మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి రైల్వేస్టేషన్ (Malkajgiri railway station) పునరభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున చర్లపల్లి తర్వాత సకల సదుపాయాలతో మల్కాజిగిరి వినియోగంలోకి రానుంది. ప్రధాన ముఖద్వారంతో పాటు స్టేషన్ విస్తరణ, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం (amrut bharat scheme) కింద సుమారు రూ.27.61 కోట్లతో మల్కాజిగిరి అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగతా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.సబర్బన్ రైళ్లతో పాటు పలు దూర ప్రాంత రైళ్లకు మల్కాజిగిరిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మల్కాజిగిరి స్టేషన్లో పునరభివృద్ధి వల్ల విశాలమైన కాన్కోర్స్, విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే.. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సబర్బన్ గ్రేడ్–3 కేటగిరీకి చెందిన మల్కాజిగిరి స్టేషన్ నుంచి ప్రతి రోజు 2500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఏటా రూ.5.48 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రతి రోజు 27 జతల రైళ్లు మల్కాజిగిరిలో ఆగుతాయి.పునరభివృద్ధి పనులు ఇలా.. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)తో పాటు 3 లిఫ్టులు మరో 3 ఎస్కలేటర్లు. పెరగనున్న ప్లాట్‌ఫామ్ ఉపరితలం ఎత్తు. ప్లాట్‌ఫామ్‌పై అదనపు పై కప్పు ఏర్పాటు. ఇప్పటి వరకు టాయిలెట్ బ్లాకుల నిర్మాణం పూర్తయింది. వెయిటింగ్ హాల్ అభివృద్ధి చేశారు. వాహనాల పార్కింగ్తో పాటు పచ్చదనం విస్తరణపై ప్రత్యేక దృష్టి. ప్రయాణికులను ఆకట్టుకొనేలా కళలు, సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 40 స్టేషన్లు. చదవండి: పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్ఆర్ఎస్ రాయితీ