breaking news
Mayan culture
-
మేఘాలయ యుగం!
కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల గురించి విని ఉంటారు... ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు సంబంధించినవి.. మరి ఆధునిక సైన్స్ ఏం చెబుతోంది? గతం గురించి కాకపోయినా.. ఇటీవలి కాలం మాత్రం మేఘాలయ యుగానిదంటోంది! ఎందుకలా? సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి ఇప్పటివరకూ బోలెడన్ని ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జీవం పుట్టుక మొదలుకొని.. వేర్వేరు కారణాలతో జీవజాతులు దాదాపుగా అంతరించిపోవడం వరకూ ఉన్న ఈ ఘటనల ఆధారంగా శాస్త్రవేత్తలు భూమి చరిత్ర మొత్తాన్ని కొన్ని యుగాలుగా విడదీశారు. స్థూలంగా పాలియోజోయిక్, మెసోజోయిక్, సెనోజోయిక్ అనే మూడు భాగాలు ఉంటే.. మళ్లీ ఒక్కోదాంట్లో ఉప విభాగాలూ ఉన్నాయి. ఈ విభజన ప్రకారం మనం ప్రస్తుతం సెనోజోయిక్ భాగంలోని హాలోసీన్ యుగంలో ఉన్నాం! ఒకప్పుడు మంచుముద్దగా ఉన్న భూమిపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని.. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయన్న ఘటనకు పెట్టిన పేరిది. సుమారు 11,700 ఏళ్ల చరిత్ర ఉంది హాలోసీన్కు. అయితే ఈ మధ్య కాలంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు మేఘాలయలో లభ్యమైన కొన్ని ఆధారాలు మొత్తం చరిత్రను మలుపు తిప్పేవే. దీంతో 4,200 ఏళ్ల క్రితం నుంచి ఇటీవల ఉన్న కాలాన్ని.. కచ్చితంగా చెప్పాలంటే 1950 వరకూ ఉన్న కాలాన్ని ‘‘మేఘాలయ యుగం’’అని పేరు పెట్టాలని శాస్త్రవేత్తలు తీర్మానించారు. – సాక్షి, హైదరాబాద్ నాగరికతలను మింగేసిన కరువు మొదలైంది అప్పుడే... హరప్పన్ నాగరికత అంతరించి పోయిందెలా? దశాబ్దాల కరువని సైన్స్ చెబుతోంది! మరి దక్షిణ అమెరికాలోని మాయన్ నాగరికత మాటేమిటి? అవి కూడా కరువు కాటకాలతోనే కానరాకుండా పోయాయి. పర్షియా ప్రాంతపు సుమేరియన్, ఈజిప్టులోని నైలు నదీ నాగరికతల పరిస్థితి కూడా ఇంతే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నాగరికతలన్నీ సుమారు 4,200 ఏళ్లకు కొంచెం అటు ఇటుగా అంతరించిపోవడం. మేఘాలయలోని ఒక రకమైన రాయి (స్టాల్గమేట్)తో కూడిన గుహల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినప్పుడు ఆ కాలం నాటి గుర్తులు కొన్ని రసాయనాల రూపంలో బయటపడ్డాయి. కరువు కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం ఈ రాళ్లలో కనిపించింది. నాగరికతలు అంతరించిపోవడమన్నది భూమి చరిత్రలో కీలకమైన ఘట్టం కాబట్టి.. అందుకు ఆధారాలు లభించిన ప్రాంతం మేఘాలయ ఆధారంగా దీన్ని కొత్త యుగంగా గుర్తించాలని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ స్ట్రాటిగ్రఫీ అనే సంస్థ ప్రతిపాదించింది. హాలోసీన్ యుగంలో కొంత భాగాన్ని నార్త్గ్రిప్పియన్ యుగంగానూ.. మిగిలిన భాగాన్ని మేఘాలియన్ యుగంగానూ గుర్తించాలన్న ఈ సంస్థ ప్రతిపాదనను ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియలాజికల్ సైన్సెస్ ఆమోదించాల్సి ఉంది. -
ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్లీ గురూ...!
మెక్సికోలో టులుమ్ జాతీయ పార్కులో మయన్ నాగరికత సంబంధించిన కట్టడాలున్నాయి. ఇది బాగా ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం. ఏటా దాదాపు 20 లక్షల పైచిలుకు పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తారు. ఆదాయం పెంచుకోవడంపై రకరకాల ఆలోచనలు చేస్తున్న నిర్వాహకులకు ఎవరి చేతిలో చూసినా సెల్ఫీ స్టిక్లు, స్మార్ట్ఫోన్లు కనపడటంతో వెంటనే ఓ ఐడియా తట్టింది. ఈ ప్రాంతంలో సెల్ఫీ తీసుకోవాలంటే... రెండున్నర డాలర్లు (దాదాపు 170 రూపాయలు) కట్టాలని తీర్మానించేశారు. ఇదెక్కడి చిత్రమైన బాదుడంటూ పర్యాటకులు గొణుక్కుంటున్నారట.