breaking news
Makhdoom Bhavan
-
కొత్తగూడెం సీటు.. రెండు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వడంతోపాటు, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నాయకత్వాలను సంప్రదించిన తర్వాత ఈ మేరకు ఒప్పందానికి వచ్చామని చెప్పారు. రేవంత్ సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షీ, కార్యదర్శి విష్ణుదాస్ ఆయన వెంట ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులతో పొత్తుపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తమపై ఉన్న రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామా లు, పరిస్థితులను సీపీఐ నేతలకు వివరించామని రేవంత్ తెలిపారు. పేదల తరఫున నిలబడేందుకు, పెద్ద మనసుతో ముందుకు రావాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తికి సీపీఐ అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, సీపీఐల మధ్య స్పష్టమైన పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని కోరారు. సెక్యులర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేందుకు, పేద, సామాన్యుల సమస్యలు చట్ట సభలలో ప్రస్తావనకు వచ్చేలా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శాసనమండలిలో సీపీఐకి చెందిన ఇద్దరు సభ్యులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మునుగోడు సీటుపైనా చర్చ జరిగిందని, అక్కడ స్నేహ పూర్వక పోటీ వద్దని సీపీఐని కోరామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. సీపీఎంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దగా పడిన ప్రజల విముక్తే లక్ష్యం: నారాయణ బీఆర్ఎస్ చేతిలో దగాపడిన ప్రజానీకానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఇందుకోసమే సీపీఐ, కాంగ్రెస్ ఐక్యంగా నిలబడ్డాయని తెలిపారు. రాజకీయ, భౌతిక, అనివార్య పరిస్థితుల్లో ఒక్క కొత్తగూడెం స్థానం నుంచే పోటీకి అంగీకరించామని కూనంనేని చెప్పారు. తమ స్నేహ బంధంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలావుండగా తాను ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూనంనేని ఖమ్మంలో చెప్పారు. ప్రజలు అన్ని విషయాలను గమనించి ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించాలని, ప్రజలను మరిచి పాలన చేస్తున్న పాలకులను ఓడించాలని పిలుపునిచ్చారు. కూనంనేని కార్యదర్శిగా కొనసాగేనా? కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ చేయనుండటంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కొనసాగుతారా లేదా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఆయన పూర్తి బిజీగా ఉంటే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఎవరెవరికి దక్కవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సీపీఐ ఎన్నికల కన్వీనర్‌గా చాడ వెంకట్‌రెడ్డిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
రేపు సీపీఐ 91వ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్లో సోమవారం (26న) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, తర్వాత మఖ్దూం భవన్ నుంచి బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ తీసి అక్కడ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సభలో పార్టీ నేతలు సురవరం, అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి తదితరులు ప్రసంగిస్తారని చాడ తెలిపారు. -
ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: సర్వేల వాపును చూసి బలుపని భ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పొరపాటున ముందస్తు ఎన్నికలకు వెళితే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మఖ్దూం భవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై సీపీఐ పార్టీ దృష్టి సారించిందని చెప్పారు. నవంబర్ 3 నుంచి 23 వరకు జిల్లాల వారీగా నిర్మాణ మహాసభలు నిర్వహించి, నవంబర్ 28 నుంచి 30 వరకు వరంగల్‌లో రాష్ట్ర పార్టీ నిర్మాణ మహాసభలను నిర్వహించాలని కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయించిందన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమేర్పడిందని, కృష్ణా జలాలపై హక్కులను సాధించుకునేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.