breaking news
Menstrual Winds
-
పత్తికి వాన దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు, అల్పపీడనం కారణంగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పత్తిరైతుకు కొత్త కష్టం వచ్చింది. కొద్దిరోజుల కింద వేసిన పత్తి విత్తనాలు వారంగా కురుస్తున్న వానల కారణంగా కుళ్లిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దానివల్ల మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుందని.. అది ఆర్థికంగా ఎంతో భారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటికే వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక కుళ్లిపోయే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పత్తిని నల్లరేగడి నేలల్లో వేస్తారని, వాటిలో మొలకెత్తని విత్తనాలు పాడైపోతాయని చెబుతున్నారు. 7.3 లక్షల ఎకరాల్లో సాగు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ప్రారంభమైంది. రెండు మూడేళ్లతో పోలిస్తే ఈసారి కాలం కలిసివచ్చింది. సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువగా 134 శాతం వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోనైతే ఏకంగా 319 శాతం అదనంగా కురిసింది. రుతుపవనాల ప్రారంభానికి ముందే వర్షాలు రావడంతో రైతులు మొదట పత్తి విత్తనాలే వేశారు. వ్యవసాయశాఖ వేసిన లెక్కల ప్రకారం 7.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ప్రారంభమైంది. అయితే విత్తనాలు వేశాక వర్షాలు ఊపందుకున్నాయి. అనేకచోట్ల కుంభవృష్టి కురుస్తోంది కూడా. దీంతో పొలాల్లో నీరు నిలుస్తుండడంతో ఇంకా మొలకెత్తని పత్తి విత్తనాలు భూమిలోనే కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తాత్కాలికంగా నిలిచిపోతే.. పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని, ఆ తర్వాత వర్షాలు వచ్చినా నష్టం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో వాతావరణశాఖ మాత్రం మరో రెండుమూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రూ.100 కోట్ల నష్టం! రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 7.31 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా.. అందులో ఈ ఆరు జిల్లాల్లోనే 6.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈ జిల్లాల్లోని 5.5 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం కుళ్లిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎకరంలో రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.930.. ఈ లెక్కన రైతులు దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపోయే అవకాశముందని అంటున్నారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
* ఊపందుకున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు * మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వానలు సాక్షి, విశాఖపట్నం, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆవల కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడనుంది. శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి, తెలంగాణలోనూ బలంగా మారాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో.. అలాగే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా, ఉత్తర కోస్తాలో వాయవ్య దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంథనిలో 13, డోర్నకల్, గూడూరు, నర్సంపేటల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, ఏటూరునాగారం, ఆత్మకూర్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కొత్తగూడెం, చింతకాని, ములుగు, భూపాల్పల్లి, చంద్రుగొండ, నల్లబెల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. వెంకటాపూర్, ములకలపల్లి, బూర్గంపాడు, శ్యాంపేట్, బోనకల్, గుండాల, గోవర్థన్పేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున పడింది. ఇక ఏపీలోని అమలాపురంలో 11, అవనిగడ్డ, అంబాజీపేట, నర్సీపట్నం, విజయవాడల్లో 7, నందిగామ, నూజివీడులలో 6, గుడివాడ, తిరువూరులలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇది రుతుపవనాల వాయుగుండం ఈ సీజన్లో సముద్ర తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండంగా బలపడతాయి. అయితే అవి భూమికి సమీపంలో ఏర్పడడం వల్ల తుపానుగా మారే అవకాశం ఉండదు. అందుకే వాతావరణ నిపుణులు వీటిని రుతుపవనాల వాయుగుండం(మాన్సూన్ డిప్రెషన్)గా వ్యవహరిస్తారు. శనివారం నాటికి ఏర్పడబోయే వాయుగుండం ఇలాంటిదేనని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త ఆర్.మురళీకృష్ణ తెలిపారు. ఈ వాయుగుండం వాయవ్య దిశగా సముద్రం నుంచి భూమిపైకి వచ్చి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనిస్తుందన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి కూడా వెల్లడించారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం