breaking news
marriage expenditure
-
పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్ ప్లాన్..! చాలా డబ్బు ఆదా..
పెళ్లి అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా మధురానుభూతులను మిగిల్చేలా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఆర్థిక స్థోమత లేకపోయినా ఖర్చుచేసేందుకు వెనుకాడరు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానంగా షాపింగ్ కోసం భారీగా ఖర్చుచేస్తారు. సంపన్న కుటుంబాలైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లిమరీ షాపింగ్ చేస్తుంటాయి. మధ్యతరగతి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నంతలో కాస్త మెరుగైన వస్తువులు ధర ఎక్కువైనా కొనేందుకే ఆసక్తి చూపుతారు. అయితే పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ షాపుల్లో ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖర్చులను తెలివిగా ప్లాన్ చేసి తగ్గించుకోవాలి. అందుకోసం నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. బడ్జెట్ ప్రణాళిక షాపింగ్ చేసే ముందు బడ్జెట్ ప్రణాళిక వేసుకోవాలి. పెళ్లి షాపింగ్ ఒక్కటే ఖర్చు కాదు.. అనేక వ్యయాల ఉంటాయి. ప్రతి ఖర్చులోను తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. షాపింగ్ ప్రారంభించే ముందు ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించుకోవాలి. వివిధ వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. అలాగని బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు. బడ్జెట్లో వచ్చే వస్తువులను కొనుగోలు చేయాలి. తగిన బడ్జెట్‌ను ముందే సెట్ చేసుకోవడం వల్ల అధిక వ్యయం చేయకుండా ఉంటారు. అవసరమైన కొనుగోళ్లకే ప్రాధాన్యతనిస్తారు. షాపింగ్ జాబితా.. అవసరమయ్యే వస్తువుల జాబితాను ఇంటి దగ్గరే సిద్ధం చేసుకోవాలి. కొనుగోలు సమయంలో ఆ జాబితాకే కట్టుబడి ఉండాలి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఇది నిరోధిస్తుంది. అంతేకాకుండా, వివాహానికి సరిపడా అన్ని వస్తువులు ఒకేచోట లభించకపోవచ్చు. చాలా చోట్ల షాపింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతిచోటా అనవసర కొనుగోళ్లు చేయకుండా జాబితా ఉపయోగపడుతుంది. చాలామంది రిటైలర్లు వ్యూహాత్మకంగా క్యాష్ / చెక్అవుట్ కౌంటర్ల వద్ద ఆకర్షణీయ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. వాటిపై దృష్టి పెట్టకపోవడమే మంచిది. లిస్ట్‌లో రాసుకున్నవాటినే కొనుగోలు చేయడం వల్ల మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. పోలిక మంచిదే వస్తువులను చూసిన మొదటి షాప్‌లోనే కొనుగోలు చేయనక్కర్లలేదు. నాణ్యతగల వస్తువును, సరైన ధరకు పొందుతున్నారని నిర్ధరించుకోవడానికి వివిధ రిటైలర్లు, ఆన్లైన్ స్టోర్స్ ధరలతో సరిపోల్చండి. కొన్ని పేరున్న దుకాణాల్లో, ఆన్లైన్ రిటైలర్స్ వద్ద కొన్ని రోజులలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్స్ మరింతగా ఉండొచ్చు. ఉదయంపూట షాపింగ్ మార్నింగ్ షాపింగ్ చేయడం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి, దుకాణదారులు ఎక్కువ ఐటెమ్స్‌ను విసుగు లేకుండా చూపిస్తారు. బేరమాడడానికి అవకాశముంటుంది. కొన్ని దుకాణాలలో ఎక్కువ జనాదరణ పొందిన వస్తువులు త్వరగా అయిపోతాయి. ఉదయం వెళ్లడం వల్ల వాటిని పొందొచ్చు. నగదు చెల్లిస్తే మేలు షాపింగ్ సమయంలో డెబిట్ / క్రెడిట్ కార్డులను, యూపీఐను ఉపయోగిస్తుంటారు. మీ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా కొనుగోలు చేయగలిగిన వాటిని మాత్రమే డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయాలి. జేబులో నగదును ఇచ్చేటప్పుడు ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచిస్తాం! దీనివల్ల కొంతవరకు ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరెంతో తెలుసా.. క్రెడిట్ కార్డులు కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. చాలా క్రెడిట్ కార్డులు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. కొన్ని సీజన్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్స్‌ను పొందగలరో లేదో తెలుసుకోవడానికి మీ కార్డ్ నిబంధనలు, షరతులను చెక్ చేయండి. డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో ఖర్చులు చేసేటప్పుడు ఈ పాయింట్లు ఉపయోగపడతాయి. -
‘వివాహ ఖర్చులు వెల్లడించాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : వివాహ సమయంలో పెట్టే ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి సిఫారసు చేసింది. వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు సంయుక్తంగా ఖర్చు వివరాలను వివాహ ధ్రువీకరణ అధికారి వద్ద నమోదు చేసేలా నిబంధన తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తద్వారా వరకట్న దురాచారాన్ని రూపుమాపడంతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులను నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వివాహ సమయంలో చేసే ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్ చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చని వ్యాఖ్యానించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇంతకు ముందున్న చట్టాల్లో సవరణలు చేయాల్సిందిగా కోరింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ఇంత బరువు భావ్యమా?
నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా హుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారింట’’ అన్నాడో సినీకవి. నిజమే! ఎవరం కోరుకునేదయినా అదే! వారి వారి అంతస్తులు, ఆస్తిపాస్తులతో నిమిత్తం లేకుండా ఏ ఇంటి ఆడబిడ్డయినా, మగబిడ్డయినా యుక్తవయసు రాగానే సరిజోడయిన వారితో పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటాం. చక్కగా పెళ్లయి, సంతానం పొంది, పిల్లా, పాపలతో బతికినంత కాలం సుఖసంతోషాలతో ఉండాలనేదే ఎవరి కోరికైనా! మానవ మనుగడలో పెళ్లి అనేదొక కీలక ఘట్టం. ఇద్దర్ని జత కలపడమే కాకుండా, ఇకపై వారు ఉమ్మడిగా దాంపత్య జీవితం కొనసాగిస్తారని అందరికీ తెలియజెప్పడానికే పెళ్లి అంటారు పెద్దలు. ఇది, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబాల బహిరంగ వేడుక. దీవించ వచ్చే వందలు, వేలాది