breaking news
mess bill
-
బయోమెట్రిక్ హాజరుతోనే మెస్ బిల్లులు
– డీడీ యు.ప్రసాదరావు కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుతోనే ఇక నుంచి మెస్ బిల్లులు విడుదలవుతాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో సహాయ సంక్షేమాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. బయోమెట్రిక్ మిషన్లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకొని ఐరిస్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన హాస్టళ్లలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల యూనిఫాంను.. ఆయా హాస్టల్ పాయింట్లలోనే కుట్టించేందుకు అవసరమైన క్లాత్‌ను సహాయ సంక్షేమాధికారులు తీసుకువెళ్లాలన్నారు. ట్యూటర్లు, ప్లేట్లు, గ్లాసులు.. ఇతర అవసరమైన వస్తువుల కోసం ప్రతిపాదనలను అందించాలన్నారు. వసతి గృహాలు విలీనం అయిన దృష్ట్యా టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఎంల వివరాలను తనకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ప్రకాష్‌రాజు, సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, నాగభూషణం, లక్ష్మయ్య, శ్రీరామచంద్రుడు, గోవిందప్ప, జాకీర్‌హుసేన్ పాల్గొన్నారు. -
మెస్ బిల్లుల దందా
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ (కేఎంసీ) హాస్టళ్లలో మెస్ బిల్లుల దందా నడుస్తోంది. అక్కడ హాస్టల్ కాంట్రాక్టర్ చెప్పిందే వేదం. హాస్టల్ వార్డెన్లుగా వ్యవహరి స్తున్న ప్రొఫెసర్లు కూడా కాంట్రాక్టర్‌కే అండగా నిలుస్తున్నారు. హాస్టల్లో తింటే ఓకే. బిల్లు చెల్లించవచ్చు. మరి తినకపోతే.. దాంతో సంబంధం లేదు. తినకపోయినా బిల్లు మాత్రం కట్టాల్సిందే. ఇదెక్కడి గొడవని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. మీరు పరీక్షల్లో పాసు కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్‌కే వార్డెన్లు వత్తాసు పలుకుతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ మొత్తం బెదిరిం పుల వ్యవహారాన్ని కొందరు వైద్య విద్యార్థులు వీడియో రికార్డు చేసినట్టు సమాచారం. ఈ వీడియో రికార్డ్‌ను తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. నెల రోజుల బిల్లు కట్టాల్సిందే...! కేఎంసీకి చెందిన హాస్టళ్లలో సుమారు 500 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. వీరందరూ వివిధ హాస్టళ్లల్లో ఉంటున్నారు. వీరందరూ నెలకు మెస్ బిల్లుకు గానూ రూ. 1800 చెల్లిస్తున్నారు. అయితే, నెలలో సొంత పనుల రీత్యా ఊరికి వెళ్లినా, ఆరోగ్యం బాగోలేక మెస్‌లో భోజనం చేయకపోయినా... పండుగ సెలవులైనా నెల బిల్లు మాత్రం విద్యార్థులు కట్టాల్సిందే. ఈ వ్యవహారాన్ని గతంలో పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి ఫలితం లేదని వైద్య విద్యార్థులు అంటున్నారు. తాజాగా జనవరి నెల బిల్లులో ఏకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా పది రోజులు లేకపోయినా మొత్తం బిల్లు కట్టమని విద్యార్థులపై కాంట్రాక్టరు ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై హాస్టల్ వార్డెన్లుగా ఉంటున్న అసిస్టెంటు ప్రొఫెసరు, ప్రొఫెసర్లకు తాజాగా విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే, బిల్లు కట్టాల్సిందేనని వార్డెన్లు కూడా అనడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అంతేకాకుండా మెస్ బిల్లు కట్టకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కూడా బెదిరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారాన్ని కొందరు విద్యార్థులు తమ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. ఈ రికార్డ్‌ను తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అయితే, నేరుగా ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఎలాగైనా పోస్టు ద్వారానైనా రికార్డ్ చేసిన సీడీతో పాటు లేఖను పంపుతామని కూడా వైద్య విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసిన సందర్భంగా పేర్కొనడం గమనార్హం. దీనిని గమనిస్తే వారు ఎంతో భయాందోళనకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నెలలోనే 3 లక్షల కుంభకోణం...! ఒక్క జనవరి నెలలోనే ఏకంగా రూ. 3 లక్షల మేరకు కుంభకోణం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పండుగ సందర్భంగా సుమారు పది రోజుల పాటు విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో మెస్‌లో భోజనం చేయలేదు. వాస్తవానికి నెలకు మెస్ బిల్లు కింద రూ. 1800 చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు రూ. 60 అన్నమాట. అంటే పది రోజులకు ఒక్కో విద్యార్థికి రూ. 600 అవుతుంది. ఈ మొత్తాన్ని కట్టాల్సిందేనని కాంట్రాక్టరు అంటున్నారు. రూ. 600 చొప్పున మొత్తం 500 మంది విద్యార్థుల నుంచి రూ. 3 లక్షల మేరకు అవుతుంది. తమకు భోజనం పెట్టకపోయినా ఈ మొత్తాన్ని కాంట్రాక్టరుకు చెల్లించాలని వార్డెన్లు కూడా వత్తాసు పలకడం దారుణమని పేరు చెప్పేందుకు భయపడుతూ వైద్య విద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి వాపోయారు. ఇదే విధంగా గతంలో కూడా దసరా, దీపావళి వంటి పండుగలు, ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటికి వెళ్లినా మెస్ బిల్లు మాత్రం యథావిధిగా కట్టాల్సి వస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వీరు పేర్కొంటున్నారు. నివేదిక ఇవ్వమని ఆదేశించా - రాంప్రసాద్, కేఎంసీ ప్రిన్సిపల్ మెస్ బిల్లులపై గొడవ జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై సోమవారం నాటికి నివేదిక ఇవ్వమని వైస్ ప్రిన్సిపల్‌ను ఆదేశించాను. దీనిని పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాను. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.