breaking news
mandolin shrinivas
-
మాండలిన్ శ్రీనివాస్‌కు నివాళిగా దేవీ శ్రీ ఆల్బమ్
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌కు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఫిబ్రవరి 28న మాండలిన్ శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురవే నమః పేరుతో ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ పాటకు దేవీ శ్రీ స్వయంగా కాన్సెప్ట్ డిజైన్ చేసి, సంగీతం అందించి ఆలపించాడు. ఈ పాట కేవలం ఏదో ఒక భాషకు పరిమితం కావొద్దన్న ఉద్దేశంతో సంస్కృతంలో రూపొందించాడు. గురువు, సంగీతాల గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. 'గురువు గొప్పదనాన్ని మాటల్లో చెప్పలేం అందుకే నేను సంగీతంతో చెప్పే ప్రయత్నం చేశానన్నా'డు దేవీ శ్రీ. అంతేకాదు తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌కు నివాళిగా రూపొందించిన ఈ పాటను ఆయనకు ఎంతో ఇష్టమైన కీరవాణి రాగంలో రూపొందించినట్టుగా తెలిపారు. వీడియో రూపంలో కూడా రిలీజ్ కానున్న ఈ ఆల్బమ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాండలిన్ శ్రీనివాస్ అభిమానులు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ దేవీ శ్రీ కృతజ్ఞతలు తెలియజేశాడు. లహరి మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ ఆల్బమ్‌ను రిలీజ్ చేయటంతో పాటు ప్రముఖ సంగీతకారులు ఉస్తాద్ అంజాద్ అలీఖాన్, డ్రమ్స్ శివమణి, మాండలిన్ యు రాజేష్ లతో కలిసి ద గ్రేట్ మాండలిన్ పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించనున్నారు. అతి చిన్న వయసులో దేవీ శ్రీ ప్రసాద్‌కు మాండలిన్‌ను పరిచయం చేసిన శ్రీనివాస్, దేవీ కూడా మాండలిన్ విద్వాంసుడిగా ఎదగాలని ఆశించారు. తరువాత సంగీత దర్శకుడిగా మారిన దేవీ శ్రీ పలు వేదిక మీద మాండలిన్ శ్రీనివాస్ పట్ల తన గురుభక్తిని చూపించారు. -
పార్థీవదేహం వద్ద డ్రమ్స్ వాయించి నివాళి
చెన్నె: తన సన్నిహితుడు మాండలిన్ శ్రీనివాస్ మరణాన్ని ప్రముఖ డ్రమ్మర్ శివమణి జీర్ణించుకోలేకపోయాడు. సంగీత ప్రయాణంలో తనతో పాటు పయనించిన మిత్రుడు ఆకస్మికంగా తరలనిరాని దూరాలకు వెళ్లిపోవడంతో ఆయన క్రుంగిపోయాడు. తన సంగీత స్నేహితుడికి తన వాయిద్యంతో శ్రద్ధాంజలి ఘటించాడు. మాండలిన్ శ్రీనివాస్ పార్థీవదేహం వద్ద డ్రమ్ వాయించి కన్నీటి నివాళి అర్పించాడు. అంతేకాదు మాండలిన్ మాంత్రికుణ్ని 'కర్ణాటక సంగీత మహాన్' అంటూ కొనియాడాడు. శ్రీనివాస్ తనకు గురువు అంటూ సంబోధించారు. ఆయనతో కలిసి పలు కచేరీలు చేశానని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ మరణం వ్యక్తిగతంగా తనకెంటో లోటు అని శివమణి పేర్కొన్నారు.