మంది దానికి సాక్షులు. సాధారణ పరిస్థితుల్లో పెళ్లి వీలయినంత తక్కువ వ్యయంతో జరగాలనే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు వెల్లడిస్తున్నాయి. కానీ, క్రమంగా పరిస్థితి మారుతోంది. ఒకరకంగా చేయి దాటిపోతోంది. పెళ్లి అనే పవిత్ర ప్రక్రియను చుట్టుముట్టి కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘిక దురాచారాలు వేర్వేరు కాలాల్లో చాలా కుటుంబాల్ని వేధించాయి, ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. కుటుంబాలే రగిలే సామాజిక అశాంతికి అవి పోసిన ఆజ్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడిక, అసాధారణ వ్యయభారంతో పెళ్లి ప్రక్రియే ఓ గుదిబండలా తయారయింది. ఖరీదయిన, ఖర్చుతో కూడిన పెద్ద ఆర్థిక వ్యవహారం అయింది. పేద, మధ్యతరగతి వారికి, ఉద్యోగులు, అల్పాదాయవర్గాలు, ఆర్థిక స్తోమత అంతంతగా ఉన్నవారికి పెళ్లంటేనే భయం కలిగించే పరిస్థితి నెలకొంది. కొందరు సంపన్నులకిది ‘సంపద అసభ్య ప్రదర్శన’కు ఓ అవకాశమైంది. మరికొందరు, హంగూ –ఆర్భాటాల పెళ్లితో తమ ఆర్థిక–సామాజిక హోదాను చాటుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల పెళ్లిని ఓ పెద్ద తంతుగా మార్చి, లెక్కకు మిక్కిలి డబ్బు వ్యయం చేస్తున్న తీరు గగుర్పాటు కలిగిస్తోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. కొందరు హెచ్చు లకోసం, ఇంకొందరు దర్పం కోసం, మరి కొందరు సంపద ప్రదర్శన కోసం చేస్తే.... అత్యధికులు ‘ఇక మాకూ తప్పదేమో!’ అనే అపోహలో చేస్తున్నారు. సాటివారితో సరిపోల్చుకొని తామూ హంగులు, ఆర్భాటాలకు పోతున్నారు. ఈ వడిలో పడి ఆస్తులు కరిగిస్తున్నారు, లేదంటే అప్పుల పాలవుతున్నారు. కమ్మేసిన మార్కెట్ మాయ! సమాజంలో పలు అంశాల్లాగే క్రమంగా పెళ్లినీ మార్కెట్ మాయ కమ్మేసింది. పెళ్లి ఏ పవిత్రతనూ వదలకుండా ప్రతి అంశాన్నీ మార్కెట్ తన పిడికిట్లోకి లాక్కుంది. అనుబంధ వ్యవహారాలన్నింటిలోకి మార్కెట్ చొరబడింది. పెళ్లి చేసే వారి మెడపై కత్తి పెట్టి వసూళ్లకు దిగినట్టుంది పరిస్థితి. వారది తమ అవసరమనుకుంటే, వీరికిది అవకాశం! సాధారణ కుటుంబాల్లోనూ ఈ అయిదారేళ్లలోనే పెళ్లి వ్యయం సగటున 30 నుంచి 40 శాతం పెరిగింది. వెరసి ఒకో పెళ్లి ఖర్చు లక్షలు, కొన్నిచోట్ల కోట్ల రూపాయలకు విస్తరించింది. పదేళ్ల కింద, నగరంలో పేరు మోసిన ఓ డాక్టర్ నాతో మాట్లాడుతూ ‘‘.... ఏమిటిది! ప్లేటు 800 రూపాయలట, పెళ్లికి కనీసం 2000 మంది వస్తారనుకుంటున్నాము. ఒక్కపూట భోజనానికే 16 లక్షల రూపాయలు, మా వియ్యంకుడైనా, నేనైనా.. సరే మేమిద్దరం పెట్టగలిగిన వాళ్లం కనుక, చెరిసగం భరిస్తున్నాం. పెట్టలేని వాళ్ల సంగతేంటి? లేదు... ఎక్కడో ఈ దుబారా పరిస్థితి మారాలి. మీ బోటివాళ్లు ప్రసంగాల్లోనో, వ్యాసాల్లోనో చెప్పి ఓ సామాజిక మార్పుకు నాంది పలకాలి’ అన్నారు. ఈ దశాబ్దకాలంలో అది మారకపోగా మరింత దిగజారింది. స్థాయి ఉందో, లేదో కూడా చూసుకోకుండా నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ ఈ మూడూ దాదాపు తప్పనిసరి ప్రక్రియలయ్యాయి. పెళ్లి పత్రికల నుంచే చేతి చమురు వదలడం మొదలవుతుంది. అక్కడ్నుంచి బట్టలు–నగల