breaking news
Messi Team
-
మెస్సీ మేనియా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లో వేచిన సాయంత్రం.. ఈ రోజే సాకారం.. నగరమంతా మంత్రముగ్ధం.. ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల కోలాహలం.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్లో మునిగితేలే అపూర్వ ఘట్టం.. భాగ్య నగరం క్రీడా స్ఫూర్తితో ఓలలాడే అరుదైన సమయం.. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ప్రత్యేక మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్‌లో పాల్గొననుండటం మరో విశేషం. భావి ఫుట్‌బాల్‌కు నాంది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్ వంటి క్రీడలకు మంచి అభిమాన వలయం ఉన్నప్పటికీ, ఫుట్‌బాల్ అంతగా పెద్ద స్థానాన్ని సంపాదించలేదు. అయితే.. మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు లేకపోవడంతో ఈ మ్యాచ్ నగరానికి భవిష్యత్ ఫుట్‌బాల్ అభివృద్ధికి నాందిగా మారుతుందనే విశ్లేషణ నగర క్రీడాభిమానుల్లో వినిపిస్తోంది. అంబరాన్నంటే అతిపెద్ద సంబరం.. ⇒ మ్యాచ్‌లో మెస్సీతో పాటు లూయిస్ సూయారేజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. ఈ మ్యాచ్‌తో నగరంలో ఫుట్‌బాల్ పట్ల ఆసక్తిని పెంచే ప్రేరణగా భావిస్తూ, పాఠశాలలు, యూనివర్సిటీలలో ఫుట్‌బాల్ క్లబ్‌లు, ట్రైనింగ్ సెషన్ల పట్ల అభిరుచిని పెంచే అవకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రధానంగా ఉండగా.. ఫుట్‌బాల్‌కు పెద్ద సంబరంగా ఈ ఈవెంట్ నిలుస్తోంది. ⇒ మెస్సీ వంటి ప్రపంచ విజేత కావడంతో ఫుట్‌బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారనుంది. మెస్సీ కొత్త క్రీడా దశదిశలను నిర్దేశించనున్నారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లలో ఫుట్‌బాల్ శిక్షణ, స్థానిక క్లబ్‌లు, క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, మెస్సీ ఫుట్‌బాల్ క్లినిక్ ద్వారా చిన్న పిల్లలు, యువతకు అవకాశం ఇస్తున్నందున, స్థానిక క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా ఉండనుందని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా.. నగరంలో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఇక్కడి క్రీడా సంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే అవకాశం వంటిదేనని చెప్పుకోవచ్చు. -
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
-
గట్టెక్కిన అర్జెంటీనా
♦ కోపా అమెరికా కప్ సెమీస్‌లో మెస్సీ బృందం ♦ షూటౌట్లో కొలంబియాపై గెలుపు వినా డెల్ మార్ (చిలీ) : నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన చేదు ఫలితాన్ని మరచిపోయేలా అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 2011 టోర్నీలో ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో ఓడిపోయింది. నాటి షూటౌట్లో గురి తప్పి అర్జెంటీనా ఓటమికి కారణమైన కార్లోస్ టెవెజ్ ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయలేదు. షూటౌట్లో కీలకమైన స్పాట్ కిక్‌ను గోల్‌గా మలిచిన టెవెజ్ ఈసారి అర్జెంటీనా తరఫున హీరో అయ్యాడు. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాలు, ఆ తర్వాత అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో అర్జెంటీనా తరఫున మెస్సీ, గారె, బనెగా, లావెజి, టెవెజ్ గోల్స్ చేయగా... బిగ్లియా, రోజో విఫలమయ్యారు. కొలంబియా జట్టు నుంచి జేమ్స్, ఫల్కావో, కుడ్రాడో, కార్డోనా గోల్స్ సాధించగా... మురియెల్, జునిగా, మురిలో గురి తప్పారు.


