breaking news
the medical
-
ప్రాణాంతకంగా ఎబోలా
మాదాపూర్: హెచ్ఐవీతో పాటు ఎలోబా వైరస్ ప్రాణాంతకంగా మారిందని ఎల్ఎస్హెచ్టీఎం డైరెక్టర్ (లండన్, యూకే) ప్రొఫెసర్ పీటర్ ఫియట్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్‌లో పలు వ్యాధులపై చర్చ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన పీటర్ మాట్లాడుతూ వైద్యరంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వివిధ వైరస్‌లతో ఆరోగ్యం దెబ్బతింటుందని వాటి నివారణ కోసం ఎప్పటికప్పుడు పరిశోధనలు త్వరితగతిన నిర్వహించి నివారించాలన్నారు. భారత్‌లో హెచ్ఐవీ వ్యాధి తగ్గుతోందన్నారు. 70 నుండి 80 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ వ్యాధి కారణంగా మరణించారన్నారు. 1981లో హెచ్ఐవీని కనుగొన్నట్లు పేర్కొన్నారు. క్రానిక్ వ్యాధుల వల్ల మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కావాల్సిన కృషి చేయాలన్నారు. ఎబోలా వ్యాధి ఎక్కడెక్కడ..ఎలా ప్రబలిందో వివరించారు. నైజీరియా, కంబోడియా, మెక్సికో, ఫ్రాన్స్, పాకిస్తాన్, బ్రెజిల్, ఉగాండ తదితర ప్రాంతాల్లో ఎబోలా ఏవిధంగా ప్రజలను భయబ్రాంతులను చేసిందో వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘తాటికొండ’పై గంపెడాశలు
కొత్త రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ తాటికొండ రాజయ్య ఓరుగల్లు బిడ్డకావడం జిల్లా ప్రజలు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించిన రాజన్నకు పేద ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలు, వారికి అందుతున్న వైద్య సేవలపై ఒక అంచనా ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వైద్యం, విద్యపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎంజీఎం, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరంగల్ కేంద్రబిందువుగా ఉంది. నిరుపేదలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే వచ్చేది ఇక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి(ఎంజీఎం)కే. అవసరానికి తగినట్టుగా ఈ ప్రాంతానికి హెల్త్ యూనివ ర్సిటీ తీసుకురావాలని, ఎయిమ్స్ తరహాలో ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి చేయాలని, వరంగల్‌ను మెడికల్ హబ్‌గా మార్చాల్సిన అవరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఓరుగల్లు ప్రజాప్రతినిధికే వైద్య శాఖను కేటాయించడంతో మన ‘ఆరోగ్యానికి ఇక డోకా లేదనే’ నమ్మికను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పాలనా వ్యవహారాలు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పరిధిలో కొనసాగేది. ఆ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆవకతవకలు జరగడంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పీజీ ఎంట్రెన్స్ పరీక్ష పత్రాలు లీకేజీ వల్ల తీరని నష్టం జరిగింది. అయితే ఇలాంటి కుంభకోణాలను బయటి పొక్కకుండా జాగ్రత్త పడుతూ ఈ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేసేవారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున హెల్త్ యూనివర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మెడికల్ హబ్‌గా మార్చాలి.. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని ఓరుగల్లులో ఏర్పాటు చేసి మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. 120 ఎకరాల అనువైన స్థలం కలిగిన కాకతీయ మెడికల్ కళాశాలలో హెల్త్ యూనివర్సీటీని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఇదే అనువైన ప్రదేశమని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంచందర్ ధరక్ ఇంతకు ముందే ప్రభుత్వానికి నివేదికలు సైతం పంపించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్‌కు ఆర్టీసీతోపాటు రైలు మార్గం అందుబాటులో ఉండడం ఇందుకు కలిసొచ్చే విషయమని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో హెల్త్యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల మెడికల్ సీట్లు పెరగడంతోపాటు వైద్యసేవలు మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంజీఎంకు మహర్దశ వచ్చేనా తెలంగాణ ప్రాంతంలో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన మహాత్మాగాంధీ మోమోరియల్ ఆస్పత్రికి మహర్దశ రానుందని ఈ ప్రాంత ప్రజలతోపాటు వైద్యులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 సంవత్సరంలో ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత క్రమంలో వచ్చిన పాలకులు పట్టింకుకోకపోవడంతో సూపర్‌స్పెషాలిటీ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. దీంతో రోగులు హైదరాబాద్‌కు వెళ్లక తప్పడం లేదు. చికిత్స కోసం వెళుతూ మార్గ మధ్యలో మృతి చెందినవారు అనేకమంది ఉన్నారు.