కొనుగోళ్లు, మంటపాలు, వేదిక, పూల అలంకరణ, వీడియో ప్రొమోలు, డ్రెస్ డిజైనింగ్–మేకప్, ఫొటో–వీడియోగ్రఫీ, కొరియోగ్రఫీ.... ఇలా ప్రతి వ్యవహారమూ ఖరీదే! ఎంత గిరిగీసి లెక్కేసినా ఖర్చు గిర్రున తిరిగే మీటరే! వాటికి తోడు మెహంది, సంగీత్ ఉత్సవాలు జరిపే సంస్కృతి తోడయింది. అపరిమితమైన మాంసాహార భోజనాలు, మద్యం టేబుళ్లతో విందులు, రిటర్న్ గిఫ్టులు.... ఖర్చు ఆలోచించండి! ఇక రిసార్టులో, స్టార్ హోటళ్లో బుక్ చేసుకొని ఎక్కడో గోవానో, జైపూరో, ఇండొనేíసియానో.... వెళ్లి జరిపే ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ వ్యయానికి లెక్కే లేదు. సంప్రదాయిక విలువలేమయ్యాయి? నిజానికి పెళ్లి ఏ హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా జరుపుకుంటే తప్పేంటి? పెళ్లి పవిత్రతను గౌరవించినట్టూ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ఇంటి ముందు పచ్చని పందిరి వేసి, ఇరు కుటుంబాలు, ఇరుగుపొరుగే కాకుండా బంధువర్గమందరినీ పిలుచుకొని మూడు రోజుల పండుగయినా చాలా çహుందాగా, సంతోషంగా జరుపుకోవచ్చు. ఆత్మీయ కలయికలా ఉంటుంది. ఖర్చు రమారమి తగ్గుతుంది. భూలోకమంత పీట, ఆకాశమంత పందిరే వేయక్కర్లేదు. ఇరు కుటుంబాల వారి మనసులు కలిస్తే చాలు. ఇంటి ముంగిట పెళ్లి నిర్వహణ ఎంతో సౌలభ్యం! వచ్చేవారి సౌకర్యమనే సాకు చూపి అందరూ నేల విడిచి సాము చేస్తున్నారు, డబ్బు తగలేస్తున్నారు. మధ్య, అల్పాదాయాల వారిపై సంపన్నులు ఒత్తిడి పెంచుతున్నారు. నగరాలు, పట్టణాలు, చివరకు మండల కేంద్రాల్లోని ఫంక్షన్ హాళ్లలోనే పెళ్లిళ్లు. సీనియర్ పాత్రికేయుడొకరంటారు.. ‘మా ఊళ్లోగాని, మా మండలంలోగాని, ఆ మాటకొస్తే నాకు తెలిసిన వాళ్లెవరూ గడచిన మూడేళ్లలో.. ఇంటిముందు వేసిన పచ్చని పందిట్లో పెళ్లి జరిపిన సందర్భమే నే చూడలేదు’అని. ఫంక్షన్ హాళ్లదీ ఓ మాయ! హాలుకే పెద్ద మొత్తం చార్జీ చేస్తారు. అది కాకుండా ఇక వేదికపై అలంకరణ, కుర్చీలు, వంట సామగ్రి, దేనికదే ప్రత్యేక చార్జీ! పురోహితుడి నుంచి బాజా, భజంత్రీ, సన్నాయి, పూలవాడు, మైక్‌సెట్టు, పాటకచేరీ.... ఇలా అందరి వ్యాపారమూ హాల్ వాడితో ముడివడి ఉంటుంది చాలా సందర్భాల్లో! అదో మాయా మేళం! మండల కేంద్రాల్లో, రెండు మూడు పెద్ద గ్రామాల మధ్యలో ఇటీవల చాలా ఫంక్షన్ హాళ్లు వెలిశాయి. కరీంనగర్, వరంగల్ వంటి జిల్లా కేంద్రాలతో పాటు పలు పట్టణాల్లో దాదాపు కమ్యూనిటీ హాళ్లన్నీ ఇలాంటి కమర్షియల్ ఫంక్షన్ హాళ్లయ్యాయి. ఆర్థికంగా స్థితిమంతులయిన వారు హడావుడి చేస్తున్నారు. సామాజికంగా, బంధుత్వాల పరంగా సమస్థాయిగల వారు తమ వద్ద సొమ్ము లేకపోయినా... హెచ్చులకు అదే స్థాయిలో పెళ్లిళ్లు్ల చేస్తున్నారు. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ చేయి కాల్చుకుంటున్నారు. పోల్చి చూసుకోవడం, ఫలానా వారికన్నా తగ్గొద్దనే భావనలు పెరిగాయి. ఖర్చు తట్టుకోవడానికి, ఉంటే ఆస్తులు కరిగేసుకోవడం, లేదంటే అప్పో, సప్పో చేయడం రివాజయింది. అప్పటి వరకు నిబ్బరంగా, గౌరవంగా బతికిన కుటుంబాలు, పెళ్లి తర్వాత చితికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. హన్మకొండలో తాహతుకు మించిన ఖర్చుతో పెళ్లి చేసిన ఓ ఉమ్మడి కుటుంబం తర్వాత విడివడి, చితికిపోయింది. కరీంనగర్లో ఓ వ్యాపారి పెళ్లి జరుగుతున్నంత సేçపూ హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించి, తర్వాత ఐటీ దాడులు, ఆస్తికి సరితూగని ఆదాయవనరులు... కేసుల్లో ఇరుక్కుని నలిగిపోయాడు. చట్టపరంగా నియంత్రించే యత్నాలు... పెళ్లికొచ్చే అతిథుల సంఖ్యపైన, వంటకాలపైన, మొత్తం పెళ్లి ఖర్చులపైన పరిమితులు విధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇందుకోసం ఓ చట్టమే ఉండాలనేది అభిమతం. కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ లోక్‌సభలో కిందటేడు ఒక (ప్రయివేటు మెంబరు) బిల్లును ప్రతిపాదించారు. ఈ ‘పెళ్లి (తప్పనిసరి రిజిస్ట్రేషన్–అనవసర వ్యయ నియంత్రణ) బిల్లు’కు ఆమోదం లభించలేదు. 2011లో అఖిలేష్ దాస్‌గుప్త రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు లాంటిదే! అతిథుల సంఖ్య, విందులో వంటకాలపై పరిమితికి యత్నం. పెళ్లి ఖర్చు రూ.5 లక్షల వరకే అనుమతించాలని, మించితే పది శాతం చొప్పున స్థానిక ప్రభుత్వాలకు చెల్లించేలా చర్యలుండాలని ప్రతిపాదించారు. ఆ డబ్బును పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని ప్రతిపాదన. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1996లో సరోజ్ కపర్దే, 2005లో ప్రేమ్ కరియప్ప రాజ్యసభలోను, 2005లోనే తెలుగు ఎంపీ రాయపాటి సాంబశివరావు, 2011లో పి.జె.కురియన్, అదే సంవత్సరం మహేంద్ర చౌహాన్లు లోక్‌సభలో దాదాపు ఇటువంటి బిల్లుల్నే ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చులపైన, జల్సాలపైన, ఆహారం వృథాపైన నియంత్రణ ఉండాలంటూ ఇలాంటి బిల్లులు జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిపాదనకు వచ్చాయి. పొరుగుదేశం పాకి స్తాన్‌లో పెళ్లి వ్యయం, అతిథుల సంఖ్యపై నియంత్రణ ఉంది. పెళ్లిళ్లు, రిసెప్షన్లలో వచ్చే అతిథుల సంఖ్య, వడ్డించే ఆహారపదార్థాల సంఖ్య, మైకుల వినియోగం, టపాసులు కాల్చడంపై నియంత్రణ విధిస్తూ గత సంవత్సరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఇదే యత్నాలు ఇతర రాష్ట్రాల్లోనూ సాగుతున్నాయి. సమగ్ర చట్టం వస్తే తప్ప ఈ పెళ్లి దుబారాలను, డీజేలు, రికార్డింగ్ డాన్స్‌లు, పెద్దపెద్ద శబ్దాలతో గంటల తరబడి సాగే బారాత్‌లను నియంత్రించలేమని పోలీసులంటు న్నారు. పబ్లిక్ న్యూసెన్స్ తప్ప వేరే కేసులు పెట్టలేకపోతున్నామని వారి వాదన. పెళ్లి ముగింపు కాదు ఆరంభం ఉన్న డబ్బంతా కరిగించి జల్సా చేయడానికి పెళ్లేం ముగింపు వేడుక కాదు, ఇది దాంపత్య జీవితానికి ఆరంభం! పెళ్లిలో దుబారా ఆపి, పొదుపు ద్వారా మిగిల్చే డబ్బు ఆ దంపతులకిచ్చినా ఓ గొప్ప భరోసాతో వారి ఉమ్మడి జీవితం మొదలవుతుంది. తదుపరి దశలో పిల్లల పెంపకం, విద్య, వైద్యం వంటి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు, నియంత్రించ గలిగిన చోటన్నా ఎందుకు చేయరనేది ప్రశ్న! పెళ్లి జీవిత కాలపు వేడుకే! అది జీవితాన్ని వెలిగించేదవాలి తప్ప ఖర్చు తడిసి మోపెడై నలిపేసేది కావద్దు! దిలీప్ రెడ్డి dileepreddy@sakshi.com -
పెళ్లిళ్ల ఖర్చు రూ.5 లక్షలే!
తిరువనంతపురం: అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తూ అందుకు విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులను నియంత్రించాలని కేరళ మహిళా కమిషన్ నిర్ణయించింది. ఓ పెళ్లికి ఖర్చు ఐదు లక్షల రూపాయలకు మించకూడదంటూ కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పెళ్లి కూతురు నగల కోసం 80 గ్రాములకు మించి బంగారం కొనరాదని, పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్య 200లకు దాటకూడదని, పెళ్లి కూతురు దుస్తులపై పది వేలు, పెళ్లి కొడుకు దుస్తులపై ఐదువేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదని, పెళ్లి వేదికకు పాతిక వేలకు మించి ఖర్చు చేయరాదని, భోజనానికి ప్లేటుకు వంద రూపాయలు మించరాదంటూ ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రంలో ఎవరైనా పెళ్లి కోసం మొత్తంగా ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చుచేస్తే, ఆ చేసిన దానిపై 25 శాతం జరిమానా విధించాలని, తద్వారా వచ్చిన సొమ్మును పేద పిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని కూడా మహిళా కమిషన్ సూచించింది. ధనవంతులు తమ వైభవాన్ని చాటుకోవడానికి పెళ్లిళ్ల పేరిట చేస్తున్న ఖర్చులు మధ్యతరగతి, పేదల పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని, వైభవంగా పెళ్లి చేయడం కోసం ఇల్లు అమ్ముకున్న కుటుంబాల గురించి కూడా తనకు తెలుసునని, అందుకే ఇలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని మహిళా కమిషన్ చైర్పర్సన్ కేసి రోసకుట్టి చెప్పారు. ఆమె ప్యానెల్ చేసిన ఈ ప్రతిపాదనలు దేశంలోనే కాకుండా ఎన్నారైల్లో కూడా పెద్ద చ ర్చకు దారితీశాయి. దేశంలో బంగారు నగలు కాకుండా పెళ్లిళ్లపై ఏడాదికి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ కావడం విశేషం. దేశంలో ప్రతి ఏడాది జరుగుతున్న బంగారం కొనుగోళ్లలో కేరళ వాటా 20 శాతం. అందులో 75 శాతాన్ని పెళ్లిళ్ల కోసమే కొనుగోలు చేస్తోంది. తన కై్లంట్ ఒక్కొక్కరు ఒక్కో పెళ్లిపై నగలు, దుస్తులు కాకుండా సగటున యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కోచిలోని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ తెలియజేసింది. ఈ సరికొత్త ప్రతిపాదనలపై వ్యాపారస్థులు, సామాజిక కార్యకర్తలు పరస్పరం భిన్నంగా స్పందించారు. పెళ్లిళ్ల పరిశ్రమను నమ్ముకొని వ్యాపారస్థులే కాకుండా కొన్ని వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, ఇప్పుడు ఆంక్షలు విధిస్తే వారంతా వీధుల్లో పడతారని వ్యాపారస్థులు చెబుతున్నారు. బట్టల షాపులు, నగల షాపులు ప్రధానంగా పెళ్లిళ్ల కోసమే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని, మహిళా కమిషన్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే వారంతా తమ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ సామాజిక కార్యకర్తలు మాత్రం పెళ్లిళ్ల పేరిట వృధాగా చేస్తున్న ఖర్చును ఆంక్షల ద్వారా అరికట్టవచ్చని చెబుతున్నారు. చట్టపరంగా ఆంక్షలు తీసుకొస్తే ఫలితం ఉండదని, పెళ్లి అనేది సంస్కృతితో ముడిపడిన కార్యక్రమం అవడం వల్ల ప్రజల్లో సామాజిక స్పృహను తీసుకరావడమే పరిష్కారమని దుబాయ్‌లో పనిచేస్తున్న బిజినెస్ జర్నలిస్ట్ కే రవీంద్రన్ అభిప్రాయపడ్డారు.