భిణిలకు చోటు కల్పిస్తున్నారు. కనీసం కదిలేందుకు కూడా వీలులేని స్థితిలో వీరు చుక్కలు చూస్తున్నారు. ఉదయం పూట సర్దుకుంటున్నా.. రాత్రిళ్లు పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వార్డు బయట ఉన్న ఆవరణలోనే చాలా మంది గర్భిణిలు సేదతీరుతుండటం ఇక్కడి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వార్డు లోపల పెచ్చులూడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వైద్య సిబ్బంది సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వార్డులో అడ్మిషన్‌కు రాగానే ‘డెలివరీకి టైం ఉంది కదా.. మళ్లీ రండి. ఇక్కడెక్కడుంటారు’ అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. కొందరు ఇంటికి వెళ్లిపోతుంటే.. మరికొందరు ఎప్పుడు నొప్పులు వస్తాయోననే భయంతో ఆసుపత్రి ఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. ఏదయినా జరిగితే.. ఆసుపత్రిలో విష పురుగుల బెడద కూడా ఉంది. ఇటీవల ఏకంగా మెయిన్ ఆపరేషన్ థియేటర్ వద్ద ఓ పామును చంపడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పైగా ఆంటినేటల్ వార్డు సమీపంలోనే బయోమెడికల్ వేస్ట్ వేస్తుంటారు. పరిసరాలు కూడా అధ్వానంగా ఉంటాయి. దీంతో పాములు, తేళ్లు ఇతర కీటకాలు వచ్చే అవకాశం లేకపోలేదు. పైగా కొన్ని రోజుల క్రితం ఆంటినేటల్ వార్డు ఆవరణలోనే ఓ చెట్టు కొమ్మ విరిగిపడింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గర్భిణిలు రాత్రి వేళ చెట్ల కింద నిద్రిస్తున్న సమయంలో కొమ్మలు విరిగిపడితే పరిస్థితి ఏమిటన్నది అధికారులకే తెలియాలి. వార్డులో దోమలు సైతం అధికమే. కనీసం కిటికీలకు మెష్‌లు సైతం ఏర్పాటు చేయని దౌర్భాగ్యం ఇక్కడుంది. ఇక ప్రవసం చేసే గదిలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గర్భిణికి ప్రసవం చేయడంలో మెటర్నిటీ అసిస్టెంట్ల పాత్ర కీలకం. ఇక్కడ పది మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ముగ్గురితోనే నెట్టుకొస్తున్నారు. మంత్రులకు పట్టని ‘పెద్దాస్పత్రి’ ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తామని గొప్పలు చెబుతున్న పాలకులకు ఇక్కడి సమస్యలు పట్టడం లేదు. కొన్నాళ్ల క్రితం వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. పల్లె రఘునాథరెడ్డి మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు మంత్రులుగా కొనగుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సునీత కూడా పెద్దాస్పత్రిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం కూడా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం గమనార్హం. డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం గర్భిణిల అవస్థలను డీఎంఈ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లాం. జీఓ 124 ప్రకారం పోస్టులు భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాట్స్, బెడ్స్‌ను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించాం. పీడియాట్రిక్ వార్డును పైఅంతస్తుకు మార్చి ఆ వార్డును గర్భిణిల కోసం వాడుతాం. మెటర్నిటీ అసిస్టెంట్ల విషయాన్ని డీఎంహెచ్‌తో మాట్లాడాను. పీహెచ్‌సీల్లో ఉన్న రెండో ఏఎన్ఎంలను ఇక్కడికి పంపాలని కోరాం. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం. – డాక్టర్ జగన్నాథ్, